Karthika Deepam 2 July 7th: జ్యోత్స్నను పక్కనపెడతున్న శివన్నారాయణ.. దక్షిణామూర్తిపై కార్తీక్ నిఘా
Photo Courtesy: JioHotstar
కార్తీక్, దీపలు చాలా వర్క్ ఇవ్వడంతో ఆఫీస్‌లో పొద్దుపోయే వరకు కష్టపడుతుంది జ్యోత్స్న. సూరజ్ ఇంటికి వెళ్లబోతుండగా నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అని బ్రతిమలాడుతుంది. దాంతో జాలిపడి సూరజ్ హెల్ప్ చేస్తుండటంతో జ్యోత్స్న ఫోన్‌లో గేమ్ ఆడుకుంటూ ఉండటంతో అది చూసి అతను రగిలిపోతాడు. జ్యోత్స్నకు బుద్ధి చెప్పడానికి ఫైల్స్‌లో తప్పులు చేస్తాడు. ఉదయాన్నే ఫైల్స్ చూసిన శివన్నారాయణ కోపంతో జ్యోత్స్నని తిడతాడు. మాజీ సీఈవోకి బ్రాంచ్ కోడ్ తెలియదా అంటూ మండిపడతాడు. పారుని కాఫీ తీసుకురమ్మని చెప్పి దానిని దీపకి ఇవ్వమని చెబుతాడు.
ఇంతలో రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్లు రావడంతో అందరికీ దీప, కార్తీక్‌లను పరిచయం చేసి జ్యోత్స్నను పక్కనపెడతాడు శివన్నారాయణ. సిటీలో ఉన్న రెస్టారెంట్స్ అన్నింటికి ఈసారి కూడా పోటీ పెట్టి బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ ఇస్తున్నట్లు చెబుతారు. ఈసారి మన అసోసియేషన్‌లో కొత్తగా ఒకరు చేరారని దక్షిణామూర్తిని పిలవడంతో శివన్నారాయణ, కార్తీక్‌లు షాక్ అవుతారు. దక్షిణాది వంటలకు సంబంధించి నా దగ్గర చేయి తిరిగిన షెఫ్‌లు ఉన్నారు, ఈసారి నా హోటల్స్ నుంచి మీకు కాంపిటీషన్ తప్పదని వార్నింగ్ ఇస్తాడు. అందరినీ పంపించేసి సూరజ్‌ని పిలిపించిన శివన్నారాయణ.. దక్షిణామూర్తి ముందే లాగిపెట్టి కొడతాడు. దాంతో కార్తీక్, జ్యోత్స్న, దీప, సుమిత్రలు షాక్ అవుతారు. నేను దక్షిణామూర్తి గారి మనిషినని ఛైర్మన్ గారి అనుమానం.. దానిని తీర్చుకోవడానికే నన్ను కొట్టారని సూరజ్ అనడంతో శివన్నారాయణ మెచ్చుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 7వ తేదీ 716వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సూరజ్ మీద నాకు కూడా అనుమానంగా ఉందని దీపతో అంటాడు కార్తీక్. దక్షిణామూర్తి తాతతో వాడు మాట్లాడుతున్నాడంటే ఎంతో కొంత అనుమానం రావడం సహజం. తాత పెట్టిన పరీక్షలు కఠినంగానే ఉంటాయి. సొంత కూతురికి, మనవడికే తప్పలేదు, బయటివాళ్ల విషయంలో జాలి చూపిస్తాడా అని చెబుతాడు. తాత కొట్టినా నీకు సూరజ్ మీద అనుమానం పోలేదా? అని దీప ప్రశ్నిస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఈ ఇంటి తిండి తిన్న జ్యోత్స్నే ద్రోహం చేయడానికి వెనుకాడలేదు, మనకి ఏమీ తెలియని బయటివాళ్లని అంత తేలిగ్గా నమ్మలేనని చెబుతాడు కార్తీక్. మనలో మనం ఇలా గొడవలు పడాలని దక్షిణామూర్తి తాత ఇలా చేస్తున్నాడని అనుమానిస్తుంది దీప.
గొడవలు పెట్టడం ఏంటీ? అగ్గిపుల్ల గీసి తగలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. మన రెస్టారెంట్స్ ఎదురుగానే రెస్టారెంట్స్ ఓపెన్ చేశారు, ఇప్పుడు పోటీకి దిగాడు. దక్షిణామూర్తి తాతతో పోటీ అంటే బురదలో రాయి వేసినట్లుగా ఫీల్ అవుతాడు. నలుగురు ఉన్నారు కాబట్టి సరిపోయింది కానీ, అదే ఒంటరిగా వచ్చుంటే ఇద్దరూ కాలర్లు పట్టుకునేవారు అంటాడు కార్తీక్. ఇక్కడ ఇంత జరుగుతుంటే నాన్న ఎక్కడికి వెళ్లారని దీప అడగ్గా.. రెస్టారెంట్స్ ఓనర్లంతా ఒక టూర్‌కి వెళ్లారు, అందులో మావయ్య కూడా వెళ్లాడని చెబుతాడు కార్తీక్. ఇక్కడ అమ్మ పరిస్ధితి బాలేదు.. నన్ను పెంచిన కుబేర్ మీదే నాకు ఇంత ప్రేముంటే కన్నవాళ్ల మీద కూతురికి ఇంకెంత ప్రేమ ఉండాలి. అంత ప్రేమను కూడా దూరం చేసేంత ద్వేషం ఉందంటే ఏ స్థాయిలో గాయపడిందోనని బాధపడుతుంది దీప.
మా అమ్మని ఓదార్చడానికి నాకు వీలు లేకుండా పోయింది, నాకున్న అధికారం కేవలం కార్తీక్ భార్యని మాత్రమే. ఇప్పటి వరకు నువ్వు అనుకున్నవన్నీ సాధించావు, ఏదో ఒకరోజు ఈ ఇంటికి వారసురాలివి అన్న నిజం కూడా తెలుస్తుందని అంటాడు కార్తీక్. తాత కొట్టిన దానికి సూరజ్ బాధపడుతున్నాడో లేక పాజిటివ్‌గా తీసుకున్నాడో అర్ధం కావడం లేదని చెబుతాడు. సూరజ్ ఆఫీస్‌కి వెళ్తుంటే జ్యోత్స్న వచ్చి బ్యాగ్ సర్దుకుని, క్యాబ్ బుక్ చేసుకోమ్మని చెబుతుంది. ఇంత జరిగిన తర్వాత మళ్లీ ఎదురుపడలేము కాబట్టి నువ్వు చెప్పకుండా వెళ్లిపోయినా పర్లేదని అంటుంది. ఎక్కడికి? ఎందుకు అని సూరజ్ ప్రశ్నిస్తాడు.
మా తాత నిన్ను కొట్టినప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోలేదా? మా తాత నిన్ను అవమానించాక నువ్వు మా ముందు తలెత్తుకుని తిరగ్గలవా? నీకు సెండాఫ్ ఇవ్వడానికి నేనొచ్చాను. లగేజ్ తీసుకుని వెళ్లిపో అంటుంది జ్యోత్స్న. నిన్ను అంత అవమానిస్తే కోపం రావడం లేదా? అని మండిపడుతుంది. అక్కడే నేను అందరికీ క్లారిటీ ఇచ్చేశానని చెబుతాడు. మా తాత నిన్ను కొట్టాడు, దక్షిణామూర్తికి అమ్ముడపోయావని అన్నాడు, నీకు బాధ అనిపించడం లేదా? మా ముందు నటిస్తున్నావా అని మండిపడుతుంది జ్యోత్స్న. నన్ను కొనేంత ఖలేజా ఇక్కడ ఎవ్వరికీ లేదు.. ఒకవేళ ఉన్నా అమ్ముడుపోవడానికి నేను సిద్ధంగా లేను, నేను తలవంచింది అభిమానానికి, నేను దిగివచ్చింది మంచితనానికి అంటాడు సూరజ్.
నమ్మకం ఉన్నచోటే అభిమానం ఉంటుంది, టాలెంట్ ఉంటే పనిస్తారు, క్యారెక్టర్ ఉంటేనే ఇంటికి రానిస్తారు.. నన్ను ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నారు. నమ్మకం ఉంది కాబట్టే ఛైర్మన్ గారికి అనుమానం వచ్చింది? అందుకే దక్షిణామూర్తి మీద కోపంతో కొట్టారు అని అంటాడు సూరజ్. మా తాతని ఇంత అర్ధం చేసుకున్న వాడివి, నన్నెందుకు అర్ధం చేసుకోవడం లేదని మండిపడుతుంది జ్యోత్స్న. నిన్ను అర్ధం చేసుకోవడమే కాదు, అర్ధాంగిని కూడా చేసుకోవాలని అనుకుంటున్నాని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. నువ్వు సరేనంటే మనం పెళ్లి చేసుకుందామని అంటాడు. నన్ను అందుకునే ఛాన్స్ నీకు ఇవ్వను, నాలాంటి దాని మీద ఆశపడితే నువ్వు మాత్రం బ్రహ్మచారిగానే మిగిలిపోతావు, నాలాంటి ఏంజెల్‌ని అందుకోవాలంటే నా అంత స్థాయి ఉండాలని చెబుతుంది జ్యోత్స్న.
మీరంత ప్లాట్‌ఫాం బ్యాచ్.. నీ స్థాయికి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఏ అరటిపళ్లు అమ్ముకునే అమ్మాయినో.. ఏ ఇడ్లీ బండి పెట్టుకునే అమ్మాయినో పెళ్లి చేసుకోమని అంటుంది. నీ వెనుక నీ తాత సంపాదించిన ఆస్తి ఉంది, నువ్వు శివన్నారాయణ గారి మనవరాలివి.. ఇవన్నీ తీసి పక్కనపెడితే నీ స్థాయి కూడా రోడ్డు మీదే అంటాడు సూరజ్. నీ కాళ్ల కిందున్న షర్ట్ కూడా మీ తాత డబ్బుతో కొన్నవే, కానీ నా ఒంటి మీదున్న షర్ట్ కూడా నా డబ్బుతో కొనుక్కున్నవేనని చెబుతాడు. నా వెనుక కోట్లు సంపాదించే తాత ఉన్నాడు, మూడు తరాల వంశ చరిత్ర ఉంది, పది తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది. కానీ నువ్వెవరు? నీ అడ్రస్ ఏంటీ? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న.
కోటలో ఉన్న రాణిని తోటలో ఉన్న ఈ తోటరాముడు ఎప్పుడైనా ఎత్తుకుపోతాడని అంటాడు సూరజ్. నీ మాటలు ఎవరైనా విన్నారంటే కాళ్లు చేతులు విరగ్గొడతారు, అర్హతకు మించిన దానికి మించి ఆశపడితే జీవితంలో కోల్పోతావని వార్నింగ్ ఇస్తుంది సూరజ్. నన్ను నిన్ను కలపడానికి ఎవరైనా వస్తారని సూరజ్ అనగా కథలోకి మాలిని అనే కొత్త క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఓ రెస్టారెంట్‌లోకి వెళ్లి నేను అర్జెంట్‌గా ఈ హోటల్ ఓనర్‌ని కలవాలని మేనేజర్‌ని పిలిచి కార్డ్ ఇస్తుంది.
కార్డ్ చూడగానే ఆమెను వెంటనే రమ్మని చెబుతాడు. మీరు కూడా సేమ్ బిజినెస్సే.. మీరు మా హోటల్‌కి రావడం ఏంటీ? నన్ను కలవాలని అనుకోవడం ఏంటీ? అని ఓనర్ అడుగుతాడు. నిన్ను కలవాలని అనుకోవడం లేదు, కొనాలని అనుకుంటున్నానని అంటుంది మాలిని. నాకు కాఫీ మాత్రమే కాదు, హోటల్ కూడా నచ్చింది, రెండున్నర కోట్లు ఇస్తానని ఆఫర్ చేస్తుంది. మీరు మూడు కోట్లు ఇచ్చినా నేను అమ్మనని తేల్చేస్తాడు ఓనర్. రాజీపడని తత్వం నాకు నచ్చింది.. ఈ విజిటింగ్ కార్డ్ మీ దగ్గరే ఉంచండి, మీకు అవసరం రావొచ్చని కోపంగా వెళ్లిపోతుంది.


Click it and Unblock the Notifications