Karthika Deepam 2 February 13th: తప్పించుకున్న దాస్.. పారుకి దొరికిపోయిన జ్యోత్స్న, దశరథకు షాకిచ్చిన డాక్టర్
Photo Courtesy: JioHotstar
సుమిత్రతో జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కావాలని దేవుడికి మొక్కుకున్నానని పారు చెప్పడంతో .. అంటే శాంపిల్స్ మ్యాచ్ కావని అనుమానంగా ఉందని కార్తీక్ ఇరికించేస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఏదో విధంగా కవర్ చేయాలని చూసినప్పటికీ కార్తీక్ పదే పదే గుచ్చిగుచ్చి అడగటంతో పారుకి చెమటలు పడతాయి. నేను ఇకపై దేవుడికి బదులు ఉదయాన్నే జ్యోత్స్న ముఖం చూస్తానని సుమిత్ర చెప్పడంతో కార్తీక్ రగిలిపోతాడు. బిడ్డను వదులుకుని త్యాగం చేస్తోంది నువ్వు.. నీకు దక్కాల్సిన మర్యాద, ప్రేమ ఆ జ్యోత్స్నకి దక్కడం ఏంటీ అంటూ దీపతో అంటాడు. నాకు నా తల్లి సంతోషం, ఆమె ప్రాణాలతో ఉండటం ముఖ్యం. ఈ ప్రశంసలు నాకు అక్కర్లేదని చెబుతుంది దీప.
నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కాశీ నా దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తాడని స్వప్నకి తేల్చిచెబుతాడు శ్రీధర్. కాశీ ఉన్నచోట నేను ఉండలేను, ఇలాంటి మనిషితో బతకం కంటే ఎడారిలో బతకడం బెటర్ అంటూ కాశీని ఛీ కొడుతుంది స్వప్న. కార్తీక్- దీపలు మాట్లాడుకుంటూ ఉండగా శివన్నారాయణ ఇంటికి కాంచన - శ్రీధర్ వస్తారు. కాంచనకి స్వీట్ తినిపించి జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెబుతుంది. అందరూ సంతోషంగా ఉంటే జ్యోత్స్న, పారుల ముఖాలు డల్‌గా ఉండటంతో శ్రీధర్, దశరథలకు అనుమానం వస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 13వ తేదీ 593వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇంతకీ ఎవరు ఎవరికీ కూతురు? అనే క్లారిటీ వచ్చిందా? లేదా అని పారిజాతాన్ని అడుగుతాడు కార్తీక్. ముందు నన్ను జ్యూస్ తాగనిస్తారా? లేదా? అని మండిపడుతుంది పారు. ఆ వెంటనే కాంచనను తీసుకుని శ్రీధర్ వెళ్లిపోతుండగా అప్పుడే వెళ్లొద్దని డిన్నర్ చేసి వెళ్లమని చెబుతాడు శివన్నారాయణ. ఇంటి దగ్గర ఎవరూ లేరని పాపని చూసుకోవాలని చెబుతుంది కాంచన. తర్వాత జ్యోత్స్నని దగ్గరికి పిలిచి సుమిత్ర చేతిని తన చేతిలో పెట్టి.. ఇప్పటి నుంచి మా వదిన బాధ్యత నీదని చెబుతుంది. వయసు అయిపోయిన అమ్మానాన్నల్ని ప్రతి ఒక్కరూ బాగా చూసుకోవాలి, వారి రుణం తీర్చుకోవాలని అనుకుంటారు. కొందరికీ ఆ అవకాశం రాదు.. అప్పటికే అమ్మానాన్న దూరమైపోయి చాలాకాలం అవుతుంది.. కానీ నీకు నా కన్నతల్లి రుణం తీర్చుకునే అదృష్టం దొరికిందని చెబుతుంది కాంచన.
