మృత్యువుతో యుద్ధం చేస్తుంటే మీరేంటి ఇలా.. వారిని తన్నాల్సిందే.. నాగబాబు ఫైర్
కరోనావైరస్ పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు, పోలీసులకు, వైద్య సిబ్బందికి నటుడు నాగబాబు సంఘీభావం తెలిపారు. సిరియా, ఇతర దేశాల్లో తిండి కూడా పెట్టలేని పరిస్థితులు ఉంటే మన ప్రభుత్వాలు ప్రజలకు ఆహారం, డబ్బు అందిస్తున్నాయి. అలా కరోనావైరస్‌పై పోరాటం చేస్తుంటే కొందరు రోడ్ల మీదకు వచ్చి నానా రభస చేస్తున్నారు. ఇలాంటి విషయాలను మనం సీరియస్‌గా పరిగణించాలి అని నాగబాబు అన్నారు. సోషల్ మీడియాలో లైవ్‌లో మాట్లాడుతూ..

జనం కోసమే పోలీసులు అలా
కరోనా మహమ్మారి వెంటాడుతున్న సమయంలో పోలీసుల చేస్తున్న సేవ అత్యంత ప్రశంసనీయం. వారు కొడుతున్నారనే విషయాన్ని అంతగా పట్టించుకోవద్దు. ఎందుకంటే, జనం బతకాలనే వారు అలా వ్యవహరిస్తున్నారు. వారికి ప్రజలంటే కోపం కాదు. ప్రజలు వైరస్ బారిన పడకుండా వారిని మంచిగా మందలిస్తున్నారు. కఠినంగాను శిక్షిస్తున్నారు. లేకపోతే ప్రజలను కంట్రోల్ చేయడం చాలా కష్టం అని నాగబాబు అన్నారు.

రైతులకు, మెడికల్ అవసరాలకు
రైతులను, మెడికల్ అవసరాలు ఉంటే తప్ప మిగితా వారెవరైనా బయటకు వస్తే కొట్టాల్సిందే. లేకపోతే కొత్తిమీర కట్టకని, ఆశీర్వాద్ పిండి అంటూ మరొకడు బయటకు వస్తుంటారు. కొన్నిసార్లు పోలీసులు తప్పిదాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. కాకపోతే వారు చేసేది మనకోసమే అని నాగబాబు అన్నారు.

తప్పుడు పద్ధతిలో రోడ్లపైకి
కరోనా పరిస్థితులను ఎదుర్కోవడం ప్రభుత్వాలకు కొత్త. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సాధ్యమైనంత మేరకు గట్టిగా శ్రద్దగా తీసుకోవాల్సిందే. కొందరు తప్పుడు పద్దతిలో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాలకు తలనొప్పిగా మారుతున్నారు. అలాంటి వారిని కొట్టడంలో ఎలాంటి తప్పు కనిపించదు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ చాలా బాగా పనిచేస్తున్నారు అని నాగబాబు అభిప్రాయపడ్డారు.
Recommended Video

శతృత్వం పెంచుకోవద్దని
ప్రస్తుత పరిస్థితుల్లోగానీ, ఎలాంటి పరిస్థితుల్లో శత్రుత్వాలతో సాధించేది ఏమి లేదు. శత్రుత్వం పెంచుకొంటే మనమే నాశనం అవుతాం. కాబట్టి విభేదాలను పక్కన పెట్టి అంతా కలిసి కట్టుగా వ్యవహరించాలి. ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్లకు, పోలీసులకు సంఘీభావం ప్రకటించాలి అని నాగబాబు తెలిపారు. మృత్యువుతో యుద్ధం చేస్తూ మనను కాపాడే వాళ్లకు మనం సంఘీభావం ప్రకటించాలన్నారు. కనిపించని దేవుడికా కాకుండా కనిపించని వైద్యులకు దండం పెట్టాలి అని నాగబాబు అన్నారు.


Click it and Unblock the Notifications











