Karthika Deepam 2 February 5th: కార్తీక్- దీపలపై శివన్నారాయణలో అనుమానం... శ్రీధర్‌కి కాంచన క్లాస్
Photo Courtesy: JioHotstar
కార్తీక్, దీపలు ఏడుస్తుండటంతో వారిని ఓదార్చి బిడ్డ జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతాడు దశరథ. డాక్టర్ చెప్పిన మాటలు, దశరథ తమ మీద చూపిస్తున్న అభిమానంతో కార్తీక్, దీపలు వెక్కి వెక్కి ఏడుస్తారు. ఆసుపత్రి నుంచి వచ్చిన జ్యోత్స్నని బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావా? అని అడుగుతుంది పారు. శాంపిల్స్ ఇచ్చాను కానీ ఏం చేయాలో అర్ధం కావడం లేదు అంటుంది జ్యోత్స్న. ముందు దాస్ ఎక్కడున్నాడో చెప్పమని పారు అడగటంతో జ్యోత్స్న డ్రామాలు ఆడుతుంది. గ్రానీకి నా మీద అనుమానం ఎక్కువ అవుతోంది. జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది జ్యోత్స్న
స్వప్నని ఎలాగైనా ఒప్పించి మా ఇద్దరినీ కలపమని బతిమలాడతాడు కావీ. ఎవరు ఏం చెప్పినా సరే.. కాశీతో బతకడం తనకు ఇష్టం లేదని, విడాకులు ఇచ్చేస్తానని అంటుంది స్వప్న. ఆమె మాటలతో కాంచన కోపంగా వెళ్లిపోతుంది. స్వప్న మీద కోపంతో కాశీ కూడా వెళ్లిపోతాడు. అల్లుడిని నేను ఒప్పిస్తానని కావేరితో చెప్పి శ్రీధర్ వెళ్తాడు. పదే పదే బిడ్డ గుర్తుకొస్తుండటంతో కార్తీక్, దీపలు ఇంటికి బయల్దేరతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 5వ తేదీ 586వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కాశీని స్వప్నను కలపకపోవడంతో శ్రీధర్‌పై కోప్పడుతుంది కాంచన. నా ఇద్దరు పిల్లలకు తల్లులు వేరైనా లక్షణాలు మాత్రం అవే వచ్చాయని శ్రీధర్ అనగా నా కొడుకుతో స్వప్నని పోల్చొద్దని మండిపడుతుంది కాంచన. నా కొడుకు ఆవేశం ఉంది.. మూర్ఖత్వం లేదు. కోపం ఉంది దానిని అయినవాళ్ల మీద చూపించడని అంటుంది. ఒకప్పుడు జ్యోత్స్న విషయంలో దీప మొండిగా వెళ్లి మా అన్నయ్యని షూట్ చేస్తే కార్తీక్ ఆమెను వదిలేయలేదు. చివరికి నేనే దీపని అవమానించినా సరే నా భార్య ఏ తప్పు చేయదు అన్నాడు నా కొడుకు. భార్య మీద భర్తకు ఉండాల్సింది నమ్మకం.. భర్త మీద భార్యకు ఉండాల్సింది గౌరవం. అవి రెండూ నా కొడుకు, కోడలికి ఉన్నాయి... కానీ నీ కూతురికి, అల్లుడికి లేవని ఫైర్ అవుతుంది కాంచన.
ఎంత కాదనుకున్నా కాశీ నా మేనల్లుడు.. కానీ స్వప్న మూర్ఖంగా ప్రవర్తిస్తోంది. తండ్రిగా కూతురిని దండించరా.. అది మొగుడిని వదిలేసి వందేళ్లు పుట్టింట్లో ఉంటే ఇలాగే మాట్లాడతారా? అని ప్రశ్నిస్తుంది కాంచన. మరో పెళ్లి చేస్తానని శ్రీధర్ చెప్పగా ఆమె షాక్ అవుతుంది. ఆడవాళ్ల మనుసులు ఏటీఎం కార్డ్‌లు కాదు.. నచ్చినట్లు వాడుకోవడానికి అని మండిపడుతుంది కాంచన. అలాంటి పరిస్ధితి అనే బదులు నాలాంటి పరిస్ధితి అనొచ్చు కదా అని ఫైర్ అవుతాడు శ్రీధర్. నా పరిస్థితి వేరు, నా కూతురి పరిస్ధితి వేరు అని అంటుంది కాంచన. నీకు పుట్టని మనిషినే నీ కూతురు అనుకున్నప్పుడు.. నీకు తాళ్లి కట్టిన మనిషిని నీ భర్త అని ఎందుకు అనుకోలేకపోతున్నావని ప్రశ్నిస్తాడు శ్రీధర్.
