Karthika Deepam 2 June 15th: సూరజ్‌కి శివన్నారాయణ బంపరాఫర్.. జ్యోత్స్నకి దగ్గరవ్వడానికి సూరజ్ కుట్ర
Photo Courtesy: JioHotstar
దీపకి ఓ మెయిల్ రావడంతో దానికి ఎలా రిప్లయ్ ఇవ్వాలో తెలియదు. చదివి వినిపించి, దానికి రిప్లయ్ ఇవ్వమని మేనేజర్‌ని అడుగుతుంది దీప. మళ్లీ మీ తాతగారితో నన్ను కొట్టిస్తారని మేనేజర్ కోపంగా వెళ్లిపోతాడు. ఇదంతా చూసి భార్యకు సాయం చేయాలని కార్తీక్ అనుకున్నా జ్యోత్స్న వెనక్కి లాగేస్తుంది. ఇంతలో కాలికి కట్టుతో ఆఫీస్‌కి వస్తాడు సూరజ్. రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికెందుకు వచ్చావని అడుగుతాడు కార్తీక్. జ్యోత్స్నని, సూరజ్‌ని వదిలేసి కార్తీక్, దీపలు కాఫీ తాగడానికి వెళ్తారు.
జ్యోత్స్న టేబుల్ మీద ఐ లవ్ యూ అని రాసున్న పేపర్ కనపడటంతో ఆమె షాక్ అవుతుంది. వెంటనే వెళ్లి నిలదీస్తుండగా శివన్నారాయణ వస్తాడు.. ఈ సూరజ్ చెత్త పనులన్నీ చేస్తున్నాడని పేపర్ తీసి తాతకి చూపించగా అక్కడ థ్యాంక్యూ అని రాసుంటుంది. నువ్వు ఎక్కడ ఉంటున్నావని పెద్దాయన అడగ్గా.. ఆఫీస్‌కి దగ్గరలో ఇళ్లు చూసుకుంటూ ఉండగా మిమ్మల్ని కాపాడానని చెబుతాడు సూరజ్. కార్తీక్‌కి చెప్పి సూరజ్‌ని ఇంటికి తీసుకురమ్మంటాడు పెద్దాయన. కొన్నాళ్లు సూరజ్ ఇక్కడే ఉంటాడని కుటుంబ సభ్యులకు శివన్నారాయణ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 15వ తేదీ 697వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సూరజ్ ఔట్‌హౌస్‌లో ఉంటాడని శివన్నారాయణ చెప్పగా.. ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు, మీరు నా బాధ్యతను తీసుకోవడం సరికాదని అంటాడు సూరజ్. నేనేమీ నీ బాధ్యతను తీసుకోవడం లేదు, నీకు హెల్ప్ చేస్తున్నాను.. నీకు ఇంతకంటే మంచి రెసిడెన్స్ దొరికితే అక్కడికే వెళ్లిపోవచ్చు అని చెబుతాడు శివన్నారాయణ. నీ పరిస్ధితి చూసి ఛైర్మన్ గారు ఔట్‌హౌస్‌లో ఉండే అవకాశం కల్పిస్తే వద్దు అంటావేంటీ? మితిమీరిన మొహమాటం పనికిరాదని హితవు పలుకుతాడు కార్తీక్. అతనికి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని మండిపడుతుంది పారు. అందరి కేసులు వాదించడం బావకి అలవాటే కదా? అని అంటుంది జ్యోత్స్న.
మా అత్త కూతురిని, మా తాతని కాపాడిన మనిషికి అండగా నిలబడటం నా ధర్మం అనుకుంటాను అంటాడు కార్తీక్. నువ్వు ఔట్‌హౌస్‌లో ఉంటున్నావు అంతే అనడంతో సరేనని ఒప్పుకుంటాడు సూరజ్. దాంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఔట్‌హౌస్‌లో అడుగుపెట్టిన దీప.. కార్తీక్ గాడికి పెళ్లాం అయ్యింది. ఈ సూరజ్ గాడు జ్యోత్స్నకి మొగుడు అవడు కదా అని మనసులో టెన్షన్ పడుతుంది పారు. ఔట్‌హౌస్ తాళాలు ఇవ్వమని పారుని అడుగుతాడు కార్తీక్. బ్యాచిలర్ కదా కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకుంటే సరిపోతుందని చెబుతాడు శివన్నారాయణ. తాళాలు అక్కర్లేదు.. తలుపులు తీసే ఉన్నాయని చెబుతాడు పెద్దాయన. సూరజ్ ఒప్పుకుంటాడని అంత నమ్మకం ఏంటీ? అని అడుగుతుంది పారు.
