Karthika Deepam 2 June 16th: సూరజ్ చాణక్యం.. దీప రెస్టారెంట్‌కి భారీ ఆర్డర్, సూరజ్ చేతిలో జ్యోత్స్న లాక్

Photo Courtesy: JioHotstar

సూరజ్ ఔట్‌హౌస్‌లో ఉంటాడని శివన్నారాయణ చెప్పడంతో నా బాధ్యతను మీరు తీసుకోవడం నాకు నచ్చలేదని అంటాడు సూరజ్. నీకు నచ్చిన రెసిడెన్స్ నచ్చిన రోజున వెళ్లిపోవచ్చని శివన్నారాయణ, కార్తీక్ బలవంతం పెట్టడంతో సూరజ్ సరేనని అంటాడు. ఔట్‌హౌస్‌లో అడుగుపెట్టిన దీప.. కార్తీక్ గాడికి భార్య అయ్యింది. ఇప్పుడు ఈ సూరజ్ గాడు.. జ్యోత్స్నకి మొగుడు అవుతాడేమోనని పారు టెన్షన్ పడుతుంది. రూమ్ తాళాలు ఇవ్వమంటే ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. అయితే తాను అన్ని ఏర్పాట్లు చేశానని చెబుతాడు శివన్నారాయణ.

ఎలాగైనా ఆ సూరజ్ గాడిని ఇంట్లోంచి గెంటేయాలని పారుతో అంటుంది జ్యోత్స్న. దారికిపోయే కంపని ఇక్కడి వరకు తీసుకొచ్చింది నువ్వేనని క్లాస్ పీకుతుంది పారు. అందరూ భోజనం చేస్తుండగా.. సూరజ్‌ని కూడా పిలవమని చెబుతాడు పెద్దాయన. అతను మనతో పాటు భోజనం చేయడానికి మేం ఒప్పుకోమని పారు, జ్యోత్స్న చెప్పడంతో జ్యోత్స్నే వెళ్లి క్యారియర్ ఇవ్వడానికి వెళ్తుంది. లోపలికి వెళ్లేసరికి సూరజ్ డ్యాన్స్‌లు చేస్తుండటంతో షాక్ అవుతుంది. ఇదంతా నా ప్లాన్ .. ఈ ఇంట్లోకి రావడానికే ఇలా చేశానని సూరజ్ అనడంతో ఇప్పుడే ఇంట్లో వాళ్లందరికీ నిజం చెబుతానని అంటుంది జ్యోత్స్న. అయితే జ్యోత్స్న తన మీదకి పంపిన రౌడీ చెప్పిన మాటల్ని వీడియో తీసి సూరజ్ వినిపించడంతో ఆమె షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 16వ తేదీ 698వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 698 June 16th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

నా గురించి బయటపెడితే.. నేను ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మన కంపెనీ గ్రూప్‌లో షేర్ చేస్తానని సూరజ్ బ్లాక్ మెయిల్ చేయడంతో జ్యోత్స్న వణికిపోతుంది. అలాగే నన్ను రౌడీలను పెట్టించి చంపబోయావని పోలీస్ కేసు పెడతానని వార్నింగ్ ఇస్తాడు. ఇద్దరం జైలుకి వెళ్దాం.. అక్కడ కూడా సరదాగా చెరో సెల్‌లో కూర్చొని కబుర్లు చెప్పుకుందామని సెటైర్లు వేస్తాడు. నేనేంటీ వీడి దగ్గర ఇలా ఇరుక్కుపోయాను, సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయానే ఇప్పుడు ఏం చేయలేడు అనుకుంటున్నావు కదా? కుర్రాడు చాలా స్మార్ట్‌గా ఉన్నాడు.. ఆఫీస్‌లో ఐ లవ్ యూ చెప్పాడు, వీడితో నేను లవ్‌లో పడిపోతానేమో అనుకుంటున్నావు కదా అంటాడు సూరజ్.

నీతో నేను లవ్‌లో పడతానా అని మండిపడుతుంది జ్యోత్స్న. ఆఫీసులో పెద్దాయన పెళ్లి గురించి అడిగాడు కదా? అప్పుడు ఒక మాట చెప్పాలని అనుకున్నాను.. లక్షణంగా, పద్ధతిగా ఉండాల్సిన పిల్ల నాకు అక్కర్లేదు. నాకు కాబోయే పెళ్లానికి పొగరుండాలి, బలుపుండాలి, దానికి కాస్త తిక్క ఉండాలి, ఎవరి మాట వినకూడదు, నన్ను అసలు లెక్క చేయకూడదు.. మీ మనవరాలి లాగా ఉంటే సరిపోతుందని చెబుదామని అనుకున్నానని అంటాడు సూరజ్. చెబితే నిన్ను అక్కడు షూట్ చేసి పారేసేవాడని అంటుంది జ్యోత్స్న. శివన్నారాయణ గారి మనవరాలికి పెళ్లి చేయరా? నా లాంటి కుర్రాడు మొగుడిగా రాడా అని ప్రశ్నిస్తాడు సూరజ్.

వీడియోని అడ్డుపెట్టుకుని ఎక్స్‌ట్రాలు చేయొద్దు.. నువ్వు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావో అర్ధమవుతోందని అంటుంది జ్యోత్స్న. నీలాంటి తిక్కదానికి నాలాంటి తిక్కలోడే కరెక్ట్ అంటాడు. నన్ను నువ్వు చూసింది శాంపిల్ మాత్రమే.. నా ఒరిజినాలిటీ తట్టుకోలేవని, నీకు చుక్కలు చూపిస్తానని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నువ్వేంటో నాకు తెలిసింది కదా? నిన్నేం చేయాలో నేను చూసుకుంటానని చెబుతుంది. నువ్వు ఆకలితో చస్తావని మా తాత క్యారియర్ పంపించాడని అంటుంది. వంట నువ్వే చేశావా అని సూరజ్ అడగ్గా.. నేను చేసింది తింటే నిజంగానే చస్తావని చెబుతుంది జ్యోత్స్న. ఆరోజు కోసమే వెయిట్ చేస్తుంటానని అంటాడు సూరజ్.

ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్లేందుకు వచ్చిన జ్యోత్స్నని చూసి రాత్రంతా నిద్రపోలేదా అని అడుగుతాడు కార్తీక్. నిద్రపోలేదా అని కార్తీక్ అడగ్గా దీనినే ఔట్‌హౌస్ ఎఫెక్ట్ అంటారని సెటైర్లు వేస్తాడు. అందరూ ఆఫీసుకి వెళ్తుండగా సూరజ్ గేటు బయట వెయిట్ చేస్తుండటంతో అతనిని కూడా కారు ఎక్కమంటాడు శివన్నారాయణ. దానికి నేను ఒప్పుకోనని జ్యోత్స్న అంటుంది. నిన్ను కాపాడాల్సిన మనిషి మీద నీకుండాల్సిన గ్రాటిట్యూడ్ నీకు లేకపోయినా సంస్థలో పనిచేసేవాళ్లు మన మనుషులేనన్న గ్రాటిట్యూడ్ నీకుండాలి కదా అని మండిపడతాడు శివన్నారాయణ. దాంతో జ్యోత్స్నని కారు దించేసి సూరజ్‌ని సేఫ్‌గా ఆఫీస్‌కి రమ్మని పనిష్మెంట్ ఇస్తాడు. అయితే నేను ఇంట్లోకి వెళ్లిపోతానని జ్యోత్స్న చెప్పగా.. ఇక రేపటి నుంచి ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేదని పెద్దాయన చెప్పడంతో జ్యోత్స్న చచ్చినట్లు ఒప్పుకుంటుంది.

నీ గురించి తెలియక అందరూ జాలి పడుతున్నారు.. కానీ తెలిస్తే కర్ర విరిగే వరకు కొడతారని సూరజ్‌కి వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నేనైతే ఆటోలో రానని జ్యోత్స్న చెప్పడంతో వస్తే రా, లేకపోతే లేదంటూ వెళ్లిపోతుండగా జ్యోత్స్న చచ్చినట్లుగా ఎక్కుతుంది. తాతని అడ్డుపెట్టుకుని నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా అంటూ మండిపడుతుంది. ఆటోలో సూరజ్ మీద పడటంతో అతని చేతికర్రని విసిరేస్తుంది. నీ సంగతి ఆఫీస్ దగ్గర చెబుతానని అంటాడు సూరజ్. మరోవైపు.. తాత చాలా మంచి పని చేశాడని దీప, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉండగా.. సూరజ్‌ని చేత్తో పట్టుకుని ఆఫీస్‌కి తీసుకొస్తున్న జ్యోత్స్నని చూసి ఇద్దరూ షాక్ అవుతారు.

నా లైఫ్‌లో నేను చూడలేను అనుకున్న అద్భుతాన్ని నేను చూశాను. సూరజ్ చేతిని తన భుజాన వేసుకుని తనే ఒక ఊతం అయ్యింది, తనే నేస్తమైంది. నీ చేతి కర్ర ఏమైందని అడుగుతాడు కార్తీక్. ఆటోలో వస్తుంటే ఓ కుక్క దానిని లాక్కుపోయింది, దాంతో జ్యోత్స్న గారే నన్ను సేఫ్‌గా ఆఫీస్‌లోకి తీసుకొచ్చారని చెబుతాడు సూరజ్. మన మీద ఆవిడ చూపు పడటం ఒక వరం, ఆవిడ చేయి పడటం పూర్వ జన్మ సుకృతమని సెటైర్లు వేస్తాడు కార్తీక్. నన్ను రౌండప్ చేయాలని ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తున్నారా అని మండిపడుతుంది జ్యోత్స్న. ఆఫీస్‌లో వర్క్ చేస్తూ జ్యోత్స్నని అదే పనిగా చూస్తుంటాడు సూరజ్.

ఇంతలో ఓ ఫుడ్ ఆర్డర్ కోసం ఓ పార్టీ వస్తుంది. మా అమ్మాయి ఓణీల ఫంక్షన్ చేస్తున్నామని, మీ రెస్టారెంట్‌లో ఫుడ్ బాగుంటుందని తెలిసింది. అందుకే 1000 మందికి భోజనాలు ఆర్డర్ చేద్దామని వచ్చానని చెబుతాడు. అది చూసిన జ్యోత్స్న.. మన స్థాయికి తగ్గ ఆర్డర్సే మనకి వస్తాయి, కానీ కొంతమందికి ఏ ఆర్డర్ రాక ఊరికే ఈగలు తోలుకుంటూ ఉంటారని సెటైర్లు వేస్తుంది. మీ లాంటి వాళ్ల కోసమే స్పెషల్ థాళి రెడీ చేశామని చెబుతుంది. అయితే ప్లేట్ 3000 అవుతుందని దానిలో సగం అడ్వాన్స్ 15 లక్షలు ఇవ్వాలని జ్యోత్స్న చెప్పడంతో కస్టమర్ ఖంగు తింటాడు. అయితే ప్లేట్ 2000 అయితేనే తీసుకుంటాను లేకపోతే లేదని కస్టమర్ బేరం ఆడతాడు. 3000కు ఒక్క రూపాయి తగ్గినా ఒప్పుకోనని మీరు బయల్దేరమని జ్యోత్స్న చెప్పడంతో కస్టమర్ రగిలిపోతాడు. వ్యాపారం చేసే పద్ధతి ఇది కాదు.. ఇక వేరే రెస్టారెంట్స్ లేవా? ఏంటీ అని మండిపడతాడు.

మీరు ఎక్కడికి వెళ్లినా తిరిగి మా దగ్గరికే వస్తారని జ్యోత్స్న చెబుతుంది. ఆ కస్టమర్‌ని దీప పిలిచి మీరు అడిగిన రేటుకి, మీరు అడిగిన క్వాలిటీ ఫుడ్ నేను సప్లయ్ చేస్తానని చెబుతుంది. అతను నా క్లయింట్ అని జ్యోత్స్న ఫైర్ అవుతుంది. మీరు సప్లయ్ చేసి రెస్టారెంట్ పరువు తీస్తారని అంటుంది. మీ ఇద్దరిది ఒకటే రెస్టారెంట్ కదా అని కస్టమర్ అడగ్గా.. ఇదంతా ఒకటే గ్రూప్. కానీ మా బ్రాంచ్ వేరని చెబుతాడు సూరజ్. నాకు ఏ ఇబ్బంది లేదని 10 లక్షల రూపాయల చెక్ రాశానని ఇస్తాడు. దానిని తీసుకున్న దీప చాలా సంతోషిస్తూ.. ఎప్పటికీ ఫుడ్ కావాలని అడగ్గా రేపటికేనని ఆన్సర్ ఇస్తాడు కస్టమర్. దాంతో దీప షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X