Krishna Mukunda Murari: ఆదర్శ్‌కు దొరికిపోయిన మీరా.. కృష్ణ కీలక నిర్ణయం.. లెటర్ చించేయడంతో!
ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మీరా ఎక్కువగా మురారి మీదనే ఫోకస్ చేస్తుండడంతో కృష్ణకు డౌట్ వస్తుంది. దీంతో మురారి ముందు తన సందేహాలను వ్యక్త పరుస్తుంది. అప్పుడు అతడు ఆమెకు సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తాడు. మీరా.. ఆదర్శ్‌ను పడేయాలని చూస్తుందని రజినీ పొరపాటు పడగా.. ఆమె సంగీతతో ఆదర్శ్ పెళ్లి గురించి మాట్లాడమని సలహా ఇస్తుంది. అంతేకాదు, రజినీని తీసుకెళ్లి భవానీ దేవితో సంబంధం గురించి మాట్లాడిస్తుంది. తర్వాత మీరాను ముకుంద అని పిలవడం తనకు ఇష్టం లేదని చెప్పిన కృష్ణ.. ఆమెకు ఓ కొత్త మొబైల్‌ను కొని బహుమతిగా అందిస్తుంది.

తండ్రిపై ముకుంద సీరియస్
ముకుంద అలియాస్ మీరా చెప్పడంతో ఆమె తండ్రి శ్రీనివాస్ తన ఇంటిని అమ్మేస్తాడు. అప్పుడు వడ్డీ వ్యాపారి ఇల్లు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తాడు. అంతేకాదు, 'మీ అమ్మాయి తిరిగిన ఇల్లు కదా. జ్ఞాపకంగా ఉంచుకోకుండా ఎందుకు అమ్మేస్తున్నారు' అని అంటాడు. అతడి మాటలకు శ్రీనివాస్ సీరియస్ అవుతాడు. ఆ వెంటనే ముకుందకు ఫోన్ చేసి విషయం చెప్పాలని చూస్తాడు. అలా కాల్ చేయగానే లిఫ్ట్ చేసి తండ్రి మీద అరుస్తుంది. 'అవసరం అయితే నేనే ఫోన్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు చేయవద్దు' అని తిట్టి ఫోన్ పెట్టేస్తుంది.
చూసి కుళ్లుకున్న ముకుంద
తమ గదిలో కృష్ణ హడావుడిగా ఏదో వెతుకుతూ ఉంటుంది. దీంతో మురారి ఏం వెతుకుతున్నావని అడుగుతాడు. అప్పుడామె అతడిపై మీద చిరాకు పడుతుంది. దీంతో మురారి.. కృష్ణకు చక్కిలిగిలి పెడతాడు. దీంతో ఆమె నవ్వుతుంది. అలా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం ముకుంద చూస్తుంది. అప్పుడామె మనసులో 'ప్రేమిస్తున్నానని చెప్పి ఎంత వెంట పడ్డాను. అసలు పట్టించుకోలేదు. ఈవిడ కొంచెం చిరాకు పడితే చాలు.. నవ్వించడానికి తెగ తంటాలు పడుతున్నాడు' అని తిట్టుకుంటుంది.

తల్లి కావాలని కృష్ణ నిర్ణయం
వెతుకున్న సమయంలో కృష్ణ తగలడంతో టేబుల్ మీద ఉన్న కొన్ని పేపర్స్ కిందపడిపోతాయి. వాటిలో భవానీ రాసిన లెటర్ కనిపిస్తుంది. అందులో నువ్వు అమ్మవి అయితే చూడాలని ఉందని భవానీ రాసింది చూసిన కృష్ణ 'తల్లిని అవుతాను.. మనవడినో, మనవరాలినో ఇచ్చి మిమ్మల్ని సంతోషపెడతాను. అత్తయ్యతో చెప్పి శోభనానికి ఏర్పాట్లు చేయించాలి' అని అనుకుంటుంది. తర్వాత ఆ లెటర్ ముకుంద చూసి రగిలిపోతుంది. అంతేకాదు, 'మురారితో బిడ్డను కంటే నేను కనాలి. కృష్ణ తన బిడ్డకు తల్లి కాకూడదు' అని అనుకుంటుంది.
శోభనం గురించి పరోక్షంగా
తర్వాత కృష్ణను రేవతి పిలుస్తుంది. అప్పుడామె 'ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయాయి కదా' అంటూ సిగ్గు పడుతూ పరోక్షంగా శోభనం గురించి మాట్లాడుతుంది. అప్పుడు రేవతి కృష్ణ ప్రవర్తన చూసి హాస్పిటల్‌కు వెళ్లాలని అనుకుంటున్నావ్ కదా వెళ్ళు అని అంటుంది. దీంతో కృష్ణ కోపంగా అది కాదని సీరియస్ అవుతుంది. అంతేకాదు, బుర్ర పెట్టి ఆలోచించండని అంటుంది. తనని అర్థం చేసుకోవడం లేదని కృష్ణ రేవతిని తెగ తిట్టేస్తుంది. కోడలి కడుపు పండితే చూడాలని ఆశగా లేదా అని అసలు విషయం చెప్పేస్తుంది. దీంతో భవానీతో మాట్లాడతానని రేవతి అంటుంది.

అడ్డంగా దొరికిన ముకుంద
కృష్ణ వదిలేసి వెళ్లిన లెటర్ చూసిన ముకుంద అలియాస్ మీరా 'ఈవిడ తల్లి అయితే తండ్రి ఎవరు? మురారి కదా. నో మురారి నా బిడ్డకు మాత్రమే తండ్రి కావాలి. మురారి నీడ కూడా కృష్ణ మీద పడనివ్వను. అయినా తల్లి కావాలంటే ముందు శోభనం జరగాలి కదా. ఒకటి కాదు వంద సార్లు ముహూర్తాలు పెట్టినా జరగకుండా చెడగొట్టేస్తాను. నిన్ను బిడ్డకు తల్లిని కానివ్వను' అనుకుంటుంది. తర్వాత ముకుంద కోపంగా లెటర్ చింపేయడం ఆదర్శ్ చూస్తాడు. ఏమైంది ఏదో లెటర్ ని చింపేస్తున్నావని ఆదర్శ్ అడుగుతాడు. ఏదో పాత లెటర్ అని కవర్ చేస్తుంది.
ముకుంద రాసిన ఉత్తరం
మీరా చెప్పిన తర్వాత కూడా ఆదర్శ్ చింపేసిన లెటర్ ముక్క ఒకటి తీస్తాడు. అందులో కృష్ణ అని కనిపిస్తుంది. కృష్ణ గురించి రాసి ఉంది ఏంటని అడుగుతాడు. దీంతో మీరా దొరికిపోయానని టెన్షన్ పడుతుంది. ఆ వెంటనే 'అది ముకుంద నాకు రాసిన ఉత్తరం. ఈ లెటర్‌లో కృష్ణ గురించి రాసింది. తను చేసిన దురాగతాలన్నీ రాసింది. అది చదవగానే కన్నీళ్ళు ఆగలేదు. కృష్ణ మీద కోపం ఆగలేదు. అందుకే లెటర్ చింపేశాను' అని చెప్తుంది. అలాగే, ఒక ఆడదానిగా ఇంత అన్యాయం ఎలా చేస్తారని డ్రామా వేస్తుంది. దీంతో కృష్ణపై ఆదర్శ్‌కు కోపం పెరిగిపోతుంది.
సంతోషం లేకుండా చేసి
రేవతి.. భవానీ దగ్గరకు వచ్చి కృష్ణ వాళ్ళ శోభనం గురించి మాట్లాడుతుంది. అప్పుడు సుమలత 'ముకుంద గురించి ఆలోచిస్తూ కృష్ణ తన జీవితంలో సంతోషం లేకుండా చేసుకుంది. ఇప్పటికైనా వాళ్ళని ఒక్కటి చేస్తే మనవడినో మనవరాలినో ఇస్తారు' అంటుంది. అప్పుడు భవానీ.. కృష్ణ, మురారి వాళ్ళని పిలవమని చెప్తుంది. కాసేపు కృష్ణ, రేవతి పోట్లాడుకుంటారు. కృష్ణ, మురారి కాసేపు గిల్లిగజ్జాలు ఆడుకుంటారు. అటు ఇటూ పరిగెడుతూ ముకుంద చుట్టూ తిరుగుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











