Krishna Mukunda Murari: వాళ్లకు నిజం చెప్పాలని ముకుంద నిర్ణయం.. ఫోన్‌లో పేరుతో కృష్ణకు అనుమానం
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి.
అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photo Credits: Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే: ఆదర్శ్‌తో శోభనం జరిపించాలని ప్లాన్ చేయడంపై ముకుంద అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అంతేకాదు, అతడికి నిజం చెప్పాలని మరోసారి అనుకుంటుంది. కానీ, ఆదర్శ్ మాత్రం ఆమెపై ప్రేమను చూపిస్తూ మాట్లాడుతుంటాడు. భవానీ దేవికి ముకుందపై డౌట్ ఉన్న విషయాన్ని రేవతి.. కృష్ణతో చెబుతుంది. దీంతో ముకుందను టెస్ట్ చేసేందుకు కృష్ణ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ముందుగా పంతులుతో మాట్లాడి ఆదర్శ్, ముకుందకు శోభనం ముహూర్తం పెట్టిస్తుంది. అదే సమయంలో తమ శోభనం ముహూర్తం లేదని కూడా చెప్పిస్తుంది.

కృష్ణపై కోప్పడిన మురారి: శోభనం గురించి మాట్లాడిన తర్వాత మురారి గదిలోకి వస్తాడు. కానీ, కృష్ణ మాత్రం అతడిని పట్టించుకోదు. దీంతో మురారికి కోపం వచ్చి పిల్లో విసిరేస్తాడు. అప్పుడామె ఏంటి కోపం వచ్చిందా? అనగా మురారి రగిలిపోతూ ఉంటాడు. తర్వాత 'మన శోభనం గురించి ఎప్పుడు మాట్లాడినా.. ఇప్పుడు కాదు రెండు జంటలకి ఒకేసారి ముహూర్తం పెట్టిస్తానని మాట ఇచ్చి.. ఇప్పుడు వాళ్ళకి మాత్రమే పెట్టిస్తే అర్థం ఏంటి? నేనంటే ఇష్టం లేదనా' అంటాడు. దీంతో కృష్ణ 'అలా అనకు.. ముహూర్తాలు వాళ్ళ జాతకాలని బట్టి పెడతారు' అంటుంది. దీంతో మురారి ఆ పంతులు ఫోన్ నెంబర్ ఇవ్వమంటాడు.

మురారిని కూల్ చేసింది: మురారి మాటలకు కృష్ణ 'సరే మనకు కూడా అదే ముహూర్తానికి శోభనానికి ఏర్పాట్లు చేయమని చెప్తాను. రేపు మన పిల్లలు ఏ దొంగో రౌడీ అయితే పర్వాలేదా? సరైన ముహూర్తం లేకపోతే అలాంటి పిల్లలే పుడతారు. అసలే పెద్దత్తయ్యకు మంచి వాళ్లను చేతిలో పెడదామని అనుకుంటున్నా' అని చెబుతుంది. దీంతో మురారి దెబ్బకి కూల్ అయిపోయాడు. తర్వాత కృష్ణ 'ముకుంద వాళ్ళకి శోభనం జరిగిపోతే ఇక మనకి ఏ అడ్డు లేదు కదా. నెక్ట్స్ ఏ ముహూర్తం ఉంటే మనకు అప్పుడే శోభనం' అంటుంది. ఆ మాటలతో మురారి సైలెంట్ అయిపోతాడు.
మురారిని కోరుకుంటూ: గదిలో ఒంటరిగా కూర్చున్న ముకుంద 'రిసార్ట్‌లో శోభనం ప్లాన్ చేసింది కృష్ణ. అక్కడ శోభనం జరగకుండా చేశానని ఇక్కడ ఇంటికి రాగానే ఏర్పాట్లు చేసింది. పైగా నేను ఏదో ఏర్పాటు చేసినట్టు నా మీదకు నెట్టేసింది. దగ్గరుండి పాల గ్లాసుతో శోభనం గదిలోకి పంపే వరకు నిద్రపోదు. నా మీద ఎంత నమ్మకం ఉన్నా నేను మురారిని కోరుకుంటున్నాను అనే భయం మనసులో ఏదో ఒక మూలన ఉంటుంది. అసలు నాకు కృష్ణకు అన్యాయం చేయాలనే ఆలోచన ఉంటే ఎప్పుడో చేసేదాన్ని కదా. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఆదర్శ్‌కు చెప్తే ముహూర్తం పెట్టాక నీ అసలు రంగు బయట పెడతావా అని గొడవ చేస్తాడు. ఏం చేయాలి' అనుకుంటుంది.

భవానీకి నిజం చెప్పాలి: ఆ తర్వాత ముకుంద 'అత్తయ్యకు నా మనసులో ఉన్నది చెప్పేస్తాను. ఆవిడ తప్ప ఎవరూ నన్ను కాపాడలేరు' అనుకుని వెంటనే ఫోన్ చేస్తుంది. అప్పుడే కృష్ణ వాళ్ళు ఆమె దగ్గరకు వస్తారు. వచ్చీ రావడమే 'ఏంటి టెన్షన్‌లో ఉన్నావు? ఈ శోభనం వద్దని అనుకుంటున్నావా? అంటే మన రెండు జంటల శోభనాలు జరగాలని రిసార్ట్‌లో ప్లాన్ చేశావు కదా. ఇప్పుడు మీ ఒక్కరికే ముహూర్తం కుదిరిందని మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా' అని కృష్ణ అంటుంది. మురారి 'మా గురించి ఆలోచించకు. ముహూర్తం లేకుండా రౌడీలని ఎక్కడ కంటాం' అంటాడు. అప్పుడే ఆదర్శ్ ఎంట్రీ ఇస్తాడు.
మురారితో చెప్పాలని: కృష్ణ 'పెద్దత్తయ్య కూడా ఇదే మాట అన్నారు. ఆవిడ లేకపోయినా ఆ బాధ్యత నాకు అప్పగించి శోభనం జరిపించమన్నారు. బట్టలు కూడా కొనిపించమన్నారు' అని చెప్పగా.. ముకుంద టెన్షన్‌గా కనిపిస్తుంది. అయినా శోభనానికి తెల్ల చీర, తెల్ల పంచె కొనాలి కదా పదండి వెళ్దామని అంటుంది. దీంతో ముకుంద 'ఇప్పుడు నాకు ఓపిక లేదు. మాకు ఏవి బాగుంటాయో మీకు తెలుసు కదా. మీరే తీసుకురండి' అనడంతో మురారి ఓకే అంటాడు. దీంతో ముకుందను చూసి శోభనం తప్పించుకోడానికి ప్లాన్ చేస్తుంది అనుకుంటుంది. వాళ్లు వెళ్లగానే ముందుకు నిజాలు మొత్తం మురారికి చెప్పాలని అనుకుంటుంది.

అనుమానం నిజమే: ముకుంద ఫొటోలను తీసుకొచ్చి రేవతికి చూపించిన మధు 'శోభనం ముహూర్తం పెట్టేటప్పుడు తన మొహం చూడు ఎలా మాడ్చుకుందో. తన ఫీలింగ్స్ మారిపోయాయి. నా అనుమానం నిజం.. ఆదర్శ్ అంటే ఇష్టం లేదు. ఇదంతా నాటకం' అంటాడు. కానీ రేవతి మాత్రం ముకుంద ఇష్టం లేకపోతే మొహం మీద చెప్పేస్తుంది అంటుంది. కానీ మధు మాత్రం ఒప్పుకోడు. ఇక, కృష్ణ వాళ్లు షాపింగ్ చేసి ఇంటికి వచ్చి.. వాటిని ఇవ్వడం కోసం ముకుంద దగ్గరకి వెళ్తుంది. అప్పుడు ముకుంద 'మురారికి విషయం చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడు? గుండెల్లో దాచుకుంటాడా? లేదంటే అందరికీ చెప్పి అల్లరి చేస్తాడా' అని ఆలోచిస్తుంది.
నా మొగుడు అంటూ: ముకుందతో కృష్ణ మాట్లాడుతుండగా ఆమెకు కాల్ వస్తుంది. అందులో నా మొగుడు అని పేరు ఉండడంతో ఆదర్శ్ చేస్తున్నాడు అనుకుంటుంది. ఆ వెంటనే కాల్ మాట్లాడమని వెళ్లిపోతుంది. అంతలోనే ఆదర్శ్ కూడా ఫోన్ మాట్లాడుతుండడంతో ముకుందతోనే అని అనుకుంటుంది. అలా గదిలోకి రాగానే మురారి కాఫీ ఏది అని అడుగుతాడు. దీంతో మర్చిపోయా అంటుంది. అప్పుడు మురారి 'అందుకే కదా.. ముకుందకు కాల్ చేసి చెప్పాను' అంటాడు. దీంతో ఎప్పుడు చేశారు అనగా.. ఇందాకే అంటాడు. అప్పుడు కృష్ణ 'అంటే.. ఫోన్ చేసింది ఏసీపీ సర్. నా మొగుడని ఫీడ్ చేసుకుందా? అసలు ఏం ఆలోచిస్తుంది' అనుకుంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











