యాంకర్ శివజ్యోతికి కోట్లలో ఆస్తులా?.. నా అన్వేషణ సంచలన ఆరోపణలు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన నటీనటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను తెలంగాణ పోలీసులు టార్గెట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మంది వరకు సెలబ్రెటీల పేర్లు బయటికొచ్చాయి. కొందరికీ పోలీసులు నోటీసులిచ్చి విచారణకు పిలుస్తున్నారు. యాంకర్ విష్ణుప్రియ, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరిలు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్, తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు యూట్యూబర్ అన్వేష్. ఈ వివరాల్లోకి వెళితే..
విశాఖ ప్రాంతానికి చెందిన అన్వేష్.. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. ప్రపంచంలోని పలు దేశాలలో టూర్లు చేస్తూ అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు, ఆహారం, జీవన విధానాలు, వింతలు, విడ్డూరాలను పంచుకుంటున్నాడు. ఉత్తరాంధ్ర యాసలో అన్వేష్ తన వీడియోను ప్రజెంట్ చేసే తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇతని యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ఖాతాకు కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు. నెలకు లక్షల్లో సంపాదిస్తూ.. తన సంపాదన తాలూకా వివరాలను పంచుకుంటూ ఉంటాడు అవినాష్.

గత కొంతకాలంగా అన్వేష్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. బెట్టింగ్ యాప్‌ల కారణంగా అమాయకులు బలైపోతున్నారని, వారికి అండగా నిలుస్తానంటూ పోరాటం మొదలుపెట్టాడు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలు, యూట్యూబర్లను టార్గెట్ చేస్తూ రోజుకొకరి బండారం గురించి బయటపెడుతున్నాడు. లోకల్ బాయ్ నాని మొదలుకుని, కమెడియన్ అలీ వరకు ఒక్కొక్కరి గురించి చెబుతున్నాడు అన్వేష్. బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోట్ చేసిన వారి వివరాలు చెబుతూ ఫాలోయింగ్‌ను, వ్యూస్‌ను పెంచుకుంటున్న అన్వేష్ ఈ వీడియోలకు మంచి వ్యూయర్‌షిప్‌తో పాటు లక్షల్లో సంపాదిస్తున్నాడు.
ఈ బెట్టింగ్ యాప్‌లపై తాను చేస్తున్న వీడియోలకు వచ్చిన డబ్బుని , బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయారో వారికే ఇచ్చేస్తానని అనౌన్స్ చేసి కలకలం రేపాడు అన్వేష్. ఈ వీడియోస్ వల్ల దాదాపు రూ.60 లక్షల వరకు వస్తాయని ఈ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు చెందేలా చేస్తానని హామీ ఇచ్చాడు. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రిపై అన్వేష్ వీడియో చేశాడు. తెలుగు న్యూస్ ఛానెల్‌లో ప్రసారమైన తీన్మార్ వార్తలతో ఫేమస్ అయిన శివజ్యోతి తర్వాత పలు ఛానెల్స్‌లో యాంకర్‌గా చేసింది. ఇదే ఫేమ్‌తో బిగ్‌బాస్‌లో అవకాశం దక్కించుకుని మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం యాంకరింగ్‌ను పూర్తిగా పక్కనపెట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు పెడుతోంది.
అలాంటి శివజ్యోతిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు అన్వేష్. ఒకప్పుడు నెలకు రూ.8 వేల వేతనానికి ఉద్యోగం చేసిన శివజ్యోతికి ఇప్పుడు హైదరాబాద్‌లో రూ.5 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్, లగ్జరీ కారు, సొంతూరిలో హైవే పక్కన 10 ఎకరాల విలువైన స్థలం ఉందని ఆరోపించాడు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ద్వారా శివజ్యోతక్క కోట్లు సంపాదించిందని అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతోనే తన భర్తతో కలిసి ఫారిన్ ట్రిప్‌కు వెళ్లిందని ఆరోపించాడు అన్వేష్. బెట్టింగ్ యాప్ వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. శివజ్యోతి మాత్రం జల్సా చేస్తోందని మండిపడ్డాడు. ఇలాంటి పనులను జ్యోతక్క మానేయాలని హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా శివజ్యోతి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











