Karthika Deepam 2 April 30th: పెళ్లికొడుక్కి జ్యోత్స్న వార్నింగ్.. కూతురి నిజస్వరూపం తెలుసుకున్న సుమిత్ర
Photo Courtesy: JioHotstar
జ్యోత్స్న విషయంలో జాగ్రత్తగా ఉండమని కార్తీక్, దీపలను హెచ్చరిస్తుంది పారు. దాంతో జ్యోత్స్న ఆటకట్టించడానికి ఓ ప్లాన్ చెబుతాడు కార్తీక్. ఒక మంచి చీర కొని.. అది నాకు నచ్చిందని, దీపకి ఇవ్వబోతున్నానని చెబితే ఖచ్చితంగా ఆ చీరని జ్యోత్స్నని లాక్కుంటుందని.. ఆ తర్వాత నేను అసలు కథ మొదలుపెడతానని అంటాడు కార్తీక్. తన ఫ్రెండ్ కూతురి బర్త్ డే కోసం గిఫ్ట్ కొనడానికి షాప్‌కి వెళ్తుంది జ్యోత్స్న. అక్కడ ఓ గిఫ్ట్ బాగా నచ్చి దానిని తనకు ఇవ్వమని ఆల్రెడీ కొనుక్కున్న కుర్రాడితో గొడవ పడుతుంది. అయితే అతను మాత్రం ఇవ్వనని తేల్చేస్తాడు.
కార్తీక్ చెప్పిన ప్లాన్ ప్రకారం.. చీర కొని జ్యోత్స్న ముందు దానిని దీపకి ఇవ్వబోతున్నానని, ఈ చీర కార్తీక్‌కి నచ్చిందని చెబుతుంది పారు. దాంతో ఆ చీరని నానమ్మ చేతిలో నుంచి లాక్కొంటుంది జ్యోత్స్న. తన ప్లాన్ వర్కవుట్ అవ్వడంతో పారు చాలా సంతోషిస్తుంది. ఉదయాన్నే కార్తీక్, దీపలు రాగానే పారుతో కలిసి తమ ప్లాన్ అమలు చేస్తారు. ఇంటికి ఓ కుర్రాడిని తీసుకొచ్చి జ్యోత్స్నకి సంబంధం చూశానని కార్తీక్ చెప్పడంతో శివన్నారాయణ, దశరథ, సుమిత్రలు సంతోషిస్తారు. ఇవేవి తెలియని జ్యోత్స్న చీర కట్టుకుని బావ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఏప్రిల్ 30వ తేదీ 658వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కార్తీక్ దగ్గరుండి పెళ్లికొడుకుని తీసుకురావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అందరూ కలిసి నన్ను బుక్ చేశారా? ఇంత వెర్రీదానిని అయిపోయానా అనుకుని టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. అమ్మాయిగారు చీరలో చాలా అందంగా ఉన్నారు.. నా దిష్టే తగిలేలా ఉంది అంటుంది దీప. మీ అందరికీ ముందే తెలుసా అని జ్యోత్స్న అడగ్గా.. తెలుసు అని శివన్నారాయణ కుటుంబం చెప్పడంతో జ్యోత్స్న ఫైర్ అవుతుంది. పెళ్లి చేసే బాధ్యత నువ్వే కార్తీక్‌కి ఇచ్చావు కదా అంటాడు శివన్నారాయణ. చేసేదేం లేక కుర్చీలో కూర్చొంటుంది జ్యోత్స్న. పెళ్లికొడుకు నీకు నచ్చితే సరిపోతుందా? మా వాళ్లకి నచ్చాలి కదా అంటుంది జ్యోత్స్న.
మాకు నచ్చాడని శివన్నారాయణ, సుమిత్ర, దశరథ, పారులు చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నాకు మాత్రం నచ్చలేదని జ్యోత్స్న చెప్పడంతో శివన్నారాయణ కుటుంబం ఉలిక్కిపడుతుంది. నచ్చకపోవడానికి నా కారణాలు నాకుంటాయని చెప్పిన జ్యోత్స్న.. పెళ్లికొడుకుని వెళ్లిపోమ్మని మండిపడుతుంది జ్యోత్స్న. మనదగ్గర మరో సంబంధం ఉందని కార్తీక్ చెప్పడంతో.. నువ్వు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా నాకు నచ్చవని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు. చూసినా నచ్చలేదంటారు.. చూడకపోయినా నచ్చలేదంటారు. నీ బరువు దించుకోవడానికి నా నెత్తిన బరువు పెట్టొద్దని మండిపడుతుంది జ్యోత్స్న.
సంబంధాలు చూడమంటారు... చూడొద్దంటారు, అసలు మీ మనసులో ఏముందో తెలియకుండా నేనేం చేయాలని కార్తీక్ అంటాడు. మీరు నాతో కాసేపు మాట్లాడితే నన్ను ఇష్టపడతారని పెళ్లికొడుకు చెప్పడంతో బయటికి పొమ్మంటూ సీరియస్ అవుతుంది జ్యోత్స్న. ఈ అమ్మాయి తిడుతుందేంటి? ఇలాంటి డైలాగ్స్ సీన్ పేపర్‌లో లేవు కదా అని పెళ్లికొడుకు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అతని మాటలతో కార్తీక్ అడ్డంగా ఇరుక్కుంటాడు. అసలు నువ్వు ఎవడ్రా అని శివన్నారాయణ అడగ్గా.. ఈ అబ్బాయి స్టేజ్ ఆర్టిస్ట్ అని పారిజాతం చెబుతుంది.
అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలియాలి కదా అందుకే ఈ ప్లాన్ అని చెబుతాడు కార్తీక్. పారుతో కలిసి ఈ పెళ్లిచూపులు నాటకం ఆడానని కార్తీక్ అంటాడు. ఆ వెంటనే ఆర్టిస్ట్‌కి డబ్బులిచ్చి బయల్దేరమని చెబుతుంది పారు. నేను నీ కూతురి పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నాను.. జ్యోత్స్నకి నెల రోజుల్లో పెళ్లి జరగాలి, లేదంటే జీవితంలో పెళ్లి యోగమే లేదన్నాడు. అలా జరిగితే నీ కూతురి పెళ్లి చూడాలన్న కల.. కలలాగే మిగిలిపోతుందని నీ కూతురికి మంచి పెళ్లి సంబంధం చూడాలని అనుకున్నాను. కానీ ఎక్కడో చిన్న అనుమానం వచ్చింది.. అది తీర్చుకోవడానికే ఈ పెళ్లిచూపుల డ్రామా అని అంటాడు కార్తీక్.
ఏం ఇరికించావు బావా? నా చేత్తో నా చెంపే పగలగొట్టావని అనుకుంటుంది జ్యోత్స్న. ఇదే నిజమైన సంబంధం అయ్యుంటే జ్యోత్స్న మాట్లాడిన మాటలకు అందరి పరువు పోయేది. ఈరోజు నీకు నీతో అసలైన నీ కూతురిని చూపిస్తానని చెప్పాను కదా? తనే అసలైన నీ కూతురు అని సుమిత్రతో అంటాడు. ఇప్పుడు నీ కూతురి మనసులో ఏముందో? ఎందుకు పెళ్లి చేసుకోనని అంటుందో నువ్వే కనుక్కోమని చెబుతాడు కార్తీక్. ఒక తల్లిగా నీ క్షేమం నేనెప్పుడూ కోరుకుంటాను.. కానీ నీ మనసేంటో తెలియకుండా నేనేం చయలేను. పెళ్లి చేసుకుంటాను అన్నావు.. నా కోరిక తీరుస్తానని అన్నావు. కానీ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావని జ్యోత్స్నపై మండిపడుతుంది సుమిత్ర. నీ నిర్ణయాన్ని బట్టే నేనేం చేయాలో నిర్ణయించుకుంటానని అంటుంది సుమిత్ర.
నిశ్చితార్ధానికి సిద్దమైన కూతురిపై చిరాకు పడుతుంది కావేరి. నేను కాశీతోనే కలిసుంటానంటే నాతో మాట్లాడతావా అని స్వప్న ఫైర్ అవుతుంది. నన్ను ఎంతో మంచోడు.. మరి నాన్నతో కలిసుంటానని కాంచన పెద్దమ్మ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తుంది స్వప్న. నన్ను నిన్ను, పెద్దమ్మను వదులుకోలేక నాన్న ఎంతో నలిగిపోతున్నాడు. కాంచన పెద్దమ్మ తనకు నచ్చినట్లుగానే ఉంటుంది, నేను కూడా అంతేనని అంటుంది. కాశీ కూడా నీలాగే అనుకుంటే అతని జీవితంలో మరో ఆడది ఉండేదని హెచ్చరిస్తుంది స్వప్న. నాన్న కాశీకి డ్రైవర్ పోస్ట్ ఇచ్చినట్లు.. నేను భర్త పోస్ట్ ఇవ్వలేను. కారుకి ఇన్సూరెన్స్ వస్తుంది.. జీవితానికి ఇన్సూరెన్స్ ఉండదని అంటుంది స్వప్న.
ఈ మాటలన్నీ విన్న శ్రీధర్.. చేసిన తప్పుని సరిదిద్దుకున్నవాళ్లు ఖచ్చితంగా గొప్పవాళ్లు అవుతారని అంటాడు. కాశీ నాకంటే ఉత్తముడు.. నన్ను ప్రాణంగా చూసుకునే భార్య ఉన్నా నేను మరో పెళ్లి చేసుకున్నాను. కానీ వాడు వద్దనుకున్న భార్య కళ్లముందే ఉన్నా.. మరో ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మగాడికి నిజమైన బలహీనత ఆడది. మగాడు ఎంత వెధవ అయినా వాడికి ఖచ్చితంగా మంచి పెళ్లాం ఉంటుంది. మనల్ని కోరుకున్న వాళ్లు మన జీవితంలో ఉంటే రెయిన్ బోలో ఉంటుంది.. టైం ఉంది కదా ఆలోచించు. నువ్వు సంతోషంగా ఉంటే దాని కోసం నేను ఏమైనా చేస్తానని చెబుతాడు శ్రీధర్. తల్లి కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పడంతో స్వప్న ఆలోచనలో పడుతుంది.
నీ నిర్ణయం ఏంటో చెప్పకపోతే పెళ్లిచూపులు దండయాత్రలా జరుగుతూనే ఉంటాయని చెబుతుంది పారు. కుటుంబ సభ్యులంతా నిలదీయడంతో .. నెల రోజుల్లో నా పెళ్లి జరుగుతుందని చెబుతుంది జ్యోత్స్న. పెళ్లి చేసుకోనని అంటున్నావు.. తర్వాత చేసుకుంటున్నానని అంటావు, నీ మనసులో ఏముందని చెప్పమని సుమిత్ర నిలదీయడంతో నా మనసులో బావ ఉన్నాడు, నేను బావని తప్పించి ఎవ్వరినీ పెళ్లి చేసుకోనని తేల్చిచెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది. ఎవరికో నచ్చినట్లుగా నేను బతకలేను.. నాకు నచ్చినట్లుగానే ఉంటానని తేల్చిచెబుతుంది. నీ బావ నా భర్త అని దీప చెప్పడంతో.. అంతకంటే ముందు నీ బావే నా భర్తని నాతో చెప్పారు, నిన్ను భార్యగా గుర్తిస్తేనే కదా అని జ్యోత్స్న అంటుంది. నా మెడలో తాళి కట్టాడని దీప చెప్పగా.. నా మెడలో కూడా తాళి కడతాడని చెబుతుంది జ్యోత్స్న. నా ఊపిరి ఉన్నంత వరకు నేనే కార్తీక్ భార్యనని చెబుతుంది దీప.
అయితే ఈ తాళి తెంపి నా మెడలో కట్టించుకుంటానని జ్యోత్స్న ప్రయత్నిస్తుండగా లాగిపెట్టి కొడుతుంది దీప. నా ముందే నా కూతురిని కొడతావా అంటూ దీపపై సీరియస్ అవుతుంది సుమిత్ర. కొట్టే చనువు నువ్వెందుకు తీసుకున్నావు.. ఆ పని చేయాల్సింది నేను కదా అని జ్యోత్స్న చెంప పగలగొడుతుంది సుమిత్ర. ఒక తల్లి చేయాల్సిన పని చేశావని మెచ్చుకుంటాడు దశరథ. నీ మనసులో కార్తీక్ మీద ప్రేమ నింపింది నేనే.. కార్తీక్ దీప మెడలో తాళి కట్టకపోయుంటే నీ కోరిక తీర్చడానికి నా తలని వాడి తల్లి కాళ్ల దగ్గర పెట్టయినా సరే నీతో తాళి కట్టించేదానిని. కానీ కార్తీక్ ఇప్పుడు దీప భర్త. నువ్వు ఇష్టపడటమే తప్పు.. నా మెడలో తాళి తెంపి వేరొకరు కట్టుకుంటానంటే నేను ఊరుకుంటానా? అలాగే దీప కూడా ఊరుకోదని చెబుతుంది సుమిత్ర. బావ మీద నా ఇష్టం ఇప్పుడు మొదలవ్వలేదు.. దీప వచ్చిందని అది పోదని తేల్చేస్తుంది జ్యోత్స్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications