Karthika Deepam 2 June 9th: దీప రెస్టారెంట్‌ సీజ్ చేసేలా జ్యోత్స్న కుట్ర... రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సూరజ్

Photo Courtesy: JioHotstar

సూరజ్ జోలికి వెళ్లొద్దు అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండమని జ్యోత్స్నకి పారు చెబుతుండగా సూరజ్ ఫోన్ చేస్తాడు. ఇంటికెళ్లిన తర్వాత కూడా నా గురించే మాట్లాడుకుంటున్నారా అని సెటైర్లు వేస్తాడు. అసలు నువ్వు మా ఆఫీస్‌కి ఎందుకొచ్చావు అని జ్యోత్స్న అడగ్గా.. రా రా అని అన్నిసార్లు అడిగితే రాకుండా వస్తానా అని కౌంటర్ వేస్తాడు సూరజ్. రేపటి నుంచి నీకు నిద్రపట్టదని వార్నింగ్ ఇస్తాడు. మన జీవితాల్ని ఉతికి ఆరేసేవాడు ఒక్కడైనా తగులుతాడు, ఆ ఒక్కడు నీకు తగిలాడు అంటుంది పారు. వాడేం చేస్తాడో నేను కూడా చూస్తానని అంటుంది జ్యోత్స్న.

దీప, శౌర్యలు దాగుడుమూతలు ఆడుకుంటూ ఉండగా శౌర్య వెళ్లి శివన్నారాయణ గదిలోని కబోర్డ్‌లో దాక్కుంటుంది. ఆ సమయంలో దక్షిణామూర్తి, శివన్నారాయణ ఫోటో చినిగిపోయి కనిపించడంతో ఈ ఫోటో ఎందుకు చినిగిపోయిందని అందరినీ అడుగుతుంది. ఇంతలో శివన్నారాయణ రావడంతో తనని కూడా అడుగుతుంది. కార్తీక్, దీపలు కూతురిని అడ్డుపెట్టుకుని దక్షిణామూర్తి గురించి వివరాలు రాబట్టాలని ఇలా ప్లాన్ చేశారని మండిపడుతుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్, జ్యోత్స్నలు గొడవపడుతుండగా.. శివన్నారాయణ గురించి మీకు తెలియాల్సిన టైం వచ్చిందని అందరికీ గతం చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 9వ తేదీ 692వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 692 June 9th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

సూరజ్ తనను అదే పనిగా చూస్తుండటంతో నీ మీద వేధింపుల కేసు పెడతానని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నేను మిమ్మల్ని చూడటం లేదు.. గడియారాన్ని చూస్తున్నానని చెబుతాడు సూరజ్. కార్తీక్, దీపలు కాఫీ తాగుతూ.. దక్షిణామూర్తి తాత గురించి తాత చెప్పిన విషయాన్ని ఏమంటావని అడుగుతుంది దీప. దక్షిణామూర్తి పైకి కనిపించేంత మంచివాడు కాదని అంటాడు కార్తీక్. ఇన్నాళ్లూ ఆ కుటుంబం లేదు అనుకునే బతికారు.. ఇప్పుడు కూడా అలాగే ఉంటారని, ఆ కుటుంబంలోని మిగిలినవాళ్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెబుతాడు కార్తీక్.

నా తండ్రి చావు కోరుకున్న ఆ కుటుంబం నాకు కూడా అక్కర్లేదని అంటుంది దీప. సూరజ్‌ని జ్యోత్స్న ఎక్కువ రోజులు ఆఫీస్‌లో ఉండనివ్వదేమోనని భయపడుతుంది దీప. బ్రదర్‌కి ఉన్న టెంపర్‌కి జ్యోత్స్న కరెక్ట్.. అంత తేలికగా వదిలపెట్టడని చెబుతాడు కార్తీక్. మన బ్రాంచ్‌కి రెండు ఆర్డర్లు వచ్చాయని సూరజ్ చెప్పడంతో దీప చాలా సంతోషిస్తుంది. ఇంతలో రెస్టారెంట్‌లో గొడవ జరుగుతున్నట్లు దీపకి ఫోన్ రావడంతో పరుగు పరుగున అక్కడికి వెళ్తుంది దీప. నేను కూడా వస్తానని కార్తీక్ వెళ్తుండగా జ్యోత్స్న ఆపుతుంది. వాళ్ల విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దని అంటుంది. ఆ రెస్టారెంట్ కూడా జ్యోత్స్న రెస్టారెంట్స్‌లో ఒక భాగం.. అక్కడ ఏమైనా జరిగితే మొత్తం జ్యోత్స్న రెస్టారెంట్స్‌కే చెడ్డపేరు వస్తుందని కార్తీక్ చెప్పడంతో నేను కూడా వస్తానని అంటుంది జ్యోత్స్న.

రెస్టారెంట్‌లో ఫుడ్ క్వాలిటీగా లేదని బిర్యానీలో బొద్దింకలు వస్తున్నాయని ఓ కస్టమర్‌.. ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి మరి గొడవ చేస్తాడు. బిర్యానీలో బల్లులు, బొద్దింకలు కనిపిస్తున్నాయంటే కస్టమర్ల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అర్ధమవుతోంది. రేట్లు మాత్రం ఎంతో ఉంటాయి.. కానీ క్వాలిటీ మాత్రం సున్నా అని నానామాటలు అంటాడు ఆ కస్టమర్. ఇలాంటి ఫుడ్ తింటే పోయేది మా ప్రాణాలేనని అంటాడు. మన ఆరోగ్యాలతో ఆడుకునే జ్యోత్స్న రెస్టారెంట్ మూతపడే వరకు మనం ఊరుకోవద్దని అనడంతో బెదిరిస్తున్నావా అంటూ జ్యోత్స్న ఫైర్ అవుతుంది. ఇంతలో శివన్నారాయణ వచ్చి చిన్న పొరపాటుకు ఎందుకింత పంచాయతీ పెడుతున్నారు. అతనిని పక్కకి తీసుకెళ్లి మాట్లాడండి అంటాడు.

ఇది నా ఒక్కడి సమస్య మాత్రమే కాదు.. అందరి సమస్య. బొద్దింక కనిపించింది కాబట్టి దొరికింది, మిగతావాళ్లకు వడ్డించిన బిర్యానీల్లో, కర్రీల్లో ఏమేం పడ్డాయోనని అంటాడు ఆ కస్టమర్. మేం చూడకుండా వడ్డించేవాడు తీసేసి ఉండొచ్చు కదా? దీనిని ఇక్కడితో వదిలిపెట్టనని అంటాడు. ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌కి కంప్లయంట్ చేశానని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంతలో ఫుడ్ సేఫ్టీ వాళ్లు రావడంతో నేను ఆర్డర్ చేసిన ఫుడ్‌లో బొద్దింక పడిందని చెప్పి చూపిస్తాడు. ఇది బిర్యానీలో వచ్చింది అనడానికి వీళ్లంతా సాక్ష్యం. ఇలా కస్టమర్ల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి రెస్టారెంట్స్‌కి లైసెన్స్ రద్దు చేసి సీజ్ చేయమని చెబుతాడు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు.

నేను కొత్తగా ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌గా ఛార్జ్ తీసుకున్నప్పటికీ మీ గురించి నేను విన్నానని శివన్నారాయణతో అంటాడు ఫుడ్ ఇన్స్‌పెక్టర్. మా రెస్టారెంట్స్‌లో అన్నీ బ్రాంచ్‌లలో ఒకే రకమైన క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తామని శివన్నారాయణ చెబుతాడు. అయితే అన్నీ బ్రాంచ్‌లు సీజ్ చేయాల్సిందే అంటాడు కస్టమర్. ఆ మాటలతో పెద్దాయన సీరియస్ అవుతాడు. మీరు చెప్పింది నిజమే కానీ ఇక్కడ జరిగింది మొత్తం సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నారని చెబుతాడు ఫుడ్ ఇన్స్‌పెక్టర్. మనం ఏం చేయలేని పరిస్ధితి వచ్చిందని సూరజ్‌తో చెబుతాడు కార్తీక్. రెస్టారెంట్ క్లోజ్ చేస్తే మన పరువు ఏం కావాలని జ్యోత్స్న సీరియస్ అవుతుంది.

ఫుడ్ ఇన్స్‌పెక్టర్ రెస్టారెంట్‌ని సీజ్ చేయబోతుండగా.. ఈ రెస్టారెంట్‌కి సంబంధించిన పూర్తి బాధ్యత నాదే.. మేం ఆరోగ్యానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీరు ఒకసారి మా కిచెన్ చూడండి, ఎక్స్‌పైర్ అయిన కూరగాయలు, వస్తువులు మేం వాడమని చెప్పి వారిని లోపలికి తీసుకెళ్తుంది. అయితే కస్టమర్ వాలకం తేడాగా ఉంది, నేనొక ప్రయత్నం చేస్తానని వాడి మీద కన్నేసి ఉంచుతానని కార్తీక్‌తో అంటాడు సూరజ్. చేతకాని వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే ఉంటుందని శివన్నారాయణతో అంటుంది జ్యోత్స్న. తినే బిర్యానీలో బొద్దింక వస్తుందని దీప ఏమైనా కలగంటుందా ఏంటీ? అని మండిపడతాడు కార్తీక్. ఈ రెస్టారెంట్‌ని సీజ్ చేస్తే నీ తాత తలని కొట్టేసినట్లేనని బాధపడతాడు పెద్దాయన.

ఆ కస్టమర్ వెనకే వెళ్లిన సూరజ్.. యాక్టింగ్ ఇరగదీస్తున్నావు, లాస్ట్ టైం నేనొక రెస్టారెంట్‌లో గొడవ చేస్తే లక్ష రూపాయలు వచ్చాయని సూరజ్ చెప్పడంతో మరి నాకేంటీ 10 వేలు ఇస్తానని చెప్పిందని ఆ కస్టమర్ చెప్పడంతో సూరజ్‌కి విషయం అర్ధమవుతుంది. నీతో ఆ పనిచేయించింది ఎవరు అని సూరజ్ అడగ్గా.. మనిషినే చూపిస్తానని జ్యోత్స్నని చూపించడంతో సూరజ్ షాక్ అవుతాడు. వాడికి 10 వేలు ఇవ్వడంతో ఆ బొద్దింకని కూడా నేనే వేశాను, డబ్బు కోసం ఏమైనా చేస్తానని చెబుతుండగా ఆ మాటలని సూరజ్ రికార్డ్ చేస్తాడు.

ఈరోజు ఈ రెస్టారెంట్ సీజ్ చేసేవరకు వదిలిపెట్టేది లేదని ఆ కస్టమర్‌ అంటాడు. ఇంతలో ఫుడ్ సేఫ్టీ వాళ్లు వచ్చి కిచెన్ మొత్తం శుభ్రంగానే ఉందని చెబుతారు. మరి ఈ బొద్దింక ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీస్తాడు ఆ కస్టమర్. ఆ బొద్దింక ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెబుతానని సూరజ్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఫుడ్ శాంపిల్స్‌ని ల్యాబ్‌కి పంపిస్తాం.. రిపోర్ట్స్ వచ్చే వరకు రెస్టారెంట్‌ని సీజ్ చేస్తామని ఆఫీసర్లు చెప్పడంతో శివన్నారాయణ సహా అంతా షాక్ అవుతారు. ఆ వెంటనే గొడవ చేసిన కస్టమర్‌ని లాగిపెట్టి కొట్టి వీడియో బయటపెట్టడంతో జ్యోత్స్న ఉలిక్కిపడుతుంది. ఆ వీడియో చూసిన వెంటనే కోపంతో ఊగిపోయిన శివన్నారాయణ .. కస్టమర్‌ చెంప పగలగొడతాడు. నీతో ఆ పని చేయించింది ఎవరు? అని నిలదీస్తాడు. దాంతో జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి. అయితే దీప మాత్రం తప్పు చేసిన వాడికి జనం చేతిలోనే శిక్ష ఉంటుందని చెప్పడంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X