Karthika Deepam 2 January 30th:దాస్ కిడ్నాప్..జ్యోత్స్న గుట్టు తెలుసుకున్న పారు, కాశీని చూసి కార్తీక్ షాక్
Photo Courtesy: JioHotstar
నీ రిపోర్ట్స్ మ్యాచ్ కానీ రోజే సగం దొరికిపోయామని ఇప్పటికే అందరికీ అనుమానం మొదలైందని పారిజాతం చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నా కొడుకు దాస్ ఉండుంటే అసలు వారసురాలిని తీసుకొచ్చేవాడు.. కానీ వాడు ఎక్కడున్నాడో తెలియడం లేదని అంటుంది పారు. ఇంతలో జ్యోత్స్నకి దాస్ ఫోన్ చేసి దీప మహర్జాతకురాలు ఆమెను నువ్వు ఏం చేయలేవని.. నీకు రోజులు దగ్గరపడ్డాయని చెబుతుంది. జ్యోత్స్న శాంపిల్సే మ్యాచ్ కానప్పుడు దీప శాంపిల్స్ ఎలా మ్యాచ్ అవుతాయని డాక్టర్ హారిక ప్రశ్నిస్తుంది. అయితే కార్తీక్, దీపలు రిక్వెస్ట్ చేయడంతో దానికి హారిక ఒప్పుకుంటుంది.
గుడిలో నుంచి వస్తున్న కాంచనకు పిచ్చివాడిలా ఉన్న కాశీ కనిపిస్తాడు. ఆమెను చూడగానే ఏడ్చేసిన కాశీ... తనను స్వప్నని కలపాలని అడుగుతాడు. దాంతో కాశీని తీసుకుని ఇంటికి వెళ్తుంది కాంచన. దీపకి టెస్టులు చేయిస్తే డాక్టర్ గారు ఏమన్నారని కార్తీక్‌ని అడుగుతుంది పారిజాతం. నా సంగతి తర్వాత కానీ నువ్వు అసలు నీ కొడుకు గురించి పట్టించుకోవడం లేదని మండిపడతాడు. నీ కొడుకు కనిపించకుండా పోవడం వెనుక జ్యోత్స్న ప్రమేయం ఉందని కార్తీక్ చెప్పడంతో పారు షాక్ అవుతుంది. కార్తీక్ చెప్పిన ప్లాన్ ప్రకారం మనవరాలి దగ్గరికి వెళ్తుంది పారిజాతం. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 30వ తేదీ 581వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కార్తీక్ చెప్పినట్లుగానే జ్యోత్స్న దగ్గరికి వెళ్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలని చెబుతుంది పారిజాతం. ఎందుకు అని జ్యోత్స్న అడగ్గా.. నా కొడుకు కనిపించడం లేదని కంప్లయంట్ ఇవ్వడానికి అని పారిజాతం చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అసలైన వారసురాలిని వెతికి తెమ్మని నువ్వే పంపించావు కదా అని అంటుంది జ్యోత్స్న. తాయెత్తు తెగిపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఇవన్నీ చూస్తుంటే వాడిని ఎవరో ఏదో చేశారని అనిపిస్తోందని అంటుంది పారు. నా కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారని కంప్లయంట్ చేస్తానని పారు చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కూతురిగా మీ నాన్నని నువ్వు పట్టించుకోకపోయినా.. ఒక తల్లిగా నేను పట్టించుకుంటానని అంటుంది పారు.
కార్తీక్ గాడు చెప్పినట్లుగానే దీని ముఖంలో రంగులు మారుతున్నాయని అనుకుంటుంది పారు. నీ కొడుకుని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎవరి మీద అనుమానం ఉంది? అంటే ఏం చెబుతావని జ్యోత్స్న అడగ్గా.. నీ మీదే అనుమానంగా ఉందని చెబుతానని అంటుంది పారు. వాడు ఎందుకు కనిపించడం లేదో? ఫోన్ ఎందుకు వెతకడం లేదో కనుక్కోమని చెబుతానని అంటుంది. నేను ఎక్కడికీ రాను, నేను ప్రాబ్లమ్‌లో ఉంటే నా తండ్రి నన్ను పట్టించుకున్నాడా? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. నేను ఎక్కడికీ రానని కోపంగా వెళ్లిపోతుంది. దాంతో దీని వాలకం చూస్తుంటే దాస్‌ని ఏదో చేసినట్లే ఉందని అనుకుంటుంది పారిజాతం.
శ్రీధర్‌ను ఇంటికి పిలిపించి.. కాశీ ఎక్కడున్నాడు? కూతురి కాపురం ఏమైందో పట్టించుకున్నారా అని ప్రశ్నిస్తుంది కాంచన. ఇంతలో కాశీని చూడగానే శ్రీధర్ షాక్ అవుతాడు. కాశీ తన తప్పు తెలుసుకున్నాడు.. స్వప్నతో కలిసి బతకాలని ఆశపడుతున్నాడని అంటుంది కాంచన. కాశీ తప్పు చేశాడని, తాను పశ్చాత్తాపపడుతున్నాడని, తన పశ్చాతాపాన్ని స్వప్న అర్ధం చేసుకోవాలని నువ్వు కోరుకుంటున్నావా? కాశీకి ఒక అవకాశం ఇవ్వాలని అంటావు అని శ్రీధర్ అడగ్గా... అన్నింటికి ఔను.. ఔను అని ఆన్సర్ ఇస్తుంది కాంచన. అది వినగానే శ్రీధర్ చప్పట్లు కొడతాడు.
నేను వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం దొరికింది.. భార్య నమ్మకాన్ని కోల్పోయిన కాశీకి ఒక అవకాశం ఉండాలని కోరుకున్న నీకు.. నీ నమ్మకాన్ని కోల్పోయిన నాకు ఒక అవకాశం ఉండాలని ఎందుకు కోరుకోవడం లేదని ప్రశ్నిస్తాడు శ్రీధర్. ఆ మాటలతో కాంచన షాక్ అవుతుంది. నీతో కలిసి బతకడానికి నేను సిద్ధంగా ఉన్నాను.. నాతో కలిసి బతకడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా అల్లుడిది, నాది ఒకటే సమస్య.. స్వప్నలో నువ్వు కోరుకుంటున్న మార్పు.. నేను నీలోనూ కోరుకుంటున్నానని చెబుతాడు శ్రీధర్. నన్ను నీ భర్తగా అంగీకరించగలవా? అని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తాడు.
నువ్వు పోలీస్ స్టేషన్ పేరెత్తగానే నీ మనవరాలి ముఖంలో రంగులు మారాయా లేదా? కంగారు పడిందా లేదా? మాట దాటేసిందా? లేదా? అని పారిజాతాన్ని కార్తీక్ ప్రశ్నిస్తాడు. దాస్ మావయ్య కనిపించకుండా పోతే ఎవరు ఎక్కువగా ఆలోచించాలని కార్తీక్ అడగ్గా.. నేనే అని ఆన్సర్ ఇస్తుంది. నీ మనవరాలు ఏం చేస్తుందో? ఎక్కడికి వెళ్తుందో? నువ్వే ఓ కంట కనిపెట్టు అని చెబుతాడు కార్తీక్. జ్యోత్స్నకి చెక్ పెట్టడానికి నువ్వే కరెక్ట్ అని మనసులో అనుకుంటాడు కార్తీక్.
మరోవైపు.. తాను అడిగిన ప్రశ్నలకు కాంచన సమాధానం చెప్పకపోవడంతో శ్రీధర్ పదే పదే అడుగుతాడు. నువ్వు నన్ను క్షమించలేవు.. నేను నిన్ను వదులుకోలేనని చెబుతాడు. ఇంతలో కార్తీక్, దీపలు ఇంటికి వస్తారు. కాశీని, అతని అవతారాన్ని చూడగానే ఇద్దరూ షాక్ అవుతారు. తన తప్పు తెలుసుకున్న కాశీని స్వప్నతో కలపాలని మీ అత్తయ్య గారు నన్ను ఇక్కడికి రప్పించారు... ఆవిడ చెప్పాల్సినదంతా చెప్పింది.. కాశీ విషయంలో ఆలోచించినట్లే నా విషయంలో కూడా ఆలోచించమని అడిగాను. కాశీని స్వప్న క్షమించాలని మీ అమ్మ కోరుకున్నట్లే... నన్ను కూడా మీ అమ్మ క్షమించాలని నేను కోరుకుంటున్నా అని అంటాడు శ్రీధర్. నాదీ ఒక్కటే ప్రాణం.. ఒక్కటే జీవితం.. కాంచనను నన్ను క్షమించమని చెప్పు అని అంటాడు. స్వప్నని కాశీని క్షమించేలా నేను మాట్లాడతాను.. స్వప్న మాట వినకపోతే ఉదాహరణగా వాళ్ల పెద్దమ్మను చెబుతాను అంటాడు శ్రీధర్.
దీప నీకు సరిపడదు అన్నాను.. నువ్వు దీపను వదిలేశావా? అని శ్రీధర్ అడగ్గా.. వదల్లేదు, వదలను కూడా అని కార్తీక్ ఆన్సర్ ఇస్తాడు. దీప కడుపుతో బిడ్డ ఉంది.. ఒక బిడ్డ ఉంది కదా అని ఈ బిడ్డను వద్దు అనుకున్నావా? అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. కాశీది పశ్చాత్తాపమైతే, నాది పశ్చాత్తాపమే... కాశీకి క్షమాభిక్ష ఉంటే నాకు ఉండాలని అంటాడు శ్రీధర్. ఇంత జరిగినా కాంచన సైలెంట్‌గా ఉండటంతో శ్రీధర్ మండిపడతాడు. భార్య చనిపోతే చితికి ఎక్కే ప్రేమ నా కథలో చూస్తారని అంటాడు. నా కన్నీళ్లతో నా గుండెను కడిగేసే క్షణాల కోసం నేను ఎదురుచూశానని అంటాడు శ్రీధర్. నా ప్రేమతో నీ మనసును ప్రశ్నించే అవకాశం కోసం ఎదురుచూశానని చెబుతాడు. కూతురు, అల్లుడు కలిసుండాలని కోరుకుంటావు... కోడలు, కొడుకు కలిసుండాలని కోరుకుంటావు... అన్నయ్య, వదిన కలిసుండాలని కోరుకుంటావు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి కదా? మరి నీ కాపురంలో సమస్యలు వస్తే ఆ కన్నీళ్లు ఎవరి కళ్లలో తిరగాలని అడుగుతాడు శ్రీధర్.
ఆడదానికి తన జీవితం ఎలా ఉండాలో మనం చెప్పాలా? తనకు స్వేచ్ఛ ఉండాలని అంటాడు కార్తీక్. తన నిర్ణయాలకు మనం విలువ ఇవ్వాలని చెబుతాడు. నా తల్లికి మించి ఎదిగినప్పుడు తన నిర్ణయాలను నేను తప్పుబడతాను. కానీ ఇంత వరకు ఏ కొడుకు తండ్రిని మించి ఎదిగాడేమో కానీ, తల్లిని మించి ఎదగలేదు.. మీ నిర్ణయాలు మీకే వదిలేస్తున్నాను, కానీ ఒక కొడుకుగా మీరిద్దరూ కలిసుండాలని కోరుకుంటున్నానని చెబుతాడు కార్తీక్. నా కొడుకే నా నిర్ణయాన్ని గౌరవించినప్పుడు.. నేను వాడి నిర్ణయాన్ని గౌరవించకపోతే బాగోదని అంటుంది కాంచన. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











