Karthika Deepam 2 Weekly: సుమిత్ర కోసం కార్తీక్- దీప త్యాగం.. నిజం తెలుసుకున్న దశరథ
Photo Courtesy: JioHotstar
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు 601 నుంచి 606వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
ఫిబ్రవరి 23వ తేదీ 601 ఎపిసోడ్‌లో..
ఎలాగైనా దాస్‌ని కలవాలని జ్యోత్స్న, పారిజాతంలు ఇంట్లో నుంచి వెళ్లాలని చూస్తుండగా శివన్నారాయణ గుమ్మం దగ్గరే ఉంటాడు. పెద్దాయన్ని దాటుకుని బయటకు వెళ్తుండగా దశరథ, దీప, కార్తీక్‌లు ఎదురవ్వగా పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఎర్రనీళ్లు తీసుకొచ్చి దీప, కార్తీక్‌లకు దిష్టి తీయమని దశరథ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. పారును కాకుండా సుమిత్రతో దీపకి దిష్టి తీయిస్తాడు. దశరథకు దాస్ నిజం చెప్పేశాడని పారు, జ్యోత్స్నలకు అనుమానం వస్తుంది. దాస్ నాకు గుడిలో కనిపించాడు.. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందని, గుండెల్లోని భారమంతా పోయిందని చెప్పి పారుని స్వీట్స్ తీసుకురమ్మని చెబుతాడు దశరథ. ఈరోజుతో మన కథకు శుభం కార్డ్ పడిందని, దాస్ నా కొంప ముంచేశాడని టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. నా కూతురి నోట్లో స్వీట్ పెట్టమని పారుకి దశరథ చెప్పగా.. జ్యోత్స్న, దీపలలో ఎవరికి పెట్టాలో తెలియక టెన్షన్ పడుతుంది పారు. ఇంతలో దశరథే స్వయంగా జ్యోత్స్నకి స్వీట్ తినిపించడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. నా కొడుకు దాస్ ఎక్కడ అని పారు అడగ్గా.. మనింటికే వస్తున్నాడని చెబుతాడు దశరథ. దాంతో పారు, జ్యోత్స్నలకు చెమటలు పడతాయి. నేనే కూతురిని అని మా నాన్నకి చెప్పినందుకు థ్యాంక్స్ అని కార్తీక్‌ని హత్తుకుంటుంది దీప.
ఫిబ్రవరి 24వ తేదీ 602వ ఎపిసోడ్‌లో..
అమ్మని కాపాడటానికి నా బిడ్డను త్యాగం చేస్తున్నట్లు నాన్నకి ఎప్పటికీ తెలియకూడదని కార్తీక్‌తో ఏడుస్తూ చెబుతుంది దీప. ఇప్పటి వరకు ఈ భారాన్ని నువ్వు మోశావు.. ఇకపై నేను మోస్తానని భార్యను హత్తుకుంటాడు కార్తీక్. డాడీకి దాస్ కనిపించి ఏం చెప్పాడోనని పారు దగ్గర టెన్షన్ పడుతుంటుంది జ్యోత్స్న. ఇంతలో దాస్ వచ్చి... నువ్వు నా కూతురివి కాదు, ఇకపై నన్ను దాయాల్సిన అవసరం కూడా లేదు. సుమిత్ర వదినను కాపాడమని చెబుతాడు దాస్. నువ్వు ఎన్ని చెప్పినా నేనే నీ కూతురిని, ఏదో ఒక రోజు నిజం తెలుసుకుంటావని అంటుంది జ్యోత్స్న. ఈ కురుక్షేత్రాన్ని మొదలుపెట్టింది నా మేనల్లుడు.. వాడే ఈ కథకు ముగింపు పలుకుతాడని అనుకుని వెళ్లిపోతాడు దాస్. దశరథ ప్రవర్తన, దాస్ మాటలతో జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. మన టైం దగ్గర పడిందని పారుతో చెబుతుంది. నువ్వే ఈ ఇంటి వారసురాలివి.. అయినా బిడ్డల్ని మార్చినందుకు దశరథ నన్ను వదిలిపెట్టడని భయపడుతుంది పారిజాతం. దీప, కార్తీక్‌లతో పాటు కాంచన దగ్గరికి వస్తాడు దశరథ. ఈరోజు మీ అన్నయ్య ముఖం ఆనందంతో వెలిగిపోతోందని చెబుతాడు శివన్నారాయణ. నువ్వు నా కూతురిని నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తానని ఇచ్చిన మాట నెరవేర్చుకున్నానని చెబుతాడు దశరథ. ఇంతలో జ్యోత్స్న రావడంతో అంతా షాక్ అవుతారు.

Photo Courtesy: JioHotstar
ఫిబ్రవరి 25వ తేదీ 603వ ఎపిసోడ్‌లో..
కాంచనతో దశరథ మాట్లాడుతుండగా వచ్చిన జ్యోత్స్న.. అత్తకి నువ్వు ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నావు? నేను అత్తకి కోడలిని ఎప్పుడు అయ్యాను? బావ నా మెడలో మూడు ముళ్లు వేశాడు? అని నిలదీస్తుంది. దాంతో కార్తీక్ జోక్యం చేసుకుని దీప తల్లిదండ్రుల స్థానంలో నిలబడి అత్తయ్య- మావయ్యలు నాకు కన్యాదానం చేశారు. అప్పుడు మావయ్యకి దీప కూతురు అయినట్లే కదా అని అంటాడు. అయినా దీప అనాథ కాదని.. తన తల్లిదండ్రులు బతికే ఉన్నారని దశరథ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంతలో కుబేర్‌కు దీప ఎలా దొరికింది? తన తమ్ముడు దీపని ఎలా చూసుకున్నది అనసూయ చెప్పగా దశరథ ఎమోషనలై కుబేర్ ఫోటోకు దండం పెడతాడు. ఎన్ని జన్మలెత్తినా కుబేర్ రుణం తీర్చుకోలేమని చెబుతాడు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. మావయ్యని ఎక్కువసేపు వదిలేస్తే నిజం చెప్పేలా ఉన్నాడని దశరథని బయటకు తీసుకెళ్తాడు కార్తీక్. ఈరోజు జ్యోత్స్న అడిగిన మాటలకు నేను నిజం చెప్పేసేవాడినని కార్తీక్‌తో అంటాడు దశరథ. జ్యోత్స్న కావాలని రెచ్చగొట్టి నీతో నిజం చెప్పించాలనే ఇలా ట్రాప్ చేసిందని చెబుతాడు కార్తీక్. మీ అన్నయ్య ప్రవర్తన రెండ్రోజులుగా తేడాగా ఉందని కాంచనతో అంటాడు శివన్నారాయణ.
ఫిబ్రవరి 26వ తేదీ 604వ ఎపిసోడ్‌లో..
దశరథ మాటలతో దీపే అసలు వారసురాలన్న నిజం బయటపడిందేమోనని జ్యోత్స్న వణికిపోతుంది. వెంటనే దాస్‌ని కలిసి నువ్వు నిజం చెప్పేశావా? మా డాడీ మాటలు అనుమానం వచ్చేలా ఉన్నాయని అంటుంది జ్యోత్స్న. నువ్వే సుమిత్ర కూతురివి అనడానికి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి కదా? ఎందుకు భయపడుతున్నావని అడుగుతాడు దాస్. ఇంతలో జ్యోత్స్న వచ్చి.. నువ్వేందుకు భయపడుతున్నావు.. నువ్వే సుమిత్ర కూతురివని అంటుంది. నేను ఎవరి కూతురినో త్వరలోనే తేల్చుకుంటానని దాస్‌తో సవాల్ విసురుతుంది జ్యోత్స్న. దశరథ మావయ్య పట్టరాని సంతోషంతో ఎక్కడ నిజం చెబుతాడోనని టెన్షన్‌గా ఉందని దీపతో చెబుతాడు కార్తీక్. దశరథ మావయ్యని రెచ్చగొట్టి ఎలాగైనా నిజం రాబట్టాలని జ్యోత్స్న అనుకుంటోందని అంటాడు. నిన్ను వారసురాలిగా ఈ ఇంట్లో చేర్చేసరికి పారు, జ్యోత్స్నలు ఏదో ఒకటి చేస్తారని చెబుతాడు. అయితే మనం ఆ ఇంట్లోకి వెళ్లి అమ్మానాన్నలతోనే ఉందామని చెబుతుంది దీప. ఉదయాన్నే యోగ చేసుకుంటున్న పారిజాతం, జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ వచ్చి దాస్ కిడ్నాప్ గురించి చెబుతాడు. ఈ మాటలు విన్న శివన్నారాయణ షాక్ అవుతాడు.

Photo Courtesy: JioHotstar
ఫిబ్రవరి 27వ తేదీ 605వ ఎపిసోడ్‌లో..
దాస్ కిడ్నాప్ గురించి కార్తీక్ ప్రస్తావించడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. దాస్ కనిపించాడని, మాట్లాడాడని దశరథ చెప్పాడని అంటాడు. ఈ కథ వేరని, ఆ కథ వేరని చెబుతాడు కార్తీక్. బావకి నిజం తెలిసిపోయిందా? దాస్, దశరథలపై నాకు అనుమానంగా ఉందని అంటుంది జ్యోత్స్న. బెడ్‌రూంలో నిద్రపోతున్న సుమిత్ర దగ్గరికి దీపని తీసుకెళ్లి నీ అసలు కూతురని చెప్పబోతుండగా కార్తీక్ అడ్డుపడతాడు. దీప కళ్లలో ఈ రోజు కన్నీళ్లు చూడాలని జ్యోత్స్న అనడంతో పారిజాతం ప్లాన్ చేస్తుంది. కాఫీ తీసుకురమ్మని అడగటంతో దీప వస్తుండగా.. కాలు అడ్డుపెడుతుంది జ్యోత్స్న. దాంతో కాఫీ వెళ్లి పారు మీద పడుతుంది. కోపంతో ఊగిపోతున్న పారు వెంటనే దీప మీద చేయి చేసుకోబోతుండగా దశరథ సీరియస్ అవుతాడు. అసలు నువ్వు కాలెందుకు అడ్డుపెట్టావని దశరథ అడగ్గా.. ఏదో విధంగా కవర్ చేస్తుంది జ్యోత్స్న. అయినా నువ్వు పెళ్లి కావాల్సిన పిల్లవి.. ఇకపై నువ్వే వంట చేయమని ఆర్డర్స్ వేస్తాడు దశరథ. కొడుకు ప్రవర్తనతో శివన్నారాయణ షాక్ అవుతాడు. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి దశరథ భయపడుతున్నాడని అందుకే అలా కోప్పడ్డాడని పెద్దాయన చెబుతాడు. మావయ్యని బయటికి తీసుకెళ్లి కూల్ చేస్తాడు కార్తీక్.
ఫిబ్రవరి 28వ తేదీ 606వ ఎపిసోడ్‌లో..
నువ్వు ఇలాగే చేస్తే పారు, జ్యోత్స్నలు ఎంతకైనా తెగిస్తారని దశరథని హెచ్చరిస్తాడు కార్తీక్. ఎవరు పనిమనిషి.. ఎవరు సేవలు చేయించుకోవాలని దశరథ నిలదీస్తాడు. ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేయడంతో కార్తీక్, దీపలు ఆసుపత్రి చేరుకుంటారు. నేను కూడా వస్తానని దశరథ చెప్పగా సీక్రెట్‌గా కార్తీక్, దీపలు మాత్రమే వెళ్తారు. అయితే దశరథ మాత్రం అనుమానంతో వాళ్లని ఫాలో అవుతాడు. సుమిత్ర గారి ఆపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని, అయితే మీ బిడ్డను వదులుకోవాల్సిందేనని.. ఒకసారి ఆలోచించుకోమని చెబుతుంది డాక్టర్ హారిక. దానికి కార్తీక్, దీపలు సరేనని అంటారు. అయితే ఈ ఒక్క బిడ్డే కాదు... దీపకి భవిష్యత్తులో బిడ్డ పుట్టే అవకాశమే ఉండదని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ వెక్కి వెక్కి ఏడుస్తాడు. దీప బలవంతం మీద ఆపరేషన్‌కి సరేనని చెబుతాడు. ఈ మాటలన్నీ విన్న దశరథ.. సుమిత్ర ప్రాణాలను కాపాడితే దీప తన బిడ్డను కోల్పోతుందని నాకెందుకు చెప్పలేదని ప్రశ్నిస్తాడు. రెండు ప్రాణాల్లో ఒకటి వదులుకోవడమే ఈ సమస్యకు పరిష్కారమని డాక్టర్ చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. మరోవైపు.. కాశీతో తాను కాపురం చేయలేనని తనకు విడాకులు కావాల్సిందేనని స్వప్న తేల్చేస్తుంది. దాస్ ఎంత నచ్చచెప్పాలని చూసినా స్వప్న వినిపించుకోదు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