రిపోర్ట్స్ ఎలా మారిపోయాయో తెలియడం లేదు. బావ చేశాడంటే అతనికి నిజం తెలియాలి కదా? దాస్ ఏమైనా చెప్పాడా అని ఆలోచిస్తుంది జ్యోత్స్న. మరోవైపు.. జ్యోత్స్న ప్రవర్తన చూస్తుంటే రిపోర్ట్స్ మ్యాచ్ కావడంలో ఏదో తప్పు జరిగిందని అనిపిస్తోందని అనుమానిస్తాడు దశరథ. వారిద్దరినీ చూసిన కార్తీక్ టెన్షన్ పడతాడు. జ్యోత్స్నకి శ్రద్ధ ఎక్కువే.. మనం చెప్పకపోయినా బాగానే చూసుకుంటుందని అంటాడు శ్రీధర్. దీప కడుపులోని బిడ్డ క్షేమంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నాను.. రేపు గుడిలో పూజ ఉంది, త్వరగా వెళ్లి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని చెబుతుంది కాంచన. ఆ మాటలతో కార్తీక్, దీపలు బాధపడతారు.
మీరు దీపని తీసుకుని వెళ్లండి.. కార్తీక్‌తో నాకు చిన్నపని ఉందని శ్రీధర్‌కి చెప్పి తీసుకెళ్తాడు దశరథ. దాంతో జ్యోత్స్నకు చెమటలు పడతాయి. ముందు నేను దాస్‌ని కలిస్తేనే కానీ రిపోర్ట్స్ విషయంలో క్లారిటీ రాదని అనుకుని బయటికి వెళ్తానిన శివన్నారాయతో చెప్పగా పెద్దాయన వద్దు అంటాడు. దాంతో సుమిత్ర పర్మిషన్ తీసుకుని వెళ్తుంది జ్యోత్స్న. ఆ మాటలు విన్న పారు రగిలిపోతుంది.. ఇదివరకు నాకు చెప్పి వెళ్లే దానివి, ఇప్పుడు మీ అమ్మకి చెప్పి వెళ్తున్నావా? అని జ్యోత్స్నని ఫాలో అవుతుంది.
దాస్‌కి రౌడీలు భోజనం తీసుకొచ్చి ఇస్తారు. మీతో పాటే నేను కూడా తింటానని దాస్ చెప్పగా.. మేం మందుకొట్టి తింటామని చెబుతారు రౌడీలు. నేను కూడా మీతో కలిసి మందు కొడతానని దాస్ చెప్పడంతో రౌడీలు షాక్ అవుతారు. ఎంత చెప్పినా రౌడీలు వినకపోవడంతో నా కూతురు మీద ఒట్టని అంటాడు దాస్. దాంతో అతని కట్లు విప్పి అందరూ కలిసి మందు కొడతారు. వాళ్లకి కథలు చెబుతూ పీకలదాకా తాగిస్తాడు దాస్. ఫుల్‌గా మందుకొట్టి రౌడీలు పడిపోగానే దాస్ తప్పించుకుంటాడు.
దశరథతో పాటు హాస్పిటల్‌కు వచ్చిన కార్తీక్ షాక్ అవుతాడు. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ విషయంలో నాకు డాక్టర్ గారి మీద అనుమానంగా ఉంది. డాక్టర్ అబద్ధం చెబుతున్నారు.. అది నిజమో? కాదో ఇప్పుడే ప్రూవ్ చేస్తానని చెబుతాడు. దశరథను చూడగానే డాక్టర్ హారిక షాక్ అవుతుంది. శాంపిల్స్ ఇప్పుడు మ్యాచ్ అయ్యాయి.. ఇంతకుముందు ఎందుకు మ్యాచ్ కాలేదని దశరథ ప్రశ్నిస్తాడు. ఎక్కడో ఒకచోట మిస్టిక్ జరిగిందని అంటుంది హారిక. శాంపిల్స్ మ్యాచ్ అయ్యేలా చేయమని జ్యోత్స్న మిమ్మల్ని బెదిరించిందా? అని అడుగుతాడు దశరథ. అంతా పర్ఫెక్ట్‌గానే ఉంది.. ఇలాంటి ప్రశ్నలు అడగొద్దని కార్తీక్ నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా దశరథ వినిపించుకోడు.
ఏదో ఒక తేడా జరుగుతోందని దశరథ చెప్పగా.. నేను టెస్ట్ సరిగా చేయలేదని అనుమానిస్తున్నారా? అని హారిక ప్రశ్నిస్తుంది. జ్యోత్స్న మీ కూతురు కాదు.. ఆ రిపోర్ట్స్ అన్నీ ఫేక్ ఇదే కదా మీ డౌట్ అని డాక్టర్ చెప్పడంతో దశరథ, కార్తీక్‌లు షాక్ అవుతారు. నా భార్య ఆరోగ్య పరిస్ధితి మీకు తెలుసు కదా? ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ముందుగానే తెలుసుకుంటే మంచిదని అడుగుతున్నానని చెబుతాడు దశరథ. సుమిత్ర గారి ప్రాణాలు మీ కూతురే కాపాడుతుంది.. అలాంటి కూతురిని కన్నందుకు మీరు గర్వపడాలి, ఎందుకంటే తల్లి కోసం ఏ కూతురు చేయని త్యాగం చేయబోతోందని అంటుంది హారిక. దశరథ వెళ్లిపోగానే.. మీ మావయ్యగారు వస్తున్న సంగతి చెప్పాలి కదా అని కార్తీక్‌తో అంటుంది హారిక. బిడ్డను కాపాడగలరా అని కార్తీక్ అడగ్గా.. ఏదో ఒక ప్రాణాన్ని అయితే వదులుకోవాలని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ బాధపడతాడు.
రేపు గుడికి వెళ్తున్నామని.. శౌర్యను కూడా తీసుకుని వెళ్తామని శ్రీధర్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. నీ కడుపులో పెరుగుతున్న మా అమ్మ క్షేమంగా ఉండాలని పూజ చేయిస్తున్నానని అంటుంది కాంచన. మన కుటుంబాల్లో ఆర్ధిక పరిస్ధితి బాగున్నా.. ఆరోగ్యాలు ఎవరికీ బాగోడం లేదని బాధపడుతుంది. నీ బిడ్డ క్షేమంగా ఈ భూమ్మీద అడుగుపెట్టాలని చెబుతుంది. ఉన్నట్లుండి నీకు ఈ పూజ ఆలోచన ఎందుకొచ్చిందని శ్రీధర్ అడగ్గా.. మన జీవితాల్లో ఏం జరగబోతుందో? మనకి కలల రూపంలో ముందే తెలుస్తుంది, దీప కడుపులో బిడ్డకు ఏదో ప్రమాదం రాబోతున్నట్లు నాకు పీడకల వచ్చిందని కాంచన చెప్పడంతో దీప షాక్ అవుతుంది.
దీప ఏడుస్తుండటంతో ఎందుకని అడుగుతుంది కాంచన. అవి కన్నీళ్లు కాదని.. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ గారు చెప్పారు కదా? దీపకి సుమిత్ర అంటే చాలా ఇష్టం. తన కన్నతల్లి లాంటి మనిషి ప్రమాదం నుంచి బయటపడిందనే ఆనందంలో కన్నీళ్లు వచ్చాయని చెబుతాడు శ్రీధర్. ఉదయాన్నే గుడికి వెళ్లాలి త్వరగా పడుకోమ్మని చెబుతుంది కాంచన. ఆ మాటలతో దీప కంటతడి పెడుతుంది. దాస్‌ను వెతుక్కుంటూ వచ్చిన జ్యోత్స్నకి కుర్చీలో మనిషి లేకపోవడం, కట్లు విప్పేసి ఉండటంతో షాక్ అవుతుంది. కోపంతో రౌడీలను నిద్రలేపుతుంది. ఇదంతా కిటికీ చాటు నుంచి గమనిస్తుంది పారిజాతం.
మా నాన్న ఎక్కడ? అని జ్యోత్స్న అడగటంతో పారు షాక్ అవుతుంది. నా అనుమానం నిజం అయ్యింది, ఆ కార్తీక్ గాడు దీని గురించి చెప్పిందంతా నిజమే. నా కొడుకుని కిడ్నాప్ చేసింది నువ్వేనని అనుకుంటుంది. మా నాన్న చాలా తెలివిగా తప్పించుకున్నావని అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు తెలుసు.. నువ్వు అనుకున్నది జరగనివ్వను అంటూ కోపంగా ఇంటికి వెళ్తుంది జ్యోత్స్న. నువ్వు నా కొడుకుని కిడ్నాప్ చేశావని తెలిసిన తర్వాత నిన్నింక వదిలిపెట్టను.. ఇన్నిరోజులు సొంత మనవరాలివని కొన్ని తప్పులు క్షమించాను, ఈసారి క్షమాపణలు ఉండవు, శిక్షించడాలే అనుకుని రగిలిపోతుంది పారిజాతం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











