Karthika Deepam 2 May 12th: పారు కళ్లుతెరిపించిన జ్యోత్స్న.. దాస్ పొరపాటుతో ఇరుక్కుపోయిన కార్తీక్, దీప
Photo Courtesy: JioHotstar
కార్తీక్, దీపలు వచ్చేసరికి శివన్నారాయణ ఇంటి గేటు ముందు ఓ పెద్దాయన నిలబడి చూస్తుంటాడు. ఆయనను పలకరించి లోపలికి తీసుకెళ్తుండగా పారు చూసి అతనిని దక్షిణామూర్తి అని గుర్తుపట్టి, వాళ్లు లోపలికి వస్తే ఇంట్లో రక్తపాతం అని భయపడుతుంది. కార్తీక్‌ను ఆపాలని పరిగెత్తుకుంటూ వచ్చి శివన్నారాయణను గుద్దుకుంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి నీకొక సర్‌ప్రైజ్ అని చెప్పి దక్షిణామూర్తిని లోపలికి పిలవగా శివన్నారాయణ కోపంతో రగిలిపోతాడు. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ వచ్చావు? బయటికి పో అని రంకెలు వేస్తాడు.
నేనొచ్చింది నీకోసం కాదు.. నా కూతురు సుమిత్ర కోసమని దక్షిణామూర్తి చెబుతాడు. తండిని నట్టింటిలో చూసి షాకైన సుమిత్ర.. నేను చనిపోయానని, కర్మకాండలు జరిపించి మళ్లీ ఎందుకు వచ్చావని రగిలిపోతుంది. మర్యాదగా వెళ్తావా? తలబాదుకుని చావమంటావా అంటూ గోడకేసి కొట్టుకుంటుంది సుమిత్ర. దాంతో నేను ఇప్పుడు వెళ్లిపోతున్నాను, కానీ ఏదో ఒకరోజు మీరే వెతుక్కుంటూ వస్తారని చెప్పి దక్షిణామూర్తి వెళ్లిపోతాడు. అసలు ఆయన ఎవరు? తాతతో గొడవలేంటీ? అని కార్తీక్, దీపలు అనుకుని పారును అడుగుతుండగా శివన్నారాయణ చూసి అతని పేరెత్తడానికి వీల్లేదు, గతం గురించి చెప్పడానికి వీల్లేదని పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 12వ తేదీ 668వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దక్షిణామూర్తి గురించి పిల్లలకి చెప్పొద్దని పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. నేను ఆ పెద్దాయన గురించి చెప్పమని అడిగానా? నన్నెందుకు ఇరికించావు? అని మండిపడుతుంది జ్యోత్స్న. నా మనవడిని, మనవరాలిని నేనెందుకు ఇరికిస్తానని అంటుంది పారు. మనవరాలేంటీ? అని జ్యోత్స్న అడగ్గా.. మనవడి భార్య మనవరాలే కదా అని కవర్ చేస్తుంది పారు. నా వెనుక పవర్ ఉంది.. అదే నా బలమని అంటుంది. అయితే నీ కళ్లు తెరిపిస్తానని చెప్పి లాక్కెళ్తుంది జ్యోత్స్న.
సుమిత్రను టెస్ట్ చేసిన డాక్టర్.. ఆమెకు ఆపరేషన్ ఈ మధ్యే జరిగింది కాబట్టి తిరిగి కోలుకోవడానికి కనీసం 4 నెలలు పడుతుంది. అప్పటి వరకు ఉక్కిరిబిక్కిరి అయ్యే సంఘటనల గురించి చెబితే ఇలాగే కళ్లు తిరిగి పడిపోతారని డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు. సుమిత్ర గారు పూర్తిగా కోలుకోవాలంటే ఎప్పుడూ ఆనందంగా ఉండాలని చెబుతాడు. మరోసారి నీ మనసు కష్టపెట్టే పనిచేయను.. నీకోసం ఏమైనా చేస్తానని సుమిత్రతో అంటాడు శివన్నారాయణ. ఇన్నేళ్లూ పుట్టిల్లు లేదని బతుకుతున్నావు కదా? పాత బంధాల్ని ఆహ్వానించాల్సిన అవసరం లేదని సుమిత్రకు చెబుతాడు దశరథ.
దాస్‌కి ఫోన్ చేసిన జ్యోత్స్న.. పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతుంది. నువ్వేదో పెద్ద తప్పు చేసినట్లుగా ఉన్నావు, అందుకే భయపడుతున్నావు అంటుంది.నా గురించి నిజాలు తెలిసిపోతే నన్ను ఈ ఇంట్లో ఉండనివ్వరని డ్రామా ఆడుతుంది. ఈ తండ్రి బతికుండగా నీకు ఏం కాదని చెబుతాడు దాస్. ఆ మాటలు విన్న పారిజాతం షాక్ అవుతుంది. నీ మీద నాకు కోపమున్నా.. నువ్వు నా కూతురివే, నువ్వు ఇలా తయారవ్వడానికి కారణం మా అమ్మ. మా అమ్మ నీకు విషం కలిపి తినిపించింది, పాము తన కోరల్లో దాచుకున్న విషం లాంటిదని అంటాడు దాస్. ఇప్పుడు నువ్వు పాములాంటి దానివి.. నిన్ను కన్నబిడ్డలా చూసుకున్న కుటుంబాన్ని కాటువేయాలని చూస్తున్నావని మండిపడతాడు.
నేను మంచిగా మారిపోతాను.. నాకు ఈ ఆస్తులు, అంతస్తులు వద్దు. నేను ప్రశాంతమైన జీవితం గడపాలని అనుకుంటున్నాని అంటుంది జ్యోత్స్న. నీకు ఏ కష్టమొచ్చినా ఈ తండ్రి ఉన్నాడు.. కోట్లు సంపాదించకపోయినా కష్టపడి నిన్ను పోషించుకుంటానని చెబుతాడు తండ్రి. ఈ మాటలన్నీ విన్న పారు రగిలిపోతుంది. కన్నతల్లికి ద్రోహం చేస్తావా? అంటూ సీరియస్ అవుతుంది. నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదని తెలిసిన తర్వాత నీకు ఈ తండ్రి ఉన్నాడని అంటాడు దాస్. ఇక నీ కొడుకు వెళ్లిపోయాడు.. నువ్వు రావొచ్చని పారుని పిలుస్తుంది జ్యోత్స్న. మూసుకుపోయిన కళ్లు తెరిపిస్తానని చెప్పాను కదా. ఇన్నిరోజులు చెబుతుంటే వినలేదు కదా ఇప్పుడు తెలిసిందా అని ఫైర్ అవుతుంది జ్యోత్స్న.
దక్షిణామూర్తి తాత గురించి ఎవరిని అడగాలో తెలియక ఆలోచిస్తుంటుంది దీప. ఇంతలో కార్తీక్ భోజనం తీసుకుని వస్తాడు. ఆ తాత గురించి నేను తెలుసుకుంటాను కానీ నీ కడుపులో ఉన్న బుజ్జి పాపాయి గురించి ఆలోచించమని అంటాడు కార్తీక్. దీపకి కార్తీక్ భోజనం తినిపిస్తుండగా ఇన్నిరోజులు నన్నెంత వెర్రీదానిని చేశారని రగిలిపోతుంది పారు. జ్యోత్స్న, పారులను చూసిన కార్తీక్.. పనివాళ్లకు ప్రైవసి ఉండదా? పెళ్లానికి గోరుముద్దలు తినిపించడానికి కూడా వీల్లేదా? అని అడుగుతాడు. అఖిల భారత పనోళ్ల సంఘానికి ప్రెసిడెంట్ కావాల్సిన దానివి నువ్వేం మాట్లాడటం లేదని పారుని అడుగుతాడు.
పారుకి ఏదో పోయేకాలం వచ్చింది.. పట్టపగలు ఏదేదో మాట్లాడుతోందని అంటాడు కార్తీక్. పారు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుండటంతో కార్తీక్, దీపలకి ఏం అర్ధం కాదు. తాతిచ్చిన క్లాస్‌కే ఇలా అయిపోయిందని అనుకుంటాడు కార్తీక్. దీపకి భోజనం తినిపిస్తుండగా.. నువ్వు తినిపిస్తేనే కానీ నీ మరదలు తినదా అంటుంది జ్యోత్స్న. పెళ్లి పెటాకులు లేనిదానివి.. మొగుడు పెళ్లాలా బంధం గురించి నీకెం తెలుసు, కడుపుతో ఉన్న బిడ్డని ప్రేమగా చూసుకోవాలని అంటాడు కార్తీక్. నువ్వు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే అన్నీ తెలుస్తాయని కార్తీక్ చెప్పగా.. అయితే చేసుకో కంటానని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలతో దీప సీరియస్ అవుతుంది.
అడ్డమైన వాళ్లని లోపలికి తీసుకురావొద్దని జ్యోత్స్న అనగా.. కట్ చేసి కారం పెడతా, అతను నా కన్నతల్లికి కన్నతండ్రి అంటే నాకు తాత అంటుంది దీప. ఎవరినీ తిట్టని మా మమ్మీ ఆయనని తిట్టి పంపించింది అంటే అతనెంత దుర్మార్గుడో అంటుంది జ్యోత్స్న. నిన్ను మించిన దుర్మార్గులు మన బంధువుల్లో ఎవరూ ఉండరు.. నీ పాపం ఇంకా పూర్తిగా పండలేదు, తెలిసినరోజున మూర్తి తాతని ఎంత అసహ్యించుకున్నారో, అంతకుమించి ఈ ఇంట్లో నిన్ను అందరూ అసహ్యించుకుంటారని అంటుంది దీప. నువ్వు బతికుండగా ఆ రోజు రాదని చెబుతుంది జ్యోత్స్న. భగవంతుడు నీకు ఇండికేటర్ ఆన్ చేశాడు.. నీకు కనిపించడం లేదని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. నీ ఆట నువ్వు ఆడు.. నా ఆట నేను ఆడతానని చెబుతుంది జ్యోత్స్న.
పారు చాలా విచిత్రంగా ప్రవర్తించింది.. ఏదో జరిగిందని కార్తీక్ అనుమానిస్తాడు. పారు బాధపడుతుండగా జ్యోత్స్న వచ్చి జ్యూస్ ఇస్తుంది. నా కొడుకు నన్ను మోసం చేశాడని పారు చెప్పగా.. అందుకే నీ కొడుకుతోనే నీకు బుద్ధి చెప్పానని అంటుంది జ్యోత్స్న. నువ్వు అసలైన వారసురాలివి కానప్పుడు నీ బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి? బోన్ మ్యారో మీ అమ్మకి ఎలా ఇచ్చావని పారు ప్రశ్నించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications