Karthika Deepam 2 May 5th: సీఈవో పోస్ట్‌పై జ్యోత్స్న కన్ను... కార్తీక్‌ని బానిసని చేసిన జ్యోత్స్న ప్లాన్
Photo Courtesy: JioHotstar
అవమాన భారంతో రగిలిపోతున్న జ్యోత్స్నని శివన్నారాయణ, దశరథ, సుమిత్ర, పారులు ఓదారుస్తారు. నీ కోరిక తప్పు.. ఇకనైనా మారమని శివన్నారాయణ భోజనం తినిపిస్తాడు. కార్తీక్ ఆలస్యంగా ఇంటికి రావడంతో మండిపడుతుంది కాంచన. నాన్నకి ఆసుపత్రిలో టెస్టులు చేయించామని కార్తీక్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. కొడుకు మాటలతో భర్తకు ఎలా ఉందోనని భోజనం తినకుండా బాధపడుతుంది కాంచన. ఇంత బాధపెట్టుకుని ఆ మనిషిని ఎందుకు క్షమించలేకపోతున్నావని అడుగుతాడు కార్తీక్.
ఉదయాన్ని కార్తీక్ డ్యూటీకి వెళ్తుండగా.. పక్కకి పిలిచి లాగిపెట్టి కొడుతుంది కాంచన. మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిన విషయం నా దగ్గర ఎందుకు దాచావంటూ సీరియస్ అవుతుంది. ఆ మాటలు విన్న అనసూయ, దీపలు షాక్ అవుతారు. చిన్నప్పుడు మా నాన్న కూడా మా అమ్మకి గుండెపోటు వచ్చిన విషయం దాచాడని, మీ తాత చేసిన తప్పు నువ్వు చేయొద్దని ఏడుస్తుంది కాంచన. తల్లిని తీసుకుని ఆసుపత్రికి వెళ్తాడు కార్తీక్. శ్రీధర్‌కి టెస్టులు చేసిన డాక్టర్.. వచ్చే 15 రోజులు ఆయనకి చాలా బెడ్ రెస్ట్ కావాలి, ఏ మాత్రం అశ్రద్ధ చేసినా శ్రీధర్ గారి ప్రాణాలకే ప్రమాదమని చెబుతాడు. ఆ మాటలతో కార్తీక్, కాంచన, కాశీ, స్వప్నలు ఉలిక్కిపడతారు. బావ, దీపలు ఆడుతున్న గేమ్‌లో నువ్వు అరటి పండు లాంటి దానివి.. భవిష్యత్తులో నువ్వే బాధపడతావని పారుని హెచ్చరిస్తుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 5వ తేదీ 662వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
శ్రీధర్‌ని డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెబుతాడు. అయితే ఆయనకు ఆఫీసు నుంచి ఫోన్లు వస్తూనే ఉండటంతో కాంచన కోప్పడుతుంది. మీరు బాధ్యతలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతుంది. మీరు ఈ పరిస్ధితికి రావడానికి కారణం మీ పిల్లలే.. ఇంట్లో హాయిగా ప్రశాంతంగా ఉండేవారు, తీసుకెళ్లి సీఈవోని చేశారని సీరియస్ అవుతుంది. రెస్టారెంట్‌ని మార్కెట్‌లో నెంబర్‌వన్‌గా నిలబెట్టాలని రాత్రి పగలు రెస్ట్ లేకుండా కష్టపడుతున్నారు. మధ్యలో పోలీస్ గొడవలు, అరెస్ట్‌లు.. మళ్లీ మామూలు మనిషి కావడానికి నెల రోజులు పట్టిందని మండిపడుతుంది కాంచన.
నీ చెల్లెలు కూడా చేయాల్సినవన్నీ చేస్తోంది.. ఇంట్లోనూ టెన్షన్సే, ఆఫీసులోనూ టెన్షన్సే. ఏ మనిషి మాత్రం ఎంత వరకు భరించగలడని అంటుంది. కూతురు, కొడుకు చెప్పినట్లు వింటారు.. నేను చెప్పినట్లు వినరా అని ఫైర్ అవుతుంది. మీ నాన్నని తీసుకుని తాత దగ్గరికి వెళ్దామని కార్తీక్‌తో అంటుంది. అలాగే నువ్వు స్వప్నని తీసుకెళ్లి ఇంటికెళ్లమని కాశీతో చెబుతుంది. మీరిద్దరూ మాట్లాడుకోండి, ఆలోచించుకోండి. ఈ మనిషికి కాస్త మనశ్శాంతి కలిగించే పనులు చేయమని చెబుతుంది కాంచన.
దీపని మాత్రమే పంపి బావ ఎందుకు డ్యూటీకి రాలేదని జ్యోత్స్న ఆలోచిస్తుంటుంది. ఇంతలో కార్తీక్, కాంచన, శ్రీధర్‌లతో రావడంతో పేరెంట్స్‌తో ఎందుకొచ్చావు.. పెళ్లి విషయం మాట్లాడటానికా అని అడుగుతుంది జ్యోత్స్న. దీనికెప్పుడు సీరియస్‌గా మాట్లాడాలో, ఎప్పుడు వెటకారంగా మాట్లాడాలో అర్ధం కావడం లేదని ఫైర్ అవుతుంది. అల్లుడు అంత నీరసంగా ఉన్నాడని పారు అడగ్గా.. హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కార్తీక్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఆయనకి గుండెపోటు వస్తే ఎవరో అబ్బాయి హాస్పిటల్‌లో జాయిన్ చేశాడు. ఫోన్ వస్తే కార్తీక్ వెళ్లాడు.. అందరి దగ్గరా నిజం దాచాడని కాంచన చెబుతుంది.
నువ్వయినా మాకు చెప్పాలి కదా అని దశరథ అడగ్గా.. దీప చెప్పబోతుండగా జ్యోత్స్నే అడ్డుపడిందని ఇరికించేస్తుంది పారిజాతం. ఎదుటివాళ్లు చెప్పేది కూడా వినిపించుకోకపోవడం అమానుషమని శివన్నారాయణ సీరియస్ అవుతాడు. నన్ను ఏదో ఒక రకంగా బ్యాడ్ చేయాలని కొందరు రెడీగా ఉన్నారని జ్యోత్స్న మండిపడుతుంది. నా వల్ల ఎవరూ గొడవలు పడొద్దు.. నేను బాగున్నాను అని చెబుతాడు శ్రీధర్. మీరు బాగున్నారా? మరోసారి స్ట్రోక్ వస్తే మీకు బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్ గారు చెప్పారని కాంచన మండిపడుతుంది. ఇదంతా విన్న శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది.
సమస్య చాలా తీవ్రంగా ఉంది.. ఆయనింకా సీఈవో పోస్ట్‌లో ఉండడని చెబుతుంది కాంచన. ఈ విషయం నువ్వు మావయ్యకి భార్యగా చెబుతున్నావా అని జ్యోత్స్న నిలదీస్తుంది. కార్తీక్‌కి తల్లిగా చెబుతున్నానని అంటుంది కాంచన. అయితే మావయ్యకి రెస్ట్ ఇవ్వాలి కాబట్టి.. బావని సీఈవో చేయాలని అంటావా అని ప్రశ్నిస్తుంది. ఆ విషయం నేను అడిగానా అని మండిపడతాడు కార్తీక్. ఈ విషయం అడిగితే మావయ్య కొడుకుగా బావ అడగాలి. లేదంటే మావయ్య ఎక్కడ ఉంటున్నాడో వాళ్లొచ్చి అడగాలని అంటుంది జ్యోత్స్న. ఈ మాటలతో శివన్నారాయణ కుటుంబం మండిపడుతుంది.
వాళ్లిద్దరూ భార్యాభర్తలుగా దూరంగా ఉన్నా.. నా తల్లిదండ్రులుగా నాకు దూరంగా లేరు. నా తండ్రికి ఆరోగ్యం బాలేకపోతే నా తల్లి ఎందుకు ఆలోచించదు, నా తల్లి హక్కుని ప్రశ్నించే రైట్ ఎవ్వరికీ లేదని కార్తీక్ సీరియస్ అవుతాడు. అది ప్రశ్నించినా నేను ఊరుకోనని అంటాడు శివన్నారాయణ. మావయ్య సీఈవో పోస్ట్‌కి రిజైన్ చేస్తే.. కార్తీక్‌ని సీఈవోని చేస్తే అత్త, దీపలు హ్యాపీగా ఫీల్ అవుతారని అంటుంది జ్యోత్స్న. మీ మావయ్యకే కాదు.. కార్తీక్‌కి కూడా విశ్రాంతి కావాలి, వాడి అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేయమని కాంచన అడగటంతో అంతా షాక్ అవుతారు. కార్తీక్ వాళ్ల నాన్నకి ఏ సమస్య అయితే వచ్చిందో, రేపు కార్తీక్‌కి కూడా అదే సమస్య రావొచ్చని అంటుంది కాంచన.
ఆస్తులు లేకపోయినా ఇడ్లీ బండి పెట్టుకున్నప్పుడే సంతోషంగా ఉండేవాళ్లం. నా కొడుకుని జీతంలేని పనివాడిని చేశావని కాంచన మండిపడుతుంది. నిర్ణయం నాన్న చేతిలోనే ఉంది.. నా కొడుకుని, వాళ్ల నాన్నని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోనా అని అడగ్గా.. తీసుకెళ్లిపోమని చెబుతుంది పారు. కూతురి మాటని తండ్రి కాదంటాడా? అని అంటుంది. శ్రీధర్‌కి విశ్రాంతి ఇవ్వడం నా చేతిలోనే ఉంది కానీ, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి నీ కొడుకుని విడిపించడం జ్యోత్స్న చేతుల్లో ఉందని అంటాడు.
అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే 10 కోట్లు కట్టాలని జ్యోత్స్న కండీషన్ పెట్టింది. కార్తీక్ సరేనని అంటే ఆ 10 కోట్లు నేను కడతానని చెబుతాడు శివన్నారాయణ. కానీ నీ కొడుకు ఒప్పుకోడు.. వాడిని ఎవరూ బంధించలేదు, వాడే బంధించుకున్నాడని అంటాడు. చెప్పినా కూడా బావ గీత దాటి బయటకు రాలేడని అంటుంది జ్యోత్స్న. నీకు 10 కోట్లు సరిపోవా అని కాంచన సీరియస్ అవుతుంది. ఇక్కడ షరతు డబ్బు కాదు.. నా పెళ్లి అని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నా పెళ్లి జరిగే వరకు బావ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వదు, నాకు నా అగ్రిమెంట్‌కి కట్టుబడి ఉండాలని తేల్చేస్తుంది జ్యోత్స్న.
మావయ్య గారు బాధపడేది మన గురించే, మనం కలిసే ఉందామని స్వప్నతో చెబుతాడు కాశీ. దాంతో స్వప్న చప్పట్లు కొడుతూ.. ఇప్పుడు నీ ప్రేమకు నా తండ్రి ప్రాణాలు అడ్డుపెట్టుకోవాలని అనుకుంటున్నావా అని మండిపడుతుంది. నేనేైతే నీతో కలిసి ఉండలేనని తేల్చేస్తుంది కాశీ. అయితే కలిసున్నట్లు నటించు.. మనం విడాకులు తీసుకోవడం లేదు, కలిసే ఉన్నామని తెలిస్తే మావయ్య గారు చాలా సంతోషంగా ఫీల్ అవుతారని చెబుతాడు కాశీ. కలిసిపోయినట్లుగా నటించడం కూడా నాకు ఇష్టం లేదని చెబుతుంది స్వప్న. అయితే కూర్చొని ఆలోచించమని చెబుతాడు కాశీ.
నీ పెళ్లికి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి సంబంధం ఏంటీ? అని శ్రీధర్ అడుగుతాడు. నా పెళ్లి బాధ్యత బావ తీసుకున్నాడు కాబట్టి.. నా మెడలో మూడు ముళ్లు పడిన మరుక్షణమే బావ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందని తేల్చేస్తుంది జ్యోత్స్న. ఏం తెలివి తేటలే నీవి.. మీ మావయ్య సీఈవో పోస్ట్ నుంచి తప్పుకుంటే ఎక్కడ ఆ స్థానంలో నా కొడుకు వచ్చి కూర్చొంటాడోనని ముందుగానే జాగ్రత్తగా పడుతున్నావా అని అడుగుతుంది కాంచన. నీ కొడుకు నిజంగానే సీఈవోని చేయాలని అనుకున్నావా అని నిలదీస్తుంది జ్యోత్స్న. కార్తీక్ సరేనంటే ఇప్పుడే వాడిని సీఈవో పోస్ట్‌లోనే కాదు.. నా ఛైర్మన్ పోస్ట్‌లోనే కూర్చోబెడతానని అంటాడు శివన్నారాయణ.
నాకేమీ ఆస్తులు, పదవులు అక్కర్లేదని తేల్చేస్తాడు కార్తీక్. వాడు అలాంటి వాటికి ఆశపడేవాడే అయితే ఆ వైరాగాడి నుంచి కొట్టేసిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా వాడి దగ్గరే పెట్టుకునేవాడని అంటుంది పారు. నా మనవడిని ఎవరూ డబ్బుతో కొనలేరని నాకు తెలుసు.. నీ నిర్ణయం ఏంటో చెప్పమని కార్తీక్‌ని అడుగుతాడు శివన్నారాయణ. పెద్ద మేడం గారి తిక్క కుదర్చాలంటే నేను ఇక్కడే ఉండాలని కార్తీక్ అనుకుంటాడు. నీ మెడలో మూడు ముళ్లు పడే వరకు నేను, నా భార్య ఇక్కడే ఉంటామని తేల్చేస్తాడు కార్తీక్. కార్తీక్ విషయంలో నేను ఏం చేయలేను.. శ్రీధర్‌ని అయితే ఈ క్షణమే సీఈవో బాధ్యతల నుంచి తప్పిస్తున్నానని అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న కంపెనీ నెక్ట్స్ సీఈవో ఎవరో బోర్డ్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటానని చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications