Karthika Deepam 2 January 21st: జ్యోత్స్న పుట్టుకపై కాంచనలో అనుమానం... దాస్ జాడ లేక పారిజాతం టెన్షన్
Photo Courtesy: JioHotstar
బిడ్డ జాగ్రత్త అని గురువుగారు చెప్పిన మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. మా అమ్మ కూడా రోజూ నీకు ఇదే విషయం చెబుతుందని దీపతో అంటాడు కార్తీక్. మా అమ్మను కాపాడుకోవాలంటే నిజం చెప్పడం ఒక్కటే దారి అని కార్తీక్‌తో అంటుంది దీప. అయితే కార్తీక్ మాత్రం ఇప్పుడే నిజం చెప్పొద్దని.. రిపోర్ట్స్ బయటికి వచ్చాక నిజం అదే బయటపడుతుందని నచ్చచెబుతాడు. ఇంతలో సుమిత్ర వచ్చి.. నా కూతురంటే నాకు చాలా ఇష్టం. అది నన్ను ఇష్టపడకపోయినా అదంటే నాకు ప్రాణం. దానికి నీలాంటి ఓ మంచి కుర్రాడితో పెళ్లి చేసి చూసుకోవాలని చెబుతుంది కార్తీక్. నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుందని అంటాడు కార్తీక్.
దాస్ ఏమయ్యాడని పారిజాతాన్ని అడుగుతాడు. దాస్ బాబాయ్ గురించి మాకేం తెలుసని జ్యోత్స్న తప్పించుకోవాలని చూస్తుంది. అయితే దాస్ తాయెత్తుని కార్తీక్ తీసి చూపించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దాస్ బాబాయ్ ఇక్కడికి వచ్చినప్పుడు జారిపడిపోయి ఉండొచ్చని కవర్ చేస్తుంది. రెండ్రోజులు చూస్తా.. అప్పటికీ దాస్ బాబాయ్ ఆచూకీ తెలియకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటాడు కార్తీక్. ఆ మాటలతో జ్యోత్స్నకు చెమటలు పడతాయి. సుమిత్ర ఆరోగ్యం గురించి శివన్నారాయణ ఏడుస్తుండగా దశరథ ఓదారుస్తాడు. సుమిత్రకి కార్తీక్ తన చిన్నప్పటి ఫోటోను షేర్ చేయగా అది చూసి అందరూ పడి పడి నవ్వుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 21వ తేదీ 573వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కార్తీక్ ఫోటోను చూసి శివన్నారాయణ కుటుంబం ఎందుకు నవ్వుతుందో అర్ధం కాక ఏం జరిగిందో చెప్పమని సుమిత్రను అడుగుతుంది దీప. ఏంట్రా చెప్పమంటావా? అని కార్తీక్‌పై సెటైర్లు వేస్తుంది సుమిత్ర. కాంచనకి ఆడపిల్లలు లేకపోవడంతో కార్తీక్‌ని ఆడపిల్లలా తయారు చేసి తన ముచ్చట తీర్చుకునేది. అలా ఒక పండగ రోజు వీడిని ఆడపిల్లలా తయారు చేశాక.... పిల్లల్ని ఆటపట్టిస్తూ ఏదో పెళ్లి టాపిక్ వస్తే.. ఆడపిల్ల వేషంలో ఉన్న కార్తీక్‌ని మన చుట్టాల్లో ఒకబ్బాయి పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కార్తీక్ ఆడపిల్ల కాదు.. మగాడు అంటే అతను వినలేదు. వీడిని బుగ్గ మీద ముద్దు కూడా పెట్టుకున్నాడు. అది చూసి మేమంతా ఒకటే నవ్వు, వీడు కోపంతో వాడి మూతి మీద గుద్దాడు. ఆ అబ్బాయి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు. ఈ విషయం ఎక్కడ తెలిసిపోతుందోనని ఈ ఊరిలో చదవను అన్నాడు. చివరికి వీడి మావయ్యే సర్దిచెప్పాడు అంటుంది సుమిత్ర. ఆ మాటలతో అంతా పడిపడి నవ్వేస్తారు
ఆ తర్వాత తనకు జుట్టు వద్దని గుండు చేయించుకున్నాడని జ్యోత్స్న అనగా.. గుండుతో ఉన్న ఫోటో ఉందా? అని దీప సెటైర్లు వేస్తుంది. నా దగ్గర ఉందని దీపకి చూపిస్తుంది సుమిత్ర. సుమిత్ర చాలా రోజుల తర్వాత నవ్వుతూ ఉండటంతో కార్తీక్, శివన్నారాయణ, దశరథలు సంతోషిస్తారు. వెంటనే మేనల్లుడి దగ్గరికి వెళ్లి.. గుండెల్లో ఎంతో బాధను పెట్టుకుని పైకి నవ్వుతున్నావు, థ్యాంక్స్ అని అంటాడు దశరథ. నీ వల్ల చాలారోజుల తర్వాత సుమిత్ర నవ్వడం చూస్తున్నాను, నాన్న కాసేపు బాధను మరిచిపోవడం చూస్తున్నానని చెప్పి వెళ్లిపోతాడు. కుటుంబం మొత్తం ఆనందంగా ఉండటంతో దీప కూడా సంతోషిస్తుంది.
గురువుగారు చెప్పిన జ్యోస్యం, ఆసుపత్రిలో డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి జ్యోత్స్న వణికిపోతుంది. ఇంతలో పారిజాతం వచ్చి భోజనానికి పిలుస్తుంది. మెడికల్ టెస్టులంటే కాగితాలు కాదు మన జీవితాలని చెబుతుంది జ్యోత్స్న. ఇన్నాళ్లు నేను చేసిన పాపాలన్నీ కట్టకట్టుకుని ఒకేసారి ఈ ఇంటి మీదకి వస్తున్నాయని అంటుంది పారు ముందు దాస్ గాడు ఎక్కడికి పోయాడో అర్ధం కావడం లేదు.. నీ మీదే నాకు అనుమానంగా ఉందని అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వెందుకో నా దగ్గర నటిస్తున్నావని అనిపిస్తుందని పారు చెప్పడంతో జ్యోత్స్న మండిపడుతుంది.
నా మీద అనుమానం వచ్చేలా బావ ఆ తాయెత్తు గురించి నీతో చెప్పాడు.. నువ్వేమో జరగబోయే ప్రమాదం గురించి మరిచిపోయి అసలైన వారసురాలి గురించి, నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావు. ఇది నాతో మాత్రమే పోదు.. పిల్లల్ని మార్చినందుకు నిన్ను.. నిజం తెలిసినా చెప్పనందుకు నీ కొడుకుని, ఇన్నిరోజులు నాటకాలు ఆడినందుకు నన్ను.... ఎవ్వరినీ వదిలిపెట్టరు. తాత కోపం గన్‌లో బుల్లెట్స్ లాంటిది, అది తగిలితే ఇంట్లో నుంచైనా పోతాం.. ఈ భూమ్మీద నుంచైనా పోతామని జ్యోత్స్న చెప్పడంతో పారు వణికిపోతుంది. ఇది నేనే కష్టపడి కట్టుకున్న కలల కోట.. దీనిని అంత తేలికగా కూలిపోనివ్వను అంటుంది పారిజాతం. నువ్వు నీ కొడుకు దగ్గరికి పోతావు... నేను సర్వం కోల్పోతాను, రిపోర్ట్స్ అడ్డుపెట్టుకుని బావ ఏం చేస్తాడోనని భయంగా ఉందని అనుకుంటుంది జ్యోత్స్న.
రెంట్ కట్టమని దీప చేతికి డబ్బులిస్తాడు కార్తీక్. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పమని భర్తను నిలదీస్తుంది దీప. రెంట్ సంగతి సరే కానీ మా అమ్మ పరిస్ధితి ఏంటీ? అని ప్రశ్నిస్తుంది దీప. రిపోర్ట్స్ వచ్చినా ఏం జరుగుతుందో నీకు తెలియదా? ఈరోజు మా అమ్మని నవ్వించడానికి ఫోటో పంపించావు, రేపు జ్యోత్స్న సొంత కూతురు కాదని నిజం తెలిస్తే అసలు కూతురు ఎవరు అంటే ఏం చెబుతావని అడుగుతుంది దీప. అప్పుడు నీ పేరే చెబుతానులే అంటాడు కార్తీక్. అప్పటిదాకా ఎందుకు ముందే తాత, నాన్న, అమ్మకి నిజం చెప్పమంటుంది. నువ్వే తన కూతురు అని చెప్పడానికి సాక్ష్యం అడిగితే ఎలా అని కార్తీక్ అడగ్గా..... దాస్ మావయ్య ఎక్కడున్నాడో తెలియడం లేదు, నా అనుమానం జ్యోత్స్న మీదే అంటాడు కార్తీక్. రిపోర్ట్స్‌ని జ్యోత్స్న మార్చేస్తే ఎలా అని దీప అడగ్గా.. ఆ శాంపిల్స్ అస్సలు మ్యాచ్ కావని దీపతో అంటాడు కార్తీక్. ఇంతలో ఈ మాటలు విన్న కాంచన ఏం జరిగిందని అడుగుతుంది.
టాబ్లెట్స్ వేసుకోకపోవడంతో సుమిత్రపై మండిపడతాడు దశరథ... ఇది చూసిన శివన్నారాయణ మనవరాలిపై రంకెలు వేస్తాడు. జ్యోత్న్న నా మనవరాలు కాదు, సుమిత్ర కూతురు కూడా కాదని పెద్దాయన అనడంతో జ్యోత్స్న, పారులు వణికిపోతారు. నీకు జ్వరం వస్తే మీ అమ్మ నిన్ను ఎలా చూసుకుంటుంది? మరి మీ అమ్మకి ఆరోగ్యం బాలేకపోతే నువ్వెందుకు చూసుకోవడం లేదని ప్రశ్నిస్తాడు పెద్దాయన. నీ కోడలి గురించి పట్టించుకోవాల్సింది నువ్వేనని పారుపై మండిపడతాడు. దాంతో నేను వెళ్లి పడుకుంటానని సుమిత్ర వెళ్లిపోతుంది. మీ అమ్మకి నువ్వంటే ఎంతో ఇష్టం... కానీ ఈ వయసులో మీ అమ్మని వదిలేయొద్దని జ్యోత్స్నకి క్లాస్ పీకుతాడు దశరథ. దీపని కొద్దిరోజులు ఇంట్లోనే ఉండమని చెబుదామని శివన్నారాయణ అనగా.. అమ్మాయి కడుపుతో ఉందని తను వద్దని అంటాడు దశరథ. దానికంటే చెల్లాయికి ఫోన్ చేసి పిలుద్దామని, కాంచనని పిలిపిస్తే వాళ్లిద్దరూ కబుర్లు చెప్పుకుంటారని తండ్రికి చెబుతాడు.
మా వదిన రక్తం పంచుకుని పుట్టిన జ్యోత్స్న శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ కావు... అంటే జ్యోత్స్న మా అన్నయ్య కూతురు కాదా అని కొడుకు కోడలిపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది కాంచన. ఆసుపత్రిలో శాంపిల్స్ ఇవ్వడానికి జ్యోత్స్న, పారులు భయపడ్డారని అందుకే జ్యోత్స్న అసలు కూతురు కాదేమోనని డౌట్ వచ్చిందని అంటాడు కార్తీక్. ఇంతలో శివన్నారాయణ ఫోన్ చేసి కాంచనకు ఇవ్వమని చెబుతాడు. జ్యోత్స్న శాంపిల్స్ గురించి ఏదో చెప్పబోతుండగా తల్లిని కార్తీక్ అడ్డుకుంటాడు. నువ్వు రెండ్రోజులు మా ఇంట్లో ఉండమని చెబుతాడు. అమ్మే కాదు మీ ఫ్యామిలీ మొత్తం మా ఇంట్లో కొద్దిరోజులు ఉండమని అంటాడు దశరథ. దాంతో నాకు ఇష్టం లేకుండా నువ్వు ఎందుకు మాట ఇచ్చావని కార్తీక్‌పై సీరియస్ అవుతుంది కాంచన. మీ నాన్న, మీ అన్నయ్య రమ్మంటున్నారంటే ఆలోచించమని నచ్చచెబుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











