బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఎంతో చెప్పిన అవినాష్: అప్పుడు ఇంటి నుంచి దూకేద్దామనుకున్నానంటూ!
ముక్కు అవినాష్... తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరిది. దాదాపు నాలుగైదేళ్లుగా జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా తనదైన శైలి హాస్యంతో మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. షోలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపును అందుకుని సత్తా చాటాడు. తద్వారా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో విజేత కాకున్నా పేరు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో అవినాష్.. బిగ్ బాస్ షోలో తనకు ఇచ్చిన రెమ్యూనరేషన్‌ను బయట పెట్టాడు. ఆ వివరాలు మీకోసం!

మిమిక్రీ ఆర్టిస్టుగా ప్రవేశం.. అలా ప్రమోషన్
మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించాడు అవినాష్. ఆ సమయంలోనే కొంత మంది హీరోలను ఇమిటేట్ చేస్తూ మంచి పేరును తెచ్చుకున్నాడు. ఇలా సుపరిచితుడు అవడంతో జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ షోలో మొదట కొన్ని టీమ్‌లలో ఆర్టిస్టుగా పని చేశాడు. ఆ సమయంలోనే తనలోని టాలెంట్లను బయట పెట్టాడు. దీంతో నిర్వహకులు అతడికి లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు.

బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ.. బెస్ట్ ఎంటర్‌టైనర్
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ముక్కు అవినాష్. తనను తాను జోకర్‌గా పరిచయం చేసుకుంటూ హౌస్‌లోకి ప్రవేశించిన అతడు.. ఆ పేరుకు సార్థకం చేస్తూ కామెడీని పంచాడు. నవ్వుతూ నవ్విస్తూ.. ఏడిపిస్తూ.. ఆటపట్టిస్తూ అల్లరి చిల్లరగా తిరిగేవాడు. ఇలా ఉన్నన్ని రోజులూ తన మార్క్ చూపించే ప్రయత్నం చేసి బెస్ట్ ఎంటర్‌టైనర్ అన్న బిరుదు తెచ్చుకున్నాడు.

అన్ని రకాల షేడ్స్... ఆ యాంగిల్‌తో చిక్కు
బజర్ధస్త్‌లో కమెడియన్‌గానే తెలిసిన ముక్కు అవినాష్.. బిగ్ బాస్ షోలో మాత్రం తనలోని అన్ని యాంగిల్స్ చూపించాడు. మరీ ముఖ్యంగా ఆరియానా గ్లోరీతో ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించి షాకిచ్చాడు. అలాగే, కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోపంతో కనిపించాడు. వీటితో పాటు సింపతీ కోసం కొన్ని ట్రిక్స్ ప్లే చేసి విమర్శల పాలయ్యాడు. తద్వారా ఎలిమినేట్ కూడా అయ్యాడు.

జబర్ధస్త్‌ను వీడడం వెనుక సీక్రెట్ లీక్ చేసి
బిగ్ బాస్ షోలో ఆఫర్ రావడంతో జబర్ధస్త్‌ను వీడాల్సి వచ్చిందని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు ముక్కు అవినాష్. అంతేకాదు, ఆ షో నుంచి బయటకు వచ్చే సమయంలో తన నుంచి రూ. 10 లక్షలు వసూలు చేశారని కూడా లీక్ చేశాడు. అలాంటి క్లిష్ట సమయంలో యాంకర్ శ్రీముఖి, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్రలు అండగా నిలిచి, డబ్బు సహాయం చేశారని చెప్పాడు.

ఇంటి నుంచి దూకేద్దామనుకున్నానంటూ
తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను బయట పెట్టాడు అవినాష్. ‘కొన్ని రోజుల క్రితం ఫ్లాట్ కొన్నాను. అప్పుడే అమ్మానాన్నకు ఆపరేషన్ చేయించాను. వీటి వల్ల ఆర్థికంగా చాలా భారం పడిపోయింది. లాక్‌డౌన్ సమయంలో డబ్బులు సరిగా ఉండేవి కాదు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకానొక సందర్భంలో కొత్త ఇంటి మీద నుంచి దూకేద్దాం అనుకున్నా' అని తెలిపాడు.

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఎంతో చెప్పేశాడు
ఈ ఇంటర్వ్యూలోనే బిగ్ బాస్ రెమ్యూనరేషన్ గురించి వెల్లడించాడు. ‘బిగ్ బాస్ వాళ్లు జనవరి నుంచి వరుసగా ఫోన్లు చేశారు. అప్పుడే నా ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో ఓకే చెప్పాను. ఈ షోలోకి వెళ్లడం వల్ల జబర్ధస్త్ కోసం చేసిన రూ. 10 లక్షలతో పాటు నా అప్పులన్నీ తీరిపోయాయి. షోలోకి వెళ్లడం వల్ల పేరుతో పాటు డబ్బు వచ్చింది. బిగ్ బాస్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను' అని చెప్పాడు. దీంతో అతడు రూ. 40 లక్షల వరకు తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