ఇంతలో శివన్నారాయణ వచ్చి నువ్వు చేస్తున్నది తప్పేనని చెప్పడంతో శ్రీధర్, కాంచనలు షాక్ అవుతారు. పిల్లనిచ్చిన మామ భగవంతుడితో సమానం.. ఆయన చెబితే దేవుడు చెప్పినట్లే నీ మనసు మార్చుకుంటావా? అని అడుగుతాడు శ్రీధర్. నా కూతురి సంతోషం నేను కోరుకున్నట్లే నా తండ్రి.. నా సంతోషాన్ని కోరుకుంటున్నాడని చెబుతుంది కాంచన. నా ఆలోచనలో స్వార్ధం ఉన్నట్లే నా తండ్రి ఆలోచనల్లోనూ స్వార్ధం ఉందని అంటుంది కాంచన. కానీ తండ్రి .. కూతురిలా ఆలోచించలేడని చెబుతుంది కాంచన. ఇంతలో కార్తీక్, శ్రీధర్‌లు ఇంటికి వస్తారు. రోజుకొకసారి పంచాయతీ ఎందుకు పెడుతున్నావు? మా అమ్మని ప్రశాంతంగా ఉండనివ్వవా? అని ప్రశ్నిస్తాడు కార్తీక్.
డాక్టర్ గారు జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నప్పుపడు తండ్రీ కూతుళ్ల బంధం గురించి ఒకమాట చెప్పారు... నా మనవరాలికి తండ్రి గుర్తొచ్చాడో లేదో కానీ నాకు మాత్రం నా కూతురు గుర్తొచ్చింది. కోడలికి ఏమవుతుందోనని భాడపడుతున్నాను కానీ.. కూతురి జీవితానికి తండ్రిగా ఏం చేయలేకపోతున్నానని బాధపడతాడు పెద్దాయన. నేను ఏదైతే మనసులో అనుకుంటూ వస్తున్నానో.. ఇక్కడ అదే జరుగుతోందని అంటాడు శివన్నారాయణ. నా విషయంలో మీరేం బాధపడొద్దు.. నీ కూతురికి ఒక యోగ్యుడైన వాడిని చూసి గొప్పగానే పెళ్లి జరిపించావు, నీ బాధ్యత తీరిపోయిందని అంటుంది కాంచన. స్వప్న పరిస్ధితి వేరు.. నా పరిస్థితి వేరు. తన భర్త తన తండ్రిని మోసం చేశాడని కోపంతో విడాకులు ఇవ్వాలని అనుకుంటోందని చెబుతుంది కాంచన.
మనం స్వప్న నిర్ణయాన్ని అంగీకరిస్తే కాశీ మరోపెళ్లి చేసుకోవచ్చు.. స్వప్న మరో పెళ్లి చేసుకోవచ్చు. కానీ కాశీకి భార్యతో ఎలా ఉండాలో ఇప్పటికే తెలుస్తోందని చెబుతుంది కాంచన. నీ కూతురు ఆ మనిషిని కూడా వద్దు అంటే నీ కూతురికి మూడో పెళ్లి చేస్తావా అని ప్రశ్నిస్తుంది కాంచన. మిమ్మల్ని నేను వద్దు అనుకున్నాను కానీ.. మీతో నేను విడాకులు కోరుకోలేదని అంటుంది. వద్దు అనుకోవడం ఎందుకు? పిల్లలకు పెద్దవాళ్లే ఆదర్శం. మీరిద్దరూ ఒక్కటి అవ్వండి.. వాళ్లిద్దరూ ఒక్కటి అవుతారని చెబుతాడు శివన్నారాయణ. సవతిని తోబుట్టువులా అనుకున్నాను.. సవతి కూతురిని కన్నకూతురిలా ఆదరించాను. కొడుకు చేసుకున్న పెళ్లిని అంగీకరించాను. నా పుట్టింటిలో నాలాంటి గౌరవం నా సవతికి వచ్చేలా చేశానని చెబుతుంది కాంచన. స్వప్న కాశీని కలపడం నా తండ్రి వల్ల కాదు అన్నప్పుడు.. నువ్వే వాళ్లిద్దరినీ కలుపు అంటాడు కార్తీక్. మనం వద్దు అన్నా మీ అమ్మ వినదు.. ఈ కథకు శ్రీకారం చుట్టింది తనే కాబట్టి, తనే ముగింపు ఇస్తుందని అంటాడు శ్రీధర్.
జ్యోత్స్నకి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి వెళితే.. అక్కడ కార్తీక్, దీపలు కనిపించారని శివన్నారాయణ చెప్పడంతో కాంచన షాక్ అవుతుంది. నిన్న కూడా వెళ్లారు.. దీపకి బ్లడ్ టెస్టులు కూడా చేశారని చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. సుమిత్రకు ఏం కాదు.. నా బెంగంతా దీప మీదే ఉందని పెద్దాయన అంటాడు. దీప కడుపులో పెరుగుతున్నది నీ బిడ్డ కాదు.. కాంచన తల్లి అని చెప్పడంతో కార్తీక్ ఏడుస్తూ పక్కకి వెళ్లిపోతాడు. శ్రీధర్, శివన్నారాయణలు వెళ్లిపోగానే.. జ్యోత్స్న ప్రవర్తన నాకెందుకో అనుమానంగా ఉందని అనుకుంటుంది కాంచన. ఉదయాన్నే అనసూయ వచ్చి... నా తమ్ముడు కట్టిన ఇల్లు కార్తీక్ బాబుకి సాయంగా ఉంటుంది.
ఇంటి ఖర్చులు, స్కూల్ ఫీజులు, ఇప్పుడు భార్య ఆసుపత్రి ఖర్చులు.. జీతంలేని ఉద్యోగానికి జీవితాన్ని తాకట్టు పెట్టిన కార్తీక్ బాబు. తను మాత్రం ఎన్ని సర్దుకుంటాడు. అందుకే ఆ ఇల్లు అమ్మిన డబ్బులు కార్తీక్ బాబుకి ఇస్తే కొంత సాయంగా ఉంటుందని అనసూయ చెప్పడంతో కాంచన ఎమోషనల్ అవుతుంది. కానీ అనుకున్న రేటుకు ఆ ఇల్లు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని బాధపడుతుంది అనసూయ. ఎన్ని దెబ్బలు తగిలినా నిలబడే కార్తీక్ బాబుకి మనం అండగా నిలబడాలని అంటుంది. ఇంతలో శౌర్య నాకు ఏం తెచ్చావని అడగటంతో చిన్న పాప బొమ్మ తీసుకొచ్చి ఇస్తుంది అనసూయ.
కార్తీక్ - దీపలు ఎందుకలా ఉన్నారని కాంచనని అడుగుతుంది అనసూయ. కాశీ - స్వప్నల గురించి అలా ఉన్నారని అనుకుంటుంది కాంచన. కార్తీక్- దీపలు బాధపడుతుండగా శౌర్య వచ్చి ఈ రౌడీతో ఆడుకోవడం లేదని... నేనంటే నీకు ఇష్టం లేదా అని ప్రశ్నిస్తుంది. ఆ మాటలకు కార్తీక్ బాధపడతాడు. అది చూసి దీప సీరియస్ అవ్వగా.. పిల్లలకు ఆనందమైనా, బాధైనా తల్లిదండ్రులతోనే చెప్పుకుంటారని నచ్చచెబుతాడు కార్తీక్. కళ్లు మూసుకోమ్మని చెప్పి పాప బొమ్మ తీసుకొచ్చి శౌర్య ఇవ్వడంతో కార్తీక్ కంటతడి పెడతాడు. నా చెల్లి ఎప్పుడొస్తుంది? నేను ఆడుకోవాలని శౌర్య అడగటంతో కార్తీక్, దీపలు వెక్కి వెక్కి ఏడుస్తారు. దీప కంట్లో కన్నీరు చూసిన కాంచన, అనసూయలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తోంది.


Click it and Unblock the Notifications











