Karthika Deepam 2 May 19th: జ్యోత్స్న ప్లాన్ తిప్పికొట్టిన కార్తీక్... శివన్నారాయణ ఇంట్లో కాంచన, దీపల మకాం
Photo Courtesy: JioHotstar
కొత్త సీఈవో కోసం నిర్వహించిన ఓటింగ్‌లో దీప, జ్యోత్సలకు సమానంగా ఓట్లు రావడంతో శివన్నారాయణ ఒక టెస్ట్ పెడతాడు. నష్టాల్లో ఉన్న రెండు రెస్టారెంట్స్‌ని చెరొకరికి ఇస్తాం. ఇద్దరిలో ఎవరు రెండు వారాల్లోగా తమ రెస్టారెంట్స్‌ని లాభాల్లో నడిపిస్తే వారే కొత్త సీఈవో అని చెబుతాడు పెద్దాయన. ఈ ఒప్పందానికి నేను ఒప్పుకుంటున్నాను అని జ్యోత్స్న అనగా.. దీప కూడా సై అంటుంది. అయితే ఈ పోటీ జరిగినంత కాలం కార్తీక్, దీపలు విడిపోవాలి. బావ మా ఇంట్లో ఉంటాడు, దీప వాళ్లింట్లోనే ఉంటుందని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
ఈ ఒప్పందానికి ఒప్పుకోకపోతే పోటీలో నుంచి తప్పుకోవచ్చని జ్యోత్స్న రెచ్చగొట్టడంతో దీప రగిలిపోతుంది. కార్తీక్ చెబుతున్నా వినిపించుకోకుండా దీప సరేనని చెబుతుంది. కార్తీక్, దీపల కోసం ఎదురుచూస్తున్న కాంచనకి శ్రీధర్ కనిపించడంతో బోర్డ్ మీటింగ్‌లో ఏం జరిగింది? కొత్త సీఈవో ఎవరు? అని కాంచన అడుగుతుంది. ఇంతలో కార్తీక్, దీపలను తీసుకుని జ్యోత్స్న రావడంతో రగిలిపోతుంది. బావ ఇకపై ఇక్కడ ఉండడని మా ఇంట్లోనే ఉంటాడని జ్యోత్స్న చెప్పడంతో కాంచన షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 19వ తేదీ 674వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నా కొడుకుని, కోడలిని విడదీయడానికి అసలు నువ్వెవరు అంటూ జ్యోత్స్నపై మండిపడుతుంది కాంచన. ఈ విషయాన్ని మీ నాన్నతోనే తేల్చుకుంటానని కాంచన ఫోన్ చేయబోతుండగా కార్తీక్ లాక్కుంటాడు. షరతులు పెడితే మీరెందుకు ఒప్పుకున్నారు? అని కాంచన ప్రశ్నించగా.. కంపెనీ ఈవిడగారి చేతిలో పెడితే ఉద్యోగులంతా అడుక్కుతినాలి, స్ట్రైక్‌లు, బంద్‌లు, తిరుగుబాట్లు.. నెంబర్‌వన కంపెనీని నాశనం చేశావు. ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు, మళ్లీ సీఈవో అవుతున్నావని తెలియగానే భయంతో సగం మందికి మోషన్స్ పట్టుకున్నాయి. టెంపరరీ అని తెలియగానే నిమ్మరసం తాగి శాంతించారు. అందరి క్షేమం గురించి ఆలోచించే సీఈవో పోస్ట్‌కి దీపకి తీసుకొచ్చానని చెబుతాడు కార్తీక్.
ఇలా ఎన్ని రోజులు ఉంటావని కాంచన అడగ్గా.. రెండు వారాలే, అయినా పెళ్లియిన తర్వాత మాకు ఆషాడం రాలేదు కదా. భార్యను పుట్టింటిలో కాదు.. అత్తింటిలో వదిలేసి వెళ్లిపోతున్నానని దీపని బ్యాగ్ తీసుకుని రమ్మంటాడు. చెట్టు నీడలో ఉన్న నా కొడుకుని పడగ నీడలోకి పంపుతున్నాను.. నువ్వు విష సర్పానికంటే ప్రమాదకరమైన దానివని అంటుంది. నీ కోడలు నాకు పోటీకి రాకపోయుంటే ఇదంతా జరిగేది కాదు కదా, అప్పుడు నువ్వు నిందించాల్సింది నీ కోడలిని అంటుంది జ్యోత్స్న. దీపకి, కాంచనకి జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు కార్తీక్. కాంచన, దీపల ముందే కార్తీక్ చేయి పట్టుకుని లాక్కెళ్తుంది దీప. అది చూసి అత్తాకోడళ్లు కంటతడి పెడతారు.
శివన్నారాయణ ఇంటికి రాగానే జ్యోత్స్న, కార్తీక్‌లను చూసిన పారు.. చివరికి నువ్వు నా మనవడికి డ్రైవర్‌వి అయ్యావన్న మాట అంటుంది. నేను బావకి మార్గదర్శిని, దిశానిర్దేశకురాలిని కూడా అని చెబుతుంది. నువ్వు పెట్టిన కండీషన్స్ తెలుసుకుని మీ అమ్మ నీ మీద కోపంతో ఉంది.. చింతకాయ పచ్చడి చేస్తుంది వెళ్లు అని చెబుతుంది పారు. లోపలికి వెళ్లగానే సుమిత్ర రగిలిపోతూ ఉంటుంది. జరిగినదాంట్లో నా తప్పు ఉంది అనుకుంటే ఇప్పుడే దీపని పోటీలో నుంచి తప్పుకోమనండి అని చెబుతుంది జ్యోత్స్న. నన్ను సీఈవోని చేస్తానని అన్నారు.. నేను రెడీగానే ఉన్నాను. సడెన్‌గా దీపని తీసుకొచ్చారు.. ఓటింగ్ పెట్టారు, ఓట్లు సమానంగా వచ్చాయి తప్పు నాదా? మీరు పెట్టిన క్లాజ్ ప్రకారం నాకు గానీ, దీపకి గానీ సలహాదారులు ఉండకూడదు. బావ మన కంపెనీకి మాజీ సీఈవో.. భార్యని చాలా ఈజీగా గెలిపిస్తాడు. నీ కూతురు ఓడిపోవడం నీకు ఇష్టమేనా అని అని నిలదీస్తుంది జ్యోత్స్న.
నువ్వు ఓడిపోవడం నాకు ఇష్టం ఉండదు.. కానీ భార్యాభర్తల్ని విడదీయడం తప్పు కదా? అంటుంది సుమిత్ర. దీప, బావ ఒప్పుకున్నప్పుడు నేనేం చేస్తానని చెబుతుంది జ్యోత్స్న. మీరు అవన్నీ బాగానే చేస్తారు.. పెద్ద వాళ్లం ముఖాలు చూసుకోగలమా అని ప్రశ్నిస్తుంది సుమిత్ర. నేనే అత్త దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పి బావని తీసుకొచ్చానని అంటుంది జ్యోత్స్న. దీనిలో ఎవరికీ ఏ అభ్యంతరం లేదు, అభ్యంతరం ఉంటే చెప్పమని బావని అడుగుతుంది. మీ కారణంగా పెద్దవాళ్లు బాధపడే పరిస్ధితి తీసుకురావొద్దని చెబుతుంది సుమిత్ర. రెండు వారాలు గెస్ట్ రూమ్‌లో ఉండు.. రేపటి నుంచి కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతుందని కార్తీక్‌తో చెబుతుంది జ్యోత్స్న. మొత్తానికి సాధించావని మనవరాలిని మెచ్చుకుంటుంది పారు. కార్తీక్‌కి అనుమానం రాకుండా చూసుకుంటున్నానని అంటుంది.
కార్తీక్, దశరథ, శివన్నారాయణలు మాట్లాడుకుంటూ ఉంటారు. నా చెల్లికి, నీ భార్యకి నేను సంజాయిషీ ఇచ్చుకోవాలి, లేదంటే నేను తప్పు చేసిన మనిషిలా మిగిలిపోతానని బాధపడతాడు దశరథ. అయితే ఫోన్ చేసి మాట్లాడమని చెబుతాడు కార్తీక్. నీ భార్య కడుపుతో ఉంది.. కడుపుతో ఉన్న భార్యకి భర్తని దూరం చేయడం పాపం కదా అని శివన్నారాయణ బాధపడతాడు. కార్తీక్ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో దీపపై మండిపడుతుంది కాంచన. డబ్బు కోసం మొగుళ్లని అమ్మేసినవాళ్లని చూశాను కానీ.. పదవి కోసం ప్రియురాలికి మొగుడిని తాకట్టు పెట్టిన దానిని నిన్నే చూశానని ఫైర్ అవుతుంది. ఇంతలో దీపకి దశరథ నుంచి ఫోన్ వస్తుంది.
నన్ను క్షమించమని దశరథ అంటాడు. చేసినదంతా చేసి ఇప్పుడు క్షమాపణలు అడుగుతున్నావా అని కాంచన మండిపడతాడు. మీరు కళ్లు తెరిచే ఉన్నారా? మీ కూతురు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తుంటే దానికి బుద్ధి చెప్పకుండా నాకు క్షమాపణలు చెప్పడానికి ఫోన్ చేశారా? కడుపుతో ఉన్న నా కోడలి ఉసురు మీకు తగులుతుందని కాంచన బాధపడుతుంది. మీ ఆస్తులు, మీ కంపెనీలు, మీ మనుషులు అందరూ బాగానే ఉన్నారు. కడుపుతో ఉన్న నా కోడలిని ఆఫీస్‌లో కూర్చోబెడతారా అని నాన్నకి ఫోన్ ఇవ్వమని అంటుంది కాంచన. నా వల్ల కాదని శివన్నారాయణ కంటతడి పెడతాడు. అమ్మ ఊపిరి వదిలేసి చచ్చిపోయింది.. నేను ఊపిరి ఉండగానే చచ్చిపోయానని కాంచన అనడంతో శివన్నారాయణ, దశరథలు ఏడుస్తారు.
దీప గురించి చెప్పి మీరే నన్ను కన్విన్స్ చేశారు. రేపు ఉదయం నవ్వుతో ఉన్న నా కూతురిని చూడాలని దశరథకు, కార్తీక్‌కు కండీషన్ పెట్టి కోపంగా వెళ్లిపోతాడు శివన్నారాయణ. ఏం చేయాలో అర్ధం కావడం లేదని దశరథ చెప్పగా.. అందరూ బాగుండాలంటే ఒకటి చేయాలి, అదే చేద్దామని అంటాడు కార్తీక్. ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్లేందుకు రెడీ అయిన జ్యోత్స్నని చూసి మురిసిపోతుంది పారు. దీప కూడా ఆఫీస్‌కి వస్తుంది కదా అని పారు అడగ్గా.. మొగుడు దూరమైపోయాడనే బాధలో ఏడుస్తూ ఉంటుందని చెబుతుంది. ఉదయాన్నే దీప, కాంచనలు రావడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. కండీషన్ ప్రకారం నువ్వెందుకు వచ్చావు, మా అత్తని ఎందుకు తీసుకొచ్చావని దీపపై మండిపడుతుంది జ్యోత్స్న.
నా కూతురినే ఎందుకొచ్చావని నిలదీస్తావా అని పెద్దాయన ఫైర్ అవుతాడు. ఇది నీకు పుట్టిల్లు అయితే, నాకు పుట్టిల్లే కదా అంటుంది కాంచన. నా కొడుకు ఆఫీస్ పని మీద క్యాంప్‌కి వెళ్లాడు.. కొడుకు, మనవరాలు లేని ఇంట్లో నేనేం ఉంటాను. అందుకే నా కొడుకు వచ్చే వరకు పుట్టింటిలో ఉందామని వచ్చానని కాంచన చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications