Karthika Deepam 2 April 25th: నేనంటే ప్రేమ లేదా బావ?.. కార్తీక్‌ను నిలదీసిన జ్యోత్స.. దీప కోసం అలా!
దీప ని ఊరు నుంచి పంపించేయమని నర్సింహాని హెచ్చరిస్తుంది శోభ. పాపని షాపింగ్ తీసుకువెళ్లినందుకు కార్తీక్ పై కోప్పడుతుంది దీప. సుమిత్ర పై దాడి చేసిన వాడితో మాట్లాడుతూ దీపకీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు బంటు. దీప వంటలు బాగా చేయడంతో సుమిత్ర వాళ్ళందరూ దీపని మెచ్చుకుంటారు. దీపని ఊరు నుంచి పొమ్మని లేదంటే బ్రతకనివ్వనని సుమిత్ర ఇంటికి వచ్చి మరీ దీపని బెదిరిస్తాడు నర్సింహ. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 25 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 28వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
ఇంటికి ఎవరో వచ్చారంట కదా, గొడవపెట్టారంట కదా అంటుంది పారిజాతం. మీకు బంటు చెప్పాడా అంటూ బంటుపై కోప్పడుతుంది సుమిత్ర. అప్పుడే అక్కడికి వచ్చిన శివనారాయణ కూడా పారిజాతాన్ని మందలిస్తాడు. దశరథ్ శౌర్యని ఎత్తుకొని అప్పుడే అక్కడికి వస్తాడు. అమ్మ.. తాతయ్య చూడు ఎన్ని చాక్లెట్లు ఇచ్చాడో అంటూ చేతిలో ఉన్న బ్యాగ్ చూపిస్తుంది శౌర్య. ఎందుకండీ ఇవన్నీ అంటుంది దీప. నా కూతురికి పెళ్లి అయితే మనవరాలితో ఆడుకోవాలని అనుకునేవాడిని.

ఆ దేవుడు నాకు కూతుర్ని, మనవరాల్ని కలిపి ఒక్కసారే ఇచ్చాడు. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు పాపని ఇక్కడే చదివిస్తాను అంటాడు దశరధ్. కొన్ని బంధాలు దగ్గరవుతున్న కొద్ది బరువు అవుతాయి అంటుంది దీప. కానీ కొన్ని బంధాలు దగ్గరవుతున్న కొద్ది బాధ్యత అవుతాయి, నీది అలాంటి బంధమే ఇక నువ్వు ఆలోచించవలసిన పనిలేదు నేను నిర్ణయం తీసుకున్నాను అంటాడు దశరధ్. దీప ఇక్కడే ఉండి పోవడానికి ఒప్పుకుంటుంది.
ఇది ఇక్కడ ఉంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమే అని మనసులోనే కంగారుపడుతుంది పారిజాతం. మరోవైపు జోత్స్న బర్త్ డే పార్టీ జరుగుతూ ఉంటుంది. అందరూ డాన్స్ చేస్తుంటే కార్తీక్ మాత్రం ఒక దగ్గర కూర్చొని దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరిదీ ఒకటే రోజు పుట్టినరోజు కానీ ఒకరికి గ్రాండ్ గా జరుగుతుంది,మరొకరికి కనీసం తోడుగా కూడా ఎవరూ లేరు. కనీసం ఆమెకి తల్లిదండ్రులు ఉన్నా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు నేను సాయం చేస్తాను అంటే తీసుకోవడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు.
జోత్స్న ఫ్రెండ్ జోత్స్న తో మీ బావ ని నీతో పాటు డాన్స్ చేయమనవచ్చు కదా అంటుంది. తనకి ఇలాంటి పార్టీలు ఇష్టం ఉండదు, కేవలం నా కోసమే వచ్చాడు అంటుంది జోత్స్న. అప్పుడే అక్కడికి వచ్చిన జోత్స్న ఫ్రెండ్ గౌతమ్ జోత్స్న ని రెచ్చగొట్టేలాగా మాట్లాడతాడు. మీ బావకి నిజంగానే నువ్వంటే ఇష్టమేనా, ఇష్టమైతే నీతో డాన్స్ చేయాలి కదా, బావంటే ఇష్టమని నువ్వు చెప్పటమే కానీ తను ఏమీ మాట్లాడటం లేదు అంటాడు గౌతమ్.
మా బావకి కూడా నేనంటే ఇష్టమే కావాలంటే చెప్పిస్తాను రండి అంటూ కార్తీక్ దగ్గరికి వాళ్ళని తీసుకొని వెళ్తుంది. నువ్వు ఇలా దూరంగా కూర్చుంటే వాళ్లందరూ నేనంటే నీకు ఇష్టం లేదనుకుంటున్నారు నేనంటే నీకు ప్రేమ అని చెప్పు బావ అంటుంది జోత్స్న. నేనంటే ఏంటో నీకు తెలియదా, మరదలుగా నువ్వంటే నాకు ఎప్పుడూ అభిమానమే అంటూ ఫోన్ వచ్చిందని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. మీ బావకి నువ్వంటే అభిమానం అని చెప్తున్నాడు కానీ ప్రేమ గురించి ఏం మాట్లాడటం లేదు.

నిజంగా ప్రేమ ఉండి ఉంటే ఇలా మధ్యలోనే వెళ్లిపోయాడు కదా అని జోత్స్నని మరింత రెచ్చగొడతారు ఆమె ఫ్రెండ్స్. హర్ట్ అయిన జోత్స్న ఓవర్ గా డ్రింక్ చేస్తుంది. మరోవైపు మల్లేష్ దగ్గర ఐదు రూపాయలు వడ్డీకి 5000 అప్పు తీసుకొని కోడల్ని వెతుకుతూ పట్నం బయలుదేరుతుంది అనసూయమ్మ. నేను వచ్చే వరకు నా ఇంటి జోలికి వెళ్లొద్దు అంటూ మల్లేష్ ని హెచ్చరిస్తుంది. మరోవైపు మనం ఇక్కడే ఉండిపోతున్నామా అని తల్లిని అడుగుతుంది శౌర్య.
ఉండిపోతున్నాం అంటుంది దీప. మనసులో రెండు రోజుల్లో వస్తానని చెప్పాను ఐదు రోజులు అయిపోయింది అత్త ఎలా ఉందో అనుకుంటుంది దీప. ఆరు సంవత్సరాల నుంచి కొడుకు కనిపించకపోతేనే బెంగపెట్టుకోలేదు ఇక నా మీద ఏం బెంగపెట్టుకుంటుంది, డబ్బులు లేకుండా ఊరికి వెళ్లడం కంటే డబ్బు సంపాదించి ఊరికి వెళ్లి అప్పులు తీర్చటమే మంచిది అనుకుంటుంది. అందరూ కనిపిస్తున్నారు కానీ నాన్న కనిపించడం లేదు ఏమిటమ్మా మనం నాన్నని వెతకడానికి కదా వచ్చాము అంటుంది శౌర్య.
ఎక్కడికో వెళ్లి ఉంటాడు అయినా నాన్న గురించి అస్తమానం అడగద్దు అంటుంది దీప. మరోవైపు ఇంటికి వచ్చిన కార్తీక్ ని పార్టీ అయిపోయిందా అని అడుగుతారు అతని తల్లిదండ్రులు. లేదు ఫోన్ వచ్చింది అందుకే వచ్చేసాను అంటాడు కార్తీక్. కోడలు బాధపడుతుందేమో అంటుంది కాంచన. తనకి చెప్పే వచ్చాను తనేమీ బాధపడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. కానీ కోడలు బాధపడిందేమో అని కార్తీక్ తల్లిదండ్రులు బాధపడతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











