తెలుగు బిగ్‌బాస్‌లో కన్నడ మేళం.. ఏంటిది బిగ్‌బాస్ అంటూ , రీజనల్ ఫీలింగ్ లేపిన కిర్రాక్ సీత
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ గ్రాండ్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఏడుగురు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలు హౌస్‌లోకి ఎంటరయ్యారు. ఎప్పటిలా ముక్కు మొహం తెలియనివారు కాకుండా ఈసారి కాస్త ఫేమ్ ఉన్న వారిని , జనానికి తెలిసిన వారిని నిర్వాహకులు కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేశారు. అంత వరకు బాగానే ఉంది కానీ , ఈ సీజన్‌లో నలుగురు కన్నడవాళ్లను పట్టుకురావడం హాట్ టాపిక్‌గా మారింది. స్వయంగా కంటెస్టెంట్ కిరాక్ సీత హౌస్‌లో ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటో ఒకసారి పరిశీలిస్తే.
తెలుగు సినిమాలలో పరభాషా నటులు ఇప్పుడే కొత్తగా మొదలైంది కాదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఈ ట్రెండ్ ఉంది. కళాకారుడికి ప్రాంతం, మతం వంటి భేదాలు లేవని పెద్ద పెద్ద డైలాగులు చెప్పినా.. తెర వెనుక తిట్టుకునేవారు ఎందరో. ఇప్పుడిది బుల్లితెరకూ విస్తరించింది, ముఖ్యంగా తెలుగు సీరియల్స్ మొత్తం కన్నడ నటీనటులు ఆక్రమించేశారు. ఏ ఛానెల్‌లో ఏ సీరియల్ చూసినా లీడ్ క్యారెక్టర్స్ వారివే కావడంతో తెలుగు బుల్లితెర కళాకారులు ఫైర్ అవుతున్నారు.

స్థానికులను పక్కనపెట్టి.. ఎక్కడి నుంచో నటీనటులను తీసుకొచ్చి వారిని అందలం ఎక్కించడం ఏంటని పెదవి విరుస్తున్నారు. ఇంటిల్లిపాది ముఖ్యంగా ఆడవాళ్లకు ఎంటర్‌టైన్మెంట్ అందించడంలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయి. అందుకే తెలుగునాట సినిమాలు సినిమా తారలతో సమానంగా సీరియల్స్‌కు మంచి క్రేజ్ ఉంది. బుల్లితెరపై కొన్ని సీరియల్స్ టీఆర్‌పీల ముందు స్టార్ హీరోల సినిమాలు నిలబడలేవంటే వాటి సత్తా అర్ధం చేసుకోవచ్చు.
అయితే తెలుగు బుల్లితెరపై కన్నడ భామల హవా నడుస్తోంది. అర్చనా అనంత్, శోభాశెట్టి, ఐశ్వర్య పిస్సే, రక్షా గౌడ, మంజుల, నవ్య స్వామి, తేజస్విని గౌడ వంటి భామలతో పాటు పలువురు కన్నడ అబ్బాయిలు కూడా తెలుగు సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేస్తున్నారు. అంతేందుకు తెలుగువారి ఫేవరేట్ షోలలో ఒకటైన జబర్దస్త్‌కు ఆ మధ్య యాంకర్‌గా ఏకంగా సౌమ్యా రావ్ అనే కన్నడ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు. సీరియల్స్ , సినిమాలంటే డబ్బింగ్‌తో మేనేజ్ చేసుకోవచ్చు.. కానీ తెలుగు షోలకు ఓ కన్నడ అమ్మాయి యాంకరింగ్ చేయడమంటే మనవాళ్లు ఎలా దిగజారిపోయారో అర్ధం చేసుకోవచ్చు.
అంతేకాదు.. తెలుగు బిగ్‌బాస్‌లోనూ కన్నడ నటీనటులు కంటెస్టెంట్స్‌గా వచ్చి ఇక్కడా తమ జైత్రయాత్ర మొదలుపెట్టారు. గత సీజన్‌లో కర్ణాటకకే చెందిన శోభాశెట్టి, పూజామూర్తిలు ఎంట్రీ ఇచ్చి టఫ్ ఫైట్ ఇచ్చారు. ఈ కల్చర్‌ను బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లోనూ కంటిన్యూ చేశారు. ఈసారి ఏకంగా నలుగురు కన్నడిగులకు అవకాశం కల్పించారు. వారే నిఖిల్, యాష్మీ గౌడ, ప్రేరణ కంభం, పృథ్వీరాజ్ శెట్టి . వీరంతా ఒక బ్యాచ్‌లా మారి తెలుగు కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇస్తున్నారు.
కన్నడ బ్యాచ్‌ను ఉద్దేశిస్తూ కిర్రాక్ సీత సంచలన వ్యాఖ్యలు చేసింది. పృథ్వీరాజ్, ప్రేరణ పక్కనే ఉండగా.. ఏంది బిగ్‌బాస్ ఈ కన్నడొళ్లు అందరినీ తెచ్చావ్ అంటూ సీత హాట్ కామెంట్స్ చేస్తుంది. అయితే దీనికి కన్నడ బ్యాచ్ ఎలాంటి రియాక్షన్ ఇచ్చారన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం సీత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











