‘ఐదుగురితో కమిటైతేనే ఆ బిగ్ ఆఫర్.. ఆ డైరెక్టర్ నా నడుముని’
సినీరంగంలో వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో వచ్చే అమ్మాయిలను ఆఫర్ల పేరుతో వేధించి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. కొత్తగా ఇండస్ట్రీలో ప్రవేశించే వారే కాదు.. స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న వారిని కూడా కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ భూతం వేధిస్తూనే ఉంది. ఎంతోమంది మహిళా నటులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల సంగతి బయటపెట్టారు. ఇండస్ట్రీలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న కొందరి బండారాలు మీటూ ఉద్యమం సందర్భంగా వెలుగుచూశాయి. నిత్యం ఎవరో ఒక సెలబ్రెటీ ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు.
సినీ పరిశ్రమలోనే కాదు.. బుల్లితెర ఇండస్ట్రీలోనూ ఈ క్యాస్టింగ్ కౌచ్ విస్తరించిందని పలు సంఘటనలు నిరూపించాయి. గతేడాది కేరళలో వెలుగుచూసిన జస్టిస్ హేమకమిటీ రిపోర్ట్‌లో పలువురు బుల్లితెర నటీమణులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు. తాజాగా తెలుగు బుల్లితెరపై, వెండితెరపై క్యారెక్టర్ రోల్స్‌తో ఫేమస్ అయిన మిర్చి మాధవి తన జీవితంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ వేధింపులను బయటపెట్టి బాంబు పేల్చారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే...

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మిర్చి మాధవి బిజీ
వందలాది సినిమాలలో తల్లి, వదిన, అత్త పాత్రలలో మెప్పించారు మిర్చి మాధవి. ఎన్టీఆర్ కథానాయకుడు, రామ చక్కని సీత, జోడి, శతమానం భవతి, ప్రేమయుద్ధం తదితర సినిమాలలో నటించారు. అయితే 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చితో ఆమె బాగా పాపులర్ అయ్యారు. నాటి నుంచి ఆమెను మిర్చి మాధవి అని పిలుచుకుంటున్నారు అభిమానులు. సినిమాలతో పాటు బుల్లితెరపైనా మాధవి సత్తా చాటారు. ముఖ్యంగా గుప్పెడంత మనసు సీరియల్‌లో హీరో రిషికి పెద్దమ్మ దేవయాని పాత్రలో జీవించి ప్రేక్షకులతో ప్రశంసలు అందుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆమె పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిర్చి మాధవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
అన్నీ ఉన్నా ఆఫర్స్ నిల్
అన్ని రంగాల్లో కంటే సినీరంగంలో వేతనాల విషయంలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. నా కంటే ఎక్కువగా పేమెంట్ తీసుకున్న వారిని చూసి స్పూర్తి పొందుతానే కానీ, కుళ్లుకునే మనస్తత్వం కాదు. అన్నీ ఉన్నా ఆఫర్స్ ఎందుకు రావడం లేదు, కాల్ వచ్చిన సెలెక్ట్ కావడం లేదు, ఆడిషన్స్‌కి వెళితే మీరు తెలుసు మాధవి గారు అంటారు. సీరియల్స్‌లో డిమాండ్‌లోనే ఉన్నాను, మూవీస్ విషయానికి వస్తే పిలుస్తుంటారు. ఇక్కడ అర్హత అనే దానికి స్కోప్ తక్కువ.. మీకు తర్వాత చెబుతామని పంపేసేవాళ్లు. పది రూపాయలు వస్తే తొమ్మిది రూపాయలు దాచిపెట్టి, ఒక్క రూపాయి ఖర్చు పెట్టే రకాన్ని కాదు. ఐదు రూపాయలు ఖర్చు పెట్టి.. ఐదు రూపాయలు దాచుకునే రకాన్ని కాదు అని మాధవి తెలిపారు.
లావయ్యానని ముఖం మీదే
ఐటీ ఇండస్ట్రీలో 45 ఏళ్లు దాటాక అందులో కొనసాగడం కష్టం. దాంతో కుటుంబ భారంలో 70 శాతం నాది ఉంటే, 30 శాతం నా భర్తది ఉంటుంది. మనమెంత ట్రై చేసినా మనకి ఏం రాసుంటే అదే జరుగుతుంది, అలాగని ప్రయత్నించకపోతే మన ఒడిలో వచ్చి పడవు. మీరు కొంచెం లావయ్యారు అంటారు.. తీగలా ఉన్నప్పుడు వాళ్లేం చేశారో. ఆడవాళ్లకి ఓ వయసు దాటిన తర్వాత ఆటోమేటిగ్గా పెరుగుతుంది. మెటబాలిజం తరిగిపోతుంది, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఇలా రకరకాలు వస్తాయి. అవన్నీ మీరే చూసుకోవాలని నాతో అంటారు. యాక్టింగ్ అంటే ఒక కళ.. చాలామంది అమ్మాయిలు డిగ్నిటీ మెయింటైన్ చేయరు అని మాధవి చెప్పారు.
మేల్ డామినేషన్ భరించలేం
పేమెంట్ విషయంలో ఏమైనా అంటే మనకి కాల్ రాదు. నేను కనుక ఉద్యోగం చేసుంటే ఈరోజున రెండు మూడు కోట్లు వెనకేసే దానిని. అనుకోకుండా ఇటు రావడం.. సీరియల్స్ అయితే కాస్ట్యూమ్స్, చీరలు అన్ని మనమే తెచ్చుకోవాలి. క్యాస్టింగ్ కౌచ్ విషయానికి వస్తే.. ఒక రూమ్‌లోకి ఆడ, మగ వెళ్లారంటే ఇద్దరి అంగీకారం ఉండాల్సిందే. నీ అడ్వాంటేజ్ కోసం నువ్వు కాంప్రమైజ్ అయ్యావు.. నాకు అలాంటి అవసరం ఏం రాలేదు. కానీ కొన్ని కొన్నిసార్లు ఆ డామినేషన్ భరించడం కష్టం. నా జీవితంలో రెండు మూడు సార్లు కొందరు ఓవరాక్షన్ చేశారు అని మిర్చి మాధవి అన్నారు.
నడుము చూపించమంటూ
పన్నెండేళ్ల క్రితం ఓ దర్శకుడు కాల్ చేసి నాకు ఆఫీస్ ఇంకా పెట్టలేదు.. మీ ఇంటికొచ్చి కలుస్తాను అంటే సంతోషంగా రమ్మని చెప్పాను. అప్పుడు మా ఇంట్లో అమ్మ, నేను, మా పనిమనిషి మాత్రమే ఉన్నారు. అతను రాగానే నేను పంజాబీ డ్రెస్‌లో కనిపించడంతో అటు ఇటు నడిచి చూపించమని చెప్పడంతో సరేనని నడిచా. ఆడిషన్స్ అంటే ఇలాగే ఉంటాయని అనుకున్నాం.. శారీ కట్టుకుని రమ్మని చెబితే సరేనని అది కూడా చేశా. ఇంతలో కొంచెం మీ నడుము చూపిస్తారా అని అడిగాడు. దాంతో నువ్వు లేరా.. చెప్పు తీసుకుని కొడతా బయటకు పో అని గెంటేశా. అతను ఇంట్లో ఎవరూ లేరు అనుకున్నాడా? ఎక్కడి నుంచి నా నెంబర్ సంపాదించాడో ఏంటో? తలుపులేసి నన్ను ఏమైనా చేసుంటే, ఇంట్లో ముగ్గురం ఆడవాళ్లం మాత్రమే ఉన్నాం. ఆ దెబ్బకి భయపడిపోయా అని మిర్చి మాధవి ఆ ఘటన గురించి చెప్పారు.
మేం ఐదుగురుం ఉన్నాం అంటూ
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నన్ను నేను కాపాడుకోగలను. వెంటనే బుర్రలో తట్టి వాడిని గెంటేసి తలుపులు వేసేశా. తర్వాత ఒకసారి ఒకతను ఫోన్ చేసి ప్రకాశ్‌రాజ్ గారి పక్కన వైఫ్ క్యారెక్టర్.. మీరు ఒక ఐదుగురు ఉంటారు కాంప్రమైజ్ అవుతానంటే అన్నాడు. నాకు కొంచెం తెలివిలేనితనం. అతని పేరు భాస్కర్... మనిషి తెలియదు నాకు. ఎదురుగా చూడలేదు.. ఇదంతా ఫోన్‌లోనే జరిగింది. 100 పర్సెంట్ లవ్‌లో మీరేం చేశారో మాకు తెలుసు అన్నాడు. అయితే మీరు వాళ్లతో నాకు ఫోన్ చేయించండి అన్నాను.. అప్పటికీ నాకు అర్ధమైపోయింది. చూసుకోండి మరి మంచి అవకాశం అని అన్నాడు. అది కాకపోతే ఇంకో ఆఫర్ వస్తుంది సారీ అని చెప్పేశా. ఆ తర్వాత ఇంకెప్పుడూ అలాంటి కాల్స్ రాలేదని మిర్చి మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమెను వేధించిన ఆ దర్శకుడు ఎవరు? అనేది మాత్రం తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











