హీరోయిన్‌తో ప్రేమకు ఎండ్‌కార్డ్ .. ఆమెతో లింక్ పెట్టొద్దు .. బిగ్‌బాస్ విన్నర్ షాకింగ్ పోస్ట్
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా విడాకులు, బ్రేకప్స్, పెళ్లిళ్ల వార్తలే కనిపిస్తున్నాయి. పలువురు స్టార్స్ తమ జీవిత భాగస్వాములకు విడాకులు ఇవ్వగా.. రేపో మాపో డివోర్స్ తీసుకోవడానికి రెడీ అవుతున్న వారు ఉన్నారు. ఎప్పుడు ఏ సెలబ్రెటీ బాంబు పేలుస్తాడో తెలియక సినీ వర్గాలు, వారి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. తాజాగా తెలుగు బుల్లితెర నటుడు తన ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర పోస్ట్ పెట్టి కలకలం రేపాడు.
దాదాపు 105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు 8 గతేడాది డిసెంబర్‌లో ముగిసిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో సీరియల్ నటుడు , కర్ణాటకకు చెందిన నిఖిల్ టైటిల్ విజేతగా నిలిచారు. గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నిఖిల్‌కు బిగ్‌బాస్ తెలుగు 8 ట్రోఫీ, రూ. 55 లక్షల ప్రైజ్ మనీ అందించాడు. అయితే తెలుగు బిగ్‌బాస్‌లో కన్నడ వ్యక్తిని విజేతగా ప్రకటించడం ఏంటంటూ నేటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.

నిఖిల్ కన్నడలో పలు సినిమాల్లో హీరోగా నటించారు. అయితే అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో తెలుగు టెలివిజన్ రంగంలో అడుగుపెట్టి గోరింటాకు, కోయిలమ్మ, స్రవంతి తదితర సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన నిఖిల్‌కు బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గానూ అవకావం దక్కడం, ట్రోఫీ గెలవడం చకచకా జరిగిపోయాయి. హౌస్‌కు లీడర్‌లా వ్యవహరించిన నిఖిల్‌పై పలు విమర్శలు సైతం వచ్చాయి. అమ్మాయిలను లవ్‌లోకి దించి వారిని పోటీలో లేకుండా చేశాడని, ఎమోషన్స్‌తో ఆడుకున్నాడంటూ పలువురు కంటెస్టెంట్సే విమర్శించారు. అయినప్పటికీ ఆడియన్స్ అవేవీ పట్టించుకోకుండా నిఖిల్‌ను విన్నర్‌ను చేశారు.
ఇక నిఖిల్ ప్రేమ జీవితం కూడా తెలుగు బుల్లితెర మీదే ప్రారంభమైంది. గోరింటాకు సినిమాలో తనతో పాటు నటించిన మరో కన్నడ నటి కావ్యశ్రీతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. తెలుగు ప్రేక్షకులు ఈ జోడీని ఆదరించడంతో గోరింటాకు సీరియల్ హిట్ అయ్యింది. ఈ సీరియల్ ముగిసేసరికి నిఖిల్, కావ్యలు పీకల్లోతు ప్రేమలో నిలవడంతో పాటు సోషల్ మీడియాలోనూ వీడియోలు, ఫోటోలతో హల్ చల్ చేశారు. ఆ తర్వాత పలు షోలు, డ్యాన్స్ షోలలోనూ వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోందని వార్తలు వస్తున్న సమయంలో నిఖిల్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు.
అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే తాము విడిపోయామని, కానీ ఎప్పటికైనా కావ్యనే తన వైఫ్ అని ఎమోషనల్ అయ్యాడు. కానీ బిగ్‌బాస్ విన్నర్ అయిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య గ్యాప్ అలాగే కంటిన్యూ అయ్యింది. పలు షోలలో నిఖిల్, కావ్యలు ఎదురైనా కనీసం పలకరించకుండానే ముఖాలు తిప్పుకుని వెళ్లిపోయారు. అయితే ఇటీవల చిన్న సీరియల్‌లో కావ్యశ్రీ, నిఖిల్‌లు నటిస్తుండటంతో వీరు కలిసిపోయారని అంతా అనుకున్నారు.
వీరు ప్రేమలో ఉన్నారా? విడిపోయారా? అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? అంటూ ఆడియన్స్ డైలమాలో పడ్డారు. ఈ నేపథ్యంలో నిఖిల్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఎవరి జీవితాలు వారివేనని .. తనను ఎవరితోనూ కలపొద్దని , ఎవరి పోస్టులకు తనను ట్యాగ్ చేయొద్దని తన అభిమానులను రిక్వెస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌తో కావ్యతో తాను విడిపోయానని నిఖిల్ అధికారికంగా ప్రకటించినట్లయ్యింది. మరి దీనిపై కావ్య ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