ఏ పనైనా మనస్పూర్తిగా అనుకుంటే జరుగుతుందని చెప్పి కార్తీక్‌తో సూరజ్‌ని తీసుకెళ్లమని చెబుతాడు శివన్నారాయణ. ఇదంతా బావ ప్లాన్ లాగే ఉందని భయపడుతుంది జ్యోత్స్న. నష్టపరిహరం కోసం వచ్చినవాడు నట్టేట ముంచి వెళ్లిపోయాడు. నువ్వు దారినపోయే కంపలన్నీ తగిలించుకునే రకానివి అని మనవరాలిపై మండిపడుతుంది పారు. రౌడీల్ని పెట్టి కొట్టించావు, అక్కడితో వదిలియొచ్చు కదా అని చెబుతుంది. మాణిక్యం గాడిని తీసుకొచ్చి మనింట్లోనే నన్ను ఓ క్యారెక్టర్ లేని మనిషిలా నిలబెట్టిన వాడిని వదిలేయాలా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. ఆ రౌడీ వెధవలు రివర్స్ అవుతారని నేను అనుకున్నానా? వీలైనంత త్వరగా వాడిని ఇంట్లో నుంచి పంపేయాలి. సూరజ్‌ని దీప ఆఫీస్‌లోకి తీసుకొస్తే.. బావ వాడిని ఇంట్లోకే తీసుకొచ్చాడు.
సూరజ్‌ని కూడా భోజనానికి పిలవమని శివన్నారాయణ చెప్పగా.. అతను మనతో కలిసి భోజనం చేయడం ఏంటీ అని మండిపడుతుంది జ్యోత్స్న. అత్తను కాపాడటం వరకు ఓకే కానీ మా ప్రైవసీ గురించి కూడా ఆలోచించు.. నేనే తీసుకెళ్లి భోజనం ఇస్తానని అంటుంది. రేపటి నుంచి నేను ఇస్తానని చెబుతుంది పారు. నీ టార్చర్‌కి వాడు పారిపోవాలని మనవరాలికి చెబుతుంది పారు. చాలారోజుల తర్వాత తన ఇంట్లో భోజనం చేస్తుండటంతో కాంచన సంబరపడిపోతుంది. అయినా మా ఇంటిని వదిలిపెట్టి రావడానికి దీప చాలా బాధపడింది. మా వదిన దీపకి తల్లి అయినట్లు, మా అన్నయ్య తండ్రి అయినట్లుగా ఉంటుంది, నా పుట్టిల్లు మీద నా కంటే ఎక్కువ ప్రేమ పెంచుకుందని అంటుంది కాంచన.
దీపకి పుట్టిల్లు లేదు కాబట్టి.. అమ్మానాన్న లేరు కాబట్టి, లేని అమ్మానాన్నల్ని అత్తామావయ్యలలోనే చూసుకుంటుంది. వాళ్లు ఉన్న ఇల్లే పుట్టిల్లు అనుకుంటుందని చెబుతాడు కార్తీక్. నాన్న ఫోన్ చేశాడా అని కార్తీక్ అడగ్గా.. నానమ్మకి తాతయ్య ఫోన్ చేయడు, నానమ్మే తాతకి ఫోన్ చేసిందని శౌర్య చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. నీ కూతురు నా పాలిట సీసీ కెమెరాలో తయారైందని సెటైర్లు వేస్తుంది కాంచన. అత్తయ్యకి మావయ్య అంటే చాలా ఇష్టమని కార్తీక్‌తో అంటుంది దీప. సూరజ్‌ని తాత ఔట్‌హౌస్‌లో ఉండమని చెప్పాడని కార్తీక్ చెబుతాడు. జ్యోత్స్న ఉండనిస్తుందా అని దీప అడుగుతుంది.
జ్యోత్స్న ఇంట్లోకి వచ్చి చూస్తే సూరజ్ డ్యాన్స్ చేస్తూ వంట చేసుకుంటూ ఉంటాడు. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. నేను ఇప్పుడు పేషెంట్‌ని కదా? ఆ సంగతే మరిచిపోయానని అంటాడు. కాళ్లు, విరిగిపోవడం, చేతులు విరిగిపోవడం డ్రామానా అని నిలదీస్తుంది జ్యోత్స్న. నిజంగానే కాళ్లు చేతులు విరిగిపోయాయని అంటాడు సూరజ్. ఆ రౌడీలు నీ కాలు విరగ్గొట్టారు కదా అని జ్యోత్స్న ప్రశ్నించగా.. అదంతా డ్రామానేని సూరజ్ షాకిస్తాడు. రౌడీలను నేను కదా పంపించింది.. అది డ్రామా ఎలా అవుతుందని నువ్వు అనుకోవచ్చు. నువ్వు రౌడీలను నన్ను వేసేయమని పంపించావు అది నిజమే. కానీ వాళ్లని నేను ఒక్కటే అడిగాను.. మీకు డబ్బులు కావాలా? నా ప్రాణాలు కావాలా? అని అడిగాను. డబ్బుల కోసమే కదా నేను ప్రాణాలు తీసేదని చెప్పారు. అయితే నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను, నేను చెప్పింది చేయండని అన్నాను. అలా నీ కుక్కల్ని నీ మీదకే ఉసిగొల్పానని అంటాడు సూరజ్.
ఓ కిడ్నాప్ డ్రామాలో ఫైట్ సీన్ డిజైన్ చేశాను.. కానీ పెద్దాయన ఉంటాడని అనుకోలేదని చెబుతాడు సూరజ్. నువ్వు ఇంత మోసగాడివా? నమ్మించి మోసం చేయడం అన్యాయమని మండిపడుతుంది జ్యోత్స్న. మోసాల గురించి, అన్యాయాల గురించి నువ్వు మాట్లాడకూడదు వాటి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. గిఫ్ట్ షాపులో గొడవ పడింది నువ్వు.. రోడ్డు మీద నన్ను అవమానించింది నువ్వు. నా స్టాల్ కూడా కూల్చేసింది నువ్వు. ఆఖరికి నన్ను రౌడీలతో కొట్టించింది కూడా నువ్వే. నొప్పి తగ్గిపోయిన తర్వాత నా అవసరాల కోసం కంటిన్యూ చేశానని చెబుతాడు సూరజ్. నేను ఎవరి జోలికి వెళ్లను, నా జోలికి ఎవరైనా వస్తే వాడిని లైఫ్‌లో వదిలిపెట్టను.
నన్ను మోసం చేశావు, నీకు అవకాశం కల్పించిన దీపని, మా బావని కూడా మోసం చేశావు. ఇన్ని చేశాక మా ఇంట్లో ఎందుకు ఉండాలని అనుకుంటున్నావని అడుగుతుంది జ్యోత్స్న. నేను బయట ఉంటే రౌడీలతో నన్ను కొట్టిస్తావు. నాకు డైలీ ఈ టార్చర్ అవసరమా అందుకే నీ ఇంట్లోనే ఉంటున్నానని అంటాడు సూరజ్. ఇంత చెప్పాకా నిన్ను ఎందుకు వదులుతాను, మా ఇంట్లో వాళ్లకి నీ గురించి నిజం చెప్పి బయటికి గెంటిస్తాను, నీ మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తానని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నిన్ను దీపే కాదు.. ఆ దేవుడు కూడా కాపాడలేడని అంటుంది. దాంతో జ్యోత్స్న పంపిన రౌడీల చేత నిజం చెప్పించిన వీడియోని ఆమెకు చూపించి బ్లాక్‌మెయిల్ చేస్తాడు సూరజ్. నువ్వు నా గురించి చెబితే నీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, కంపెనీ గ్రూప్‌లో షేర్ చేస్తానని సూరజ్ అనడంతో జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications