Karthika Deepam 2 February 18th: కార్తీక్ స్కెచ్, దశరథ చేతికి రిపోర్ట్స్.. జ్యోత్స్న జీవితానికి కౌంట్‌డౌన్
Photo Courtesy: JioHotstar
సుమిత్ర అత్త కన్నకూతురు ఎవరో డాక్టర్ గారికి నిజం తెలుసని దాస్‌తో అంటాడు కార్తీక్. జ్యోత్స్నకి అనుమానం మొదలైంది.. అంతు చూసేవరకు ఏదో ఒకటి చేస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండమని కార్తీక్‌ను హెచ్చరిస్తుంది డాక్టర్ హారిక. నిజం చెప్పడం ఒక్కటే దీనికి పరిష్కారమని, దీపని జ్యోత్స్న చంపాలనుకుందని.. ఇలాగే వదిలేద్దామా అని కార్తీక్‌కి దాస్ వార్నింగ్ ఇస్తాడు. ఇంటికొచ్చిన జ్యోత్స్న నేను డాక్టర్ హారికను కలవడానికి వెళ్లాను.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని పారిజాతానికి చెబుతుంది. ఇంతలో దశరథ, శివన్నారాయణ వచ్చి ఎందుకు చెప్పకూడదు? అసలు నువ్వు డాక్టర్ గారిని ఎందుకు కలిశావని మండిపడతాడు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది జ్యోత్స్న.
శాంపిల్స్ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని డాక్టర్‌ను కలుస్తాడు దశరథ. నాకు జ్యోత్న్న మొత్తం రిపోర్ట్స్ కావాలని అడగటంతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది. ఇకపై ఎక్కువ రోజులు ఈ నిజం దాయలేమని, నేను ఈ ప్రెజర్ తట్టుకోలేనని అనుకుంటుంది డాక్టర్. నీ కడుపులో బిడ్డ జాగ్రత్త.. దీని కోసమే మీ అత్తయ్య కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తోందని శ్రీధర్ చెప్పడంతో దీప కన్నీటి పర్యంతమవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 18వ తేదీ 597వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
జ్యోత్స్నని అలాగే వదిలేస్తే తన గుట్టు బయటపడకుండా ఉండటానికి ఎంతకైనా తెగిస్తుంది. అవసరమైతే సుమిత్ర వదినని కూడా చంపేస్తుంది. కడుపుతో ఉన్న దీపనే చంపాలని అనుకున్న దానికి పెంచిన తల్లి ప్రాణం తీయడం ఓ లెక్క అని కార్తీక్‌తో అంటాడు దాస్. ఇంతలో కార్తీక్‌కి డాక్టర్ హారిక ఫోన్ చేసి దశరథ గారు మళ్లీ హాస్పిటల్‌కు వచ్చారని.. జ్యోత్స్న రిపోర్ట్స్ అడుగుతున్నారని చెబుతుంది. మీకు హెల్ప్ చేయాలని అనుకుంటే నేను సమస్యల్లో ఇరుక్కునేలా ఉన్నానని.. ఈ ప్రెజర్ నేను తట్టుకోలేకపోతున్నానని అంటుంది. దాంతో రిపోర్ట్స్‌ని జ్యోత్స్నకి మెయిల్ చేయమని చెబుతాడు కార్తీక్. ఆ మాటలతో డాక్టర్ సంతోషిస్తుంది. నువ్వు యుద్ధానికి సిద్ధమైనట్లుగా ఉన్నావని అర్ధమవుతోందని కార్తీక్‌తో అంటాడు దాస్.
కార్తీక్ కోసం దీప ఇంటి దగ్గర ఎదురుచూస్తుంటుంది. ఇంతలో అనసూయ వచ్చి నీ కోసం మీ అత్తయ్య గారు తెప్పించిన ప్రమిదలు, కొబ్బరికాయల్ని ఏం చేయమంటావు అని అడుగుతుంది. నువ్వు ఎన్నిసార్లు అడిగినా దీప సమాధానం మారదు.. ఎదుటివాళ్లకు ఇష్టం లేని పనుల్ని నువ్వు బలవంతంగా చేయించలేవని అంటుంది కాంచన. ప్రమిదల్ని ఎవరికైనా ఇచ్చేయ్, ఆ కొబ్బరికాయల్ని నువ్వే కొట్టేయమంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి అలా చేయాల్సిన అవసరం లేదని అనడంతో దీప షాక్ అవుతుంది. రేపు దీప, నేను గుడికి వెళ్తున్నామని చెబుతాడు కార్తీక్. మీరిద్దరూ వెళ్లడం కాదు.. మేం కూడా వస్తామని అంటుంది అనసూయ. నా భర్త మాటే నా మాట అని దీప అనడంతో కాంచన సంతోషిస్తుంది.
ఇంటి పట్టున ఉండకుండా అన్ని బరువులు మీద వేసుకుని తిరుగుతున్నారని, నేను మిమ్మల్ని కోప్పడతాను కానీ.. మీరు బాగుండటం కంటే నాకు కావాల్సింది ఏముందని ప్రశ్నిస్తుంది కాంచన. నువ్వు కోరుకున్న రోజులు వచ్చేశాయని, రేపు ఉదయం సూర్యుడు ఆకాశంలోనే కాదు.. మన జీవితంలోనూ ఉదయించబోతున్నాడని చెబుతాడు కార్తీక్. బావ గుడికి ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నాడు? ఏం జరిగిందని దీపకి అనుమానం వస్తుంది. నీ గురించి ఆలోచించి నేనొక నిర్ణయం తీసుకున్నాను.. ఈపాటికే మావయ్యకి రిపోర్ట్స్ వెళ్లిపోయుంటాయని అనుకుంటాడు కార్తీక్.
కొడుకుతో మాట్లాడుతూ జాగ్రత్తలు చెబుతుంటాడు శివన్నారాయణ. కానీ దశరథ మాత్రం జ్యోత్స్న గురించే ఆలోచిస్తుంటాడు. ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేసి రిపోర్ట్స్ మెయిల్ చేశానని చెప్పడంతో ఫోన్‌లో చెక్ చేయగా షాక్ అవుతాడు. ఆ వెంటనే కార్తీక్ ఫోన్ చేసి రిపోర్ట్స్ వచ్చాయా? అని ప్రశ్నిస్తాడు. ఉదయాన్నే గుడికి రా నీకు అన్ని చెబుతాను అంటాడు. శాంపిల్స్ మ్యాచ్ కాలేదంటే నా భార్య బతకదనే కదా అని దశరథ కంగారుపడతాడు. అత్తయ్యని కన్నకూతురే కాపాడుకుంటుంది.. రేపు ఉదయం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని అంటాడు కార్తీక్. రేపు గుడికి నువ్వు రాబోతున్న విషయం మనిద్దరి మధ్యా ఉండాలని చెబుతాడు కార్తీక్.
బావ మాటలు విచిత్రంగా ఉండటంతో ఏం జరుగుతోందనని దీప కంగారుపడుతుంది. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చింది నేనే అని తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుంది. అమ్మకి త్వరగా ఆపరేషన్ చేయించాలి.. నేను జ్యోత్స్న ప్లేస్‌లోకి వెళ్లి అమ్మను కాపాడుకోగలను అని ప్రశ్నిస్తుంది దీప. ఏ ఒక్కరు చూసినా మనం ఇరుక్కుపోతాం.. నేనే అసలైన కూతురని చెప్పినా నమ్ముతారా? అని నిలదీస్తుంది. దాస్ బాబాయ్ ఎక్కడున్నాడో తెలుసు.. రేపు మనతో పాటు ఆయన కూడా గుడికి వస్తాడని చెబుతాడు కార్తీక్. రేపు నీకు అన్ని తెలుస్తాయి. నా వల్ల అమ్మ, నువ్వు, డాక్టర్ గారు, దాస్ మావయ్య, దశరథ మావయ్యలు టెన్షన్ పడుతున్నారు. ఈ భయం నుంచి మనం బయటపడకపోతే మనం ఇరుక్కుపోతామని అనుకుని నిర్ణయం తీసుకున్నాను. మన బిడ్డ తన తల్లికి తల్లి రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చిందని చెబుతాడు కార్తీక్. రేపు బావ ఏదో చేయబోతున్నాడని దీపకి అనుమానం వస్తుంది.
జ్యోత్స్నతో సుమిత్ర కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. నీ పెళ్లి చూస్తానని, నీ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాననే నమ్మకం కుదిరిందని చెబుతుంది. నువ్వు పుట్టినప్పుడు పుట్టింది ఆడపిల్లో, మగపిల్లాడో కూడా నాకు తెలియదు. కళ్లు తెరవగానే ఊయలలో ఉన్న నిన్ను చూసి నాకు చూపించారు. అప్పుడే మీ దాస్ బాబాయ్‌కి ఆడపిల్ల పుట్టి చనిపోయిందని సుమిత్ర చెబుతుంది. ఆ చనిపోయిన బిడ్డని నేనే.. బతికే ఉన్నానని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నువ్వు విపరీతంగా ఏడుస్తున్నావు.. ఎంత సముదాయించినా ఏడుపు ఆపలేదు, అదేంటో పారిజాతం చేతుల్లోకి వెళ్లగానే ఏడుపు ఆపేశావని సుమిత్ర చెప్పడంతో నేను పారిజాతం మనవరాలిని కాబట్టి ఏడుపు ఆపేశానని అనుకుంటుంది జ్యోత్స్న.
వీరిద్దరి మాటల్ని వింటున్న దశరథ.. తన ముందున్న జ్యోత్స్న శాంపిల్స్ రిపోర్ట్స్ చూస్తూ అసలు నిజాలు తెలియాలని అనుకుంటాడు. ఈ వెంటనే ఇప్పటికే ఆలస్యమైంది.. ట్యాబ్లెట్ వేసుకుని పడుకోమని సుమిత్రపై సీరియస్ అవుతాడు దశరథ. టాబ్లెట్ అవసరం లేదనిపిస్తోందని అని సుమిత్ర అనగా.. జ్యోత్స్న చేతికి ఇవ్వు డస్ట్ బీన్‌లో వేస్తుందని అంటాడు దశరథ. ఈ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. డాడీకి ఏదో నిజం తెలిసింది.. నేను ఆసుపత్రి నుంచి వచ్చినప్పటి నుంచి మాటలన్నీ తేడాగా ఉన్నాయని టెన్షన్ పడుతుంది. తెల్లారి ఏం జరగబోతోందని అనుకుంటుంది జ్యోత్స్న.
ఉదయాన్నే కార్తీక్‌ని కలుస్తాడు దశరథ. దాస్‌ని జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుంది? నేను ఆ రోజు జ్యోత్స్నని ఫాలో అయ్యి కారు హారన్ కొట్టకపోయుంటే జ్యోత్స్న ఎత్తిన రాయి .. దాస్ తల మీద పడి ఉండేదని దశరథ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఆడుకుంటూ అల్లరి చేసే నా కూతురికి నా తమ్ముడిని చంపాల్సిన అవసరం ఏంటీ? ఎందుకో జ్యోత్స్నని నేను అడగలేకపోయాను. దాస్ చెప్పిన తర్వాతే నేను నిజం ఏంటో తెలుసుకోవాలని అనుకున్నాను.. కానీ ఏం జరిగిందో తెలియదు. గతం గుర్తొచ్చిన తర్వాత దాస్‌కి అన్ని గుర్తున్నాయి.. కానీ జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుంది అన్నది మాత్రం వాడికి గుర్తురాలేదు. శౌర్య మీద, దీప మీద అటాక్ జరిగినప్పుడు .. దీప ఇంటికొచ్చి జ్యోత్స్నని కొట్టింది అంటే దీప అనుమానం కూడా జ్యోత్స్న మీదే. అప్పుడు నా అనుమానం కూడా జ్యోత్స్న మీదే వచ్చింది.
నాటి నుంచి జ్యోత్స్న మీద ఓ కన్నేసి ఉంచాను... శాంపిల్స్ మ్యాచ్ కాలేదని అందరూ షాకైతే జ్యోత్స్న మాత్రం నాకు ఇది ముందే తెలుసని సైలెంట్‌గా ఉంది. కానీ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నప్పుడు షాకైంది. నిజం ఏంటో తెలుసుకోవాలని నాకు నిద్రపట్టలేదు. మ్యాచ్ కానీ జ్యోత్స్న రిపోర్ట్స్ డాక్టర్ గారు ఏం చెప్పారు.. ఈ రిపోర్ట్స్‌కి నీకు సంబంధం ఏంటీ? అని ప్రశ్నిస్తాడు దశరథ. రిపోర్ట్స్‌ని బట్టి చూస్తే జ్యోత్స్న మా కూతురు కాదు.. అలాంటప్పుడు అత్తని నీ కూతురే ఎందుకు కాపాడుతుందని నువ్వు ఏ ధైర్యంతో చెప్పావని నిలదీస్తాడు దశరథ. ఇదంతా నీకు ముందే తెలిసి కూడా నా దగ్గర ఎందుకు దాచావు.. నేను వివరాలు తెలియకుండా ఆపరేషన్‌కి వెళ్లుంటే మీరంతా నా భార్యను చంపేసేవాళ్లని దశరథ అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










