Karthika Deepam 2 June 29th: సూరజ్ గదిలోకి అమ్మాయి, పారు దారుణమైన కుట్ర.. సూరజ్‌ని కాపాడిన కార్తీక్
Photo Courtesy: JioHotstar
శివన్నారాయణ తీర్పు మేరకు పనిమనిషి గెటప్‌లో వచ్చిన పారును చూసి కార్తీక్, దీప, జ్యోత్స్నలు షాక్ అవుతారు. పారు పగలంతా బయటే ఉండి.. రాత్రవ్వగానే తన రూమ్‌లోకి వెళ్తుందని కార్తీక్ చెప్పడంతో ఆ రూమ్‌కి సీలు వేస్తాడు శివన్నారాయణ. మళ్లీ మీ తాత లోపలికి రానిచ్చే వరకు ఈ కొప్పు ముడి వేసుకోనని శపథం చేస్తుంది పారు. దీప సీఈవో అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని, కానీ నిన్ను ఆ జ్యోత్స్న ప్రశాంతంగా పనిచేసుకోవనివ్వదని అంటుంది కాంచన.
జ్యోత్స్న రెస్టారెంట్‌కి సీఈవోలంతా మన ఆఫీస్ నుంచే అవుతున్నారని చెబుతుండగా శౌర్య వచ్చి నేను కూడా అవుతానని చెబుతుంది. కూతురి ప్రవర్తనపై అనుమానం వచ్చిన సుమిత్ర... జ్యోత్స్న తప్పు చేస్తే అస్సలు క్షమించొద్దని శివన్నారాయణకి చెబుతుంది. ఈ మాటలన్నీ విన్న జ్యోత్స్న టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తుంది. సూరజ్ ఉన్నంత వరకు దీపని ఏం చేయలేమని, వాడిని మీ తాత చేత్తోనే బయటికి గెంటిస్తానని జ్యోత్స్న అంటుంది పారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 29వ తేదీ 709వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దీపకి చీరలు, నగలు చేయించి గిఫ్ట్‌గా ఇస్తుంది కాంచన. ఇన్నిరోజులు నువ్వు ఎలాంటి గుర్తింపు లేని సాధారణ మనిషివి, కానీ ఇప్పుడు నా పుట్టింటి గౌరవానికి ప్రతినిధివి అలా పసుపు తాడుతో వెళితే బాగోదు అని చెబుతుంది కాంచన. ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడివి అని దీప అడగ్గా.. మీ మావయ్య ఇచ్చారని చెబుతుంది కాంచన. ఆ మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. మీ అవసరాల కోసమని మీ మావయ్య నాకు కొంత డబ్బు ఇచ్చారు.. నేను వద్దు అన్నాను, దీని అవసరం ఏదో ఒకరోజు వస్తుంది, అప్పుడు ఉపయోగపడుతుందని అన్నాను. నువ్వు ఆయనకు కోడలివే కదా? నీ కోసం మీ మావయ్యగారు డబ్బు ఖర్చు పెట్టడం తప్పేం కాదు. ఆయన సర్జరీ చేయించుకోవడానికి ఫారిన్ వెళ్లినా మనసంతా మనతోనే ఉంటుంది. జరిగినదంతా చెప్పాను, చాలా సంతోషించారు.. మీ మావయ్యగారు నీకిస్తున్న కానుకలు అనుకోమని కోడలికి ఇస్తుంది దీప. అవి చూసి దీప చాలా సంతోషిస్తుంది.
ఇంతలో శౌర్య వచ్చి అన్నీ అమ్మకేనా? నాకేం లేవా? అని అడుగుతుంది. నాకు సైకిల్ కావాలని అని చెప్పగా కొనిస్తానని చెబుతుంది కాంచన. నన్ను పడుకోమని చెప్పి రాత్రి తాతతో ఫోన్ మాట్లాడావని కాంచనని ఇరికిస్తుంది శౌర్య. ఈరోజు నుంచి నీ కూతురు నీ దగ్గరే పడుకుంటుందని కాంచన చెప్పడంతో నేను నీ దగ్గరే పడుకుంటానని అంటుంది శౌర్య. పాపతో కాంచనకు సారీ చెప్పిస్తాడు కార్తీక్. భర్త చేతుల మీదుగా బంగారు తాళి బొట్టును వేయించుకుని మురిసిపోతుంది దీప.
సూరజ్‌ను ఇరికించడానికి ఒక అమ్మాయిని పిలిపిస్తుంది పారిజాతం. ఇంత ధైర్యంగా పిలిచారు, యజమానులెవరూ చూడరా? ఆ కుర్రాడు నన్నేం చేయడు కదా అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఆ విషయంలో వాడు చాలా మంచోడని అంటుంది పారు. నేను ఇంటికి పనిమనిషిలా కనిపిస్తున్నానా అని మండిపడుతుంది. మీ కట్టుబొట్టు చూస్తే అలాగే ఉంది, మీరు యజమానా అని సెటైర్లు వేస్తుంది ఆ అమ్మాయి. పేమెంట్ త్వరగా ఇస్తారా అని అంటుంది. నువ్వు వెళ్లి వీరంగా చేయ్.. నేను వెళ్లి విధ్వంసం చేస్తానని చెబుతుంది పారు. నువ్వు పర్ఫర్మెన్స్ ఇరగదీయమని చెబుతుంది. ఆ గదిలో ఒకడుంటాడు, నేను వాడి లవర్‌ని, నేను వెళ్లి వాడిని వాటేసుకోవాలి... మీరొచ్చి రచ్చ చేస్తారు అంతేకదా? యజమానులు గట్టిగా అడిగితే ఏం చెప్పాలని ప్రశ్నిస్తుంది ఆ అమ్మాయి. నేనే ఆ యజమానిని అని తలబాదుకుంటుంది పారు. మీ అందరి భరతం పట్టే టైం వచ్చింది.. నీతో మొదలుపెట్టి ఆ దీపతో ముగిస్తానని అనుకుంటుంది పారు.
తన గదిలోకి అమ్మాయి రావడంతో ఎవరు నువ్వు అని అడుగుతాడు సూరజ్. భోజనం తీసుకొచ్చాను తిందువుగానీ రమ్మని పిలుస్తుంది ఆ అమ్మాయి. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పారు వచ్చి డోర్ లాక్ చేస్తుంది. అమ్మాయితో ఉన్న నిన్ను శివన్నారాయణ గారు చూస్తే నీకు చావు డప్పేనని అంటుంది పారు. నువ్వు ఎవరు? ఎందుకొచ్చారు? ఎవరు పంపించారో చెప్పమని ఆ అమ్మాయి మీద మండిపడతాడు సూరజ్. సరసానికి పరిచయాలు అక్కర్లేదు, ఆకలి తీర్చుకో మామ అంటే అరుస్తావేంటీ అని చెబుతుంది ఆ అమ్మాయి. ఎవరైనా ఆర్డర్ చేస్తే ఫుడ్ వస్తుంది, ఇక్కడ ఫుడ్‌తో పాటు పిల్ల కూడా వచ్చింది, ఫ్రీ గిఫ్ట్ అనుకోమని అంటుంది. నువ్వు లోపలికి రావడం ఏంటీ? బయట ఎవరో డోర్ క్లోజ్ చేయడం ఏంటీ? అసలు ఇక్కడ ఏం జరుగుతుందని ప్రశ్నిస్తాడు సూరజ్.
ఇంతలో పారు వెళ్లి ఇంటిలోకి శోకండాలు పెడుతూ అందరినీ పిలుస్తుంది. శివన్నారాయణ గారి పరువు భ్రష్టు పట్టించడానికి అల్లరిమూక తయారైంది. నా నోటితో నేను చెప్పలేను మీరే చూడండి అంటూ శివన్నారాయణ, సుమిత్ర, దశరథ, జ్యోత్స్నలను సూరజ్ గదివైపు తీసుకెళ్తుంది పారు. లోపలికి వెళ్లి చూసేసరికి సూరజ్ గదిలో అమ్మాయి కనిపించడంతో అంతా షాక్ అవుతారు. వాడి మీద పడి అరాచకం చేస్తుదనుకుంటే, చీపురుకట్ట పట్టుకుని సేవలు చేస్తోందని అనుకుంటుంది పారు. సూరజ్‌గాడు బుద్ధిమంతుడు, పద్ధతి కలవాడు అనుకుని ఉండటానికి చోటిస్తే మన కళ్లుకప్పి అమ్మాయిని తెచ్చిపెట్టుకున్నాడని పారు అనడంతో అంతా షాక్ అవుతారు. ఎవరినైనా తీసుకొచ్చే ముందు అన్నీ తెలుసుకోవాలని అంటుంది. అసలు శివన్నారాయణ గారంటే నిప్పు, ఇలా అర్ధరాత్రి నీ గదిలో పిలవడం చుట్టుపక్కల వాళ్లు చూస్తే ఏమనుకుంటారు? ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది, ఇలాంటి పోకిరిలను పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, నమ్మించి మోసం చేశావని ఫైర్ అవుతుంది పారు.
ఎవరు ఆ అమ్మాయి అని శివన్నారాయణ అడుగుతాడు. నీలాంటి దైవభక్తులు ఈ సూరజ్ గాడి లాంటి పాపిని కళ్లతో చూసినా పాపం తగులుతుంది, వెంటనే జ్యోత్స్నని తీసుకుని లోపలికి వెళ్లిపోమ్మని సుమిత్రకి చెబుతుంది. సూరజ్‌ని ఇంట్లో నుంచి గెంటేయమని అంటుంది పారు. భలే ఇరుక్కున్నావని మనసులో సంబరపడుతుంది జ్యోత్స్న. సూరజ్ అమాయకుడు కాదు, అమ్మాయిల నాయకుడు అని ఇప్పటికైనా అర్ధం చేసుకోండి. ఇంతలో కార్తీక్, దీపలు ఆ గదిలో నుంచి బయటకు రావడంతో అంతా షాక్ అవుతారు. ఇక్కడేం జరుగుతుందని కార్తీక్ అడగ్గా.. ఆ అమ్మాయి సూరజ్‌కి లవర్ అంట.. ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చాడని అంటుంది జ్యోత్స్న. అయితే వెళ్లి ఓ పసుపు తాడు తీసుకొస్తే పెళ్లి చేసేద్దామని అంటాడు కార్తీక్. ఆ మాటలు విన్న అమ్మాయి షాక్ అవుతుంది. ఈ అమ్మాయి పనిమనిషి, మా వీధిలోనే ఉంటుంది.. పేరు బుజ్జి అని దీప చెప్పడంతో పారు ఉలిక్కిపడుతుంది.
సూరజ్ ఔట్‌హౌస్ శుభ్రంగా లేదని మా బావ చెబితే నేను ఈ బుజ్జమ్మతో చెప్పానని అంటుంది దీప. అయితే అంతకముందే దీప వార్నింగ్ ఇవ్వడంతో బుజ్జమ్మ అన్నింటికి ఔనని చెబుతుంది. అయినా మీరెందుకు తీసుకొచ్చారని పారు ప్రశ్నిస్తుంది. నా భార్య గెలుపుకోసం అహర్నిశలు కష్టపడ్డ సూరజ్ లాంటి బ్రదర్ కోసం ఈ మాత్రం కూడా చేయలేనా? బ్రదర్‌కి ఇంటి దగ్గరి నుంచి కారియర్ తీసుకొచ్చానని కార్తీక్ చెప్పడంతో పారు షాక్ అవుతుంది. లోపల సూరజ్, కార్తీక్, దీపలు ఉన్నారు.. నీకంటికి ఆ అమ్మాయి మాత్రమే కనిపించిందా? అని పారుపై దశరథ మండిపడతాడు. నువ్వు అన్నేసి మాటలు అన్నావు, ఆ అమ్మాయి కానీ, సూరజ్ కానీ ఒక్కమాట అనలేదు.. వాళ్లకున్న సంస్కారం కూడా నీకు లేదు, కళ్లతో చూసినవన్నీ నిజాలు కాదు. సూరజ్ మంచివాడని నాకు తెలుసు అంటాడు శివన్నారాయణ.
కార్తీక్ గాడిని ఇంటికి పంపేయకపోతే నా గుట్టు బయటపెడతాడు, అప్పుడు ముసలోడు నా తాట తీస్తాడని భయపడుతుంది పారు. నువ్వు బయట గడి ఎందుకు పెట్టావని ప్రశ్నిస్తాడు కార్తీక్. పెద్దవాళ్లం కదా మా భయాలు మాకుంటాయని అంటుంది పారు. నీ పెద్దరికం పిల్లల ముందు తలదించుకునేలా ఉందని శివన్నారాయణ ఫైర్ అవుతాడు. తప్పు జరిగిందని ఏం అనుకోవద్దని సూరజ్‌తో అంటాడు శివన్నారాయణ. నేనే ముందు మీతో ఒక మాట చెప్పాల్సిందని సూరజ్ అనడంతో అతనిని పెద్దాయన మెచ్చుకుంటాడు. నువ్వు కూడా సారీ చెప్పమని శివన్నారాయణ మండిపడటంతో సూరజ్‌కు సారీ చెబుతుంది పారు. లోపలికి వెళ్తున్న పారుని పిలిచి ఆ అమ్మాయి పేరు బుజ్జి కాదు గీత. ఆవిడ పనిమనిషి కాదు డబ్బుల కోసం మనసు అమ్ముకునే మనిషి. నీ మాటలు విని లోపలికి వెళ్లింది, మా మాటలు విని పారిపోయింది. నీకు తెలియని మరో సంగతి ఏంటంటే.. ఔట్‌హౌస్‌కి తాళం కప్ప కొన్నదే నేనని కార్తీక్ చెప్పడంతో పారు షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications