Karthika Deepam 2 April 17th: సుమిత్రతో దీపని అవమానించిన జ్యోత్స్న.. మరదలి ప్లాన్ తిప్పికొట్టిన కార్తీక్
Photo Courtesy: JioHotstar
జ్యోత్స్న మెడలో కార్తీక్ తాళి కట్టినట్లుగా కాంచనకు కల రావడంతో దీప ఏడుస్తూ పెరటిలోకి వెళ్లిపోతుంది. ఈ పంచాయతీ అంతా ఎందుకు పెట్టావంటూ తల్లిపై అరుస్తాడు కార్తీక్. దాంతో కాంచన కూడా అలిగి గదిలోకి వెళ్లిపోతుంది. తల్లీపెళ్లాల మధ్యలో ఇరుక్కుపోయిన మగాడి బ్రతుకు దారుణంగా ఉంటుందని కొడుకు మీద శ్రీధర్ సెటైర్లు వేస్తాడు. వెంటనే దీపని ఓదార్చడానికి కార్తీక్ వెళ్తాడు. ఇంతలో అక్కడికి శివన్నారాయణ కుటుంబం వస్తుంది. దీప- కార్తీక్‌లు కనిపించకపోవడంతో పెరటిలో ఉన్నారని తెలిసి పారిజాతం వెళ్లబోతుండగా ఆమెను ఆపి నేనే వెళ్తానని అంటుంది జ్యోత్స్న.
కాంచనకి వచ్చిన కల గురించి కార్తీక్- దీపలు మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలన్ని దొంగచాటుగా జ్యోత్స్న వింటుంది. దీపని అందరి ముందు ఇరికించడానికి కార్తీక్‌కి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. కార్తీక్‌కి జ్యోత్స్న నుంచి ఫోన్ రాగానే కోపంతో ఊగిపోతుంది దీప. నీకు బుద్ధి ఉంటే మళ్లీ మా ఆయనకి ఫోన్ చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది దీప. ఈ మాటలన్నీ విన్న శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది. దీపని జ్యోత్స్న ఇరికించిందని గ్రహించిన పారు ఆమెను కాపాడటానికి గట్టిగా అరుస్తుంది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లగా.. నా కూతురిని నా ముందే అన్ని మాటలు అంటావా అంటూ దీపపై సీరియస్ అవుతుంది సుమిత్ర. అయినప్పటికీ పారు కోరిక మేరకు ఆమెకు తల్లి స్థానంలో నిలబడి పుట్టింటి సారె ఇచ్చేందుకు ఒప్పుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 17వ తేదీ 647వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
తనకు పుట్టింటి సారె పెట్టిన సుమిత్ర పాదాలకు దీప నమస్కరిస్తుండగా సుమిత్ర వెనక్కి జరగడంతో దీపతో పాటు అంతా షాక్ అవుతారు. నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుందని చెబుతుంది సుమిత్ర. ఆ వెంటనే పారిజాతం వచ్చి పెళ్లిరోజు కానుకగా నెక్లెస్ తీసుకొచ్చి జ్యోత్స్న చేతుల మీదుగా వేయాలని అనుకుంటుంది. పారిజాతం ఇప్పటి వరకు తన చేతులతో ఎవ్వరికీ ఉంగరం కూడా పెట్టలేదు.. అలాంటిది నీకు నెక్లెస్ పెడుతుందంటే తన మనసు కూడా బంగారంలా మారిపోయిందని సెటైర్లు వేస్తాడు శివన్నారాయణ. నా చేత్తో దీపకి నెక్లెస్ వేయనని చెబుతుంది జ్యోత్స్న. కానీ అందరూ బలవంతం చేయడంతో తప్పక వేస్తుంది జ్యోత్స్న.
ఈ నెక్లెస్ నీ మెడలో పడగానే నీ స్థాయి మారిపోయినట్లుగా ఉంది. నా మనసులో ఏ కోపం లేదు.. నిన్ను నేను అర్ధం చేసుకున్నాను, నీ స్థానంలో నేనుంటే నీలాగే బాధపడేదానిని. దీప నన్ను తిట్టిందని మీరంతా అనుకుంటున్నారు, కానీ దీప పరిస్ధితిని నేను అర్ధం చేసుకున్నాను. వీళ్లందరి ముందు నేనొక నిజం దాచాను అని జ్యోత్స్న అనడంతో అంతా షాక్ అవుతారు. నీ కోసం పెరటిలోకి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూశాను. మీరు మాట్లాడుకుంది నేను విన్నాను, మనం వచ్చామని బావకి తెలియదు కదా అందుకే సరదాగా బావని ఏడిపిద్దామని అనుకున్నాను, అప్పుడే దీప సీరియస్ అయ్యిందని చెబుతుంది జ్యోత్స్న.
నేను పట్టించుకోకుండా వదిలేసిన విషయాన్ని దీప చాలా సీరియస్‌గా తీసుకుంది. నేను చెబితే బాగోదేమో, అత్త చెబుతుందని అంటుంది. మళ్లీ అదేదో నేనే చెబుతానని నా మెడలో తాళి కట్టినట్లు అత్తకి తెల్లవారుజామున కల వచ్చిందంట అని జ్యోత్స్న అనడంతో అంతా షాక్ అవుతారు. అదెక్కడ నిజం అవుతుందోనని దీప భయపడుతోంది. అందుకే దీప నన్ను కోప్పడింది, తిట్టిందని చెబుతుంది జ్యోత్స్న. దాంతో జ్యోత్స్న చెప్పింది నిజమేనా అని కాంచనను దశరథ అడుగుతాడు. జ్యోత్స్న మెడలో తాళికట్టినట్లు నాకు కల వచ్చిందని కాంచన ఒప్పుకుంటుంది.
ఇంతకుముందు ఒకసారి అత్తకి వాళ్ల అమ్మ కలలోకి వచ్చింది.. అప్పుడు దీప ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆ కల నిజమైనట్లే ఈ కల కూడా నిజమవుతుందేమోనని భయపడుతోందని జ్యోత్స్న చెప్పబోతుండగా పారిజాతం సీరియస్ అవుతుంది. కాంచన కలలు నిజమైనట్లు నా కలలు కూడా నిజమవుతున్నట్లు కల అనిపిస్తోంది.. జ్యోత్స్న అన్ని సర్దేసుకుని అర్ధరాత్రి పూట ఇంట్లోంచి పోతున్నట్లు వచ్చిందని అంటుంది పారు. నువ్వు ఎక్కడికి పోతున్నావో చెప్పమని పారు అడగటంతో నీకు కల వస్తే నేను ఎక్కడికి పోతానని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. మరి కాంచనకు కల వస్తే కార్తీక్ నీ మెడలో తాళి ఎందుకు కడతాడు అని రగిలిపోతుంది పారిజాతం. నీ మాటలు వింటుంటే వాడు నీ మెడలో తాళి కట్టాలని కోరుకున్నట్లే ఉందని అంటుంది పారు. ఈ విషయం ఇక్కడితో వదిలేయ్.. అందరి అనుమానాలకు నేను సమాధానం చెబుతానని అంటాడు కార్తీక్.
వెంటనే దీప చేయి పట్టుకుని.. నేను ఊహించుకున్న జీవితం నాకు దీపతో దొరికింది, వచ్చింది కల అని మీరు అనుకుంటున్నారు, పీడకల అని నేను అనుకుంటున్నాను. దీప మెడలో తాళి కట్టిన తర్వాత నా జీవితం సుఖంగా సాగలేదు. ఇంట్లో భోజనానికి కూడా ఇబ్బంది పడిన రోజులున్నాయి. పరిస్ధితులు ఎంత కష్టంగా ఉన్నా నా పక్కన ధైర్యంగా నిలబడింది నా భార్య. నేనెప్పుడూ నా భార్య సమస్య అని ఎప్పుడూ అనుకోలేదు. నా మీద నాకే నమ్మకం లేనప్పుడు నన్ను నమ్మి ముందుకు నడిపించింది. నేను ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నప్పుడు కొంతమంది నాకు బ్లడ్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. అలాంటి టైంలో బ్లడ్ ఇచ్చి నా ప్రాణాలు కాపాడింది దీప.. ఇలాంటి మనిషిని ఈ జన్మకే కాదు, ప్రతి జన్మకి భార్యగా ఉండాలని కోరుకుంటానని చెబుతాడు కార్తీక్. దీప గురించి చాలా చెప్పొచ్చు.. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి, మా పెళ్లి కూడా స్వర్గంలోనే జరిగింది. మళ్లీ భూమ్మీద పుట్టాం.. కలిసే జంటగా బతికాం. ఇలాగే బతుకుతామని చెబుతాడు కార్తీక్. ఆ మాటలతో అంతా చప్పట్లు కొడతారు.
నీ కూతురిని ఆశీర్వదించమని దాస్‌కి పారు చెబుతుండగా శివన్నారాయణకి అనుమానం వస్తుంది. దాంతో పారుని తీసుకుని దాస్ పక్కకి వస్తాడు. నీ దూకుడు చూస్తుంటే అందరికీ అనుమానం వచ్చేలా ఉంది. జ్యోత్స్నకి పైత్యం బాగా ఎక్కువైంది. కార్తీక్ గాడిని ఎగరేసుకుని పోవాలని జ్యోత్స్న ప్లాన్లు వేస్తోందని చెబుతుంది పారు. దీపకి నువ్వు దూరంగా ఉండమని పారుకి దాస్ చెప్పినా ఆమె వినిపించుకోదు. అందరూ టిఫిన్లు చేస్తుండగా.. దాస్, పారులకు కూడా టిఫిన్ వడ్డిస్తాడు కార్తీక్. దీపను కార్తీక్ ప్రేమగా చూసుకుంటూ ఉండటంతో పారిజాతం ఎమోషనల్ అవుతుంది. భర్త అంటే వీడు.. భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో చూడు అని చెబుతుంది.
అందరి భార్యలను భర్తలు అలాగే చూసుకుంటారు, ఇందులో స్పెషల్ ఏముంది? అని జ్యోత్స్న రగిలిపోతుంది. పుట్టుకతోనే కార్తీక్ కోటీశ్వరుడు, ఐశ్వర్యంలో పెరిగాడు. లండన్‌లో చదువుకున్నాడు, ఒక సాధారణ జీవితం ఏనాడూ బతికేందే లేదు. అలాంటి మనిషి ఆత్మాభిమానం చంపుకోలేక కట్టుబట్టలతో కుటుంబంతో సహా రోడ్డునపడ్డాడు. వేరే ఎవరైనా అయితే వారానికి బతకలేకే వచ్చి తాత కాళ్ల మీద పడేవారు. కానీ కార్తీక్ ఆ పని చేయలేదు, ఒక మామూలు మధ్యతరగతి మనిషిలా ఇడ్లీ బండితో ప్రారంభించాడు. నిజంగా అది సాహసమనే చెప్పాలి, దీప లాంటి ఒక సాధారణ మనిషికి జీవితాన్నిచ్చాడు. అర్ధరాత్రి ఉదయించిన సూర్యుడిలా నిద్రలేని రాత్రులు గడిపాడు. రెస్టారెంట్ బిజినెస్‌లో మాస్టర్ లాంటి కార్తీక్.. అయినవారి కోసం అన్నీ వదిలేసి మన మధ్య సామాన్యమైన మనిషిలా మిగిలిపోయాడు. జ్యోత్స్న లాంటి పిల్లబాతు బచ్చాకి నీ గురించి తెలియదు, దీప కోసం పడ్డ కష్టాలు అందరికీ తెలియదని కార్తీక్‌ని పొగడ్తలతో ముంచేస్తుంది.
నువ్వు చెప్పినవన్నీ నిజాలే.. కార్తీక్ లాంటి వాడి భర్త దొరకడం దీప అదృష్టమని చెబుతాడు శివన్నారాయణ, దశరథ. మీరు ఇలాగే కవర్ చేసుకోండి.. ఈలోపు నేను చేయాల్సింది నేను చేస్తానని రగిలిపోతుంది జ్యోత్స్న. ఆమె ఆవేశంగా వెళ్లిపోవడంతో జ్యోత్స్న దగ్గరికి వెళ్తుంది దీప. మనసు నిండా విషం పెట్టుకుని పైకి బాగా నవ్వుతున్నావని అంటుంది దీప. నువ్వు మాత్రం తక్కువా? నువ్వు బావతో మూడు ముళ్లు వేయించుకున్నావని చెబుతుంది. మాది దేవుడు కలిపిన బంధమని చెబుతుంది దీప. కాంచన అత్త ఏమని కలగన్నదో దానిని నేను నిజం చేస్తానని అంటుంది జ్యోత్స్న. మరోసారి నోటికొచ్చినట్లు వాగితే చెంప పగులుతుందని వార్నింగ్ ఇస్తుంది దీప.
నువ్వు నా ఒంటి మీద కొడితే నేను నీ బ్రతుకు మీద కొడతానని చెబుతుంది జ్యోత్స్న. సుమిత్ర గారు నన్ను క్షమించి ఎప్పటిలాగే నాతో ఉంటున్నారు. అది నీకు నచ్చలేదు.. ఎక్కడ నేను నా కన్నతల్లికి దగ్గరవుతున్నానో అని దూరం చేస్తున్నావు, మా బావ మీద ఆశలు పెట్టుకుంటే జీవితాంతం కుమారిగానే మిగిలిపోతావని వార్నింగ్ ఇస్తుంది దీప. గ్రానీని మీరు ఏదో చేశారని చెబుతుంది జ్యోత్స్న. దాంతో దాస్‌తో మాట్లాడాలని కోపంగా వెళ్తుంది జ్యోత్స్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications