Television ratings: తమన్నా షో దారుణంగా.. ఆకట్టుకోలేకపోతున్న బిగ్‌బాస్.. మెరుగుపడని ఎన్టీఆర్ షో రేటింగ్!
బుల్లితెర మీద స్టార్ హీరోలు, హీరోయిన్ల రియాలిటీ షోలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నాయనే విషయం తాజాగా విడుదలైన రేటింగ్‌లు స్పష్టం చేశాయి. కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ స్టార్ మా ఛానెల్‌లో, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా మీలో ఎవరు కోటీశ్వరులు జెమిని ఛానెల్‌లో, అలాగే తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు షోలు కూడా పెద్దగా రేటింగును పెంచుకొన్న విషయం ప్రస్తుతం సంవత్సరంలోని 39వ వారంలో స్పష్టమైంది. ఈ స్టార్ షోలు ఎలాంటి రేటింగ్‌ను సొంతం చేసుకొన్నాయంటే...

టాప్ తెలుగు టెలివిజన్ ఛానెల్స్
తెలుగు టెలివిజన్ ఛానెల్స్ రేటింగ్ విషయానికి వస్తే.. స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ టాప్ రేసులో దూసుకెళ్తున్నాయి. బిగ్‌బాస్, కార్తీకదీపం, ఇంటింటి గృహలక్ష్మీ, గుప్పెడంత మనసు, జానకి కలగనలేదు లాంటి సీరియల్స్ ప్రసారం చేస్తున్న స్టార్ మా ఛానెల్ 39వ వారంలో అత్యధికంగా అర్బన్ ప్రాంతంలో 921, రూరల్ ప్రాంతంలో 979 రేటింగ్‌తో టాప్ పొజిషన్‌లో ఉంది. ఇక రెండోస్థానంలో జీ తెలుగు.. 39వ వారంలో అర్బన్ ప్రాంతంలో547 పాయింట్లతో, అలాగే రూరల్‌లో 749 పాయింట్లను నమోదు చేసుకొన్నది. మూడోస్థానంలో ఈటీవీ తెలుగు 438 (అర్బన్), 481 (రూరల్) రేటింగుతో, జెమినీ 320 (అర్బన్), 405 (రూరల్) రేటింగుతో నాలుగో స్థానంలో నిలిచింది.

ఆకట్టుకోలేకపోయిన తమన్నా భాటియా
ఆకట్టుకోలేకపోయిన తమన్నా భాటియా
భారతీయ సినిమా పరిశ్రమలో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకొన్న తమన్నా భాటియా ప్రస్తుతం జెమినీ టెలివిజన్‌లో మాస్టర్ చెఫ్ అనే షోను అట్టహాసంగా, చాలా క్వాలిటీతో వంటల కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు శుక్ర, శనివారాల్లో ప్రసారమవుతున్న ఈ షో ద్వారా తమన్నా భాటియా ప్రేక్షకులను టెలివిజన్లకు హత్తుకుపోయేలా షోను నిర్వహించలేకపోయిందనే విమర్శ కూడా వచ్చింది. అయితే తాజాగా ఈ 39వ వారంలో అర్బన్ ప్రాంతంలో 1.81 రేటింగ్, అలాగే రూరల్‌లో 1.38 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. 38వ వారంలో అర్బన్‌లో 2.23, రూరల్‌లో 1.49 రేటింగ్‌ను సొంతం చేసుకోవడం తెలిసిందే.

వారం వారం పడిపోతున్న బిగ్‌బాస్ తెలుగు 5
ఇక బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ విషయానికి వస్తే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేకపోవడంతో రేటింగ్ ప్రతీ వారం క్షీణిస్తూనే వస్తున్నది. అర్బన్ ప్రాంతంలో 38వ వారంలో 5.76 రేటింగ్ సాధిస్తే.. 39వ వారంలో 5.48 రేటింగ్‌ను నమోదు చేసింది. ఇక రూరల్ ప్రాంతంలో 38వ వారంలో 3.27 రేటింగ్ సాధిస్తే.. 39వ వారంలో 3.20 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది.

వారాంతంలో నాగార్జున ఎపిసోడ్స్ పరిస్థితి కూడా అంతే..
ఇక బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో శని, ఆదివారం నాడు హోస్ట్ నాగార్జున వచ్చి సందడి చేయడం తెలిసిందే. అయితే నాగ్ వచ్చిన వారాంతపు ఎపిసోడ్స్ కూడా పెద్దగా రేటింగ్ రాబట్టలేకపోతున్నట్టు తాజా డేటాలో స్పష్టమైంది. 38వ వారంలో అర్బన్ ప్రాంతంలో 9.84 రేటింగ్ సొంతం చేసుకోగా, 39వ వారంలో 5.48 రేటింగ్‌ను సాధించింది. ఇక రూరల్ ప్రాంతానికి వస్తే.. 38వ వారంలో 3.27 రేటింగ్ నమోదు చేయగా. 39వ వారంలో 3.27 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఈ షో రేటింగ్ విషయంలో క్రమంగా క్షీణించడం కాస్త ఆందోళన కలిగించే విషయమే.

మెరుగుపడని ఎన్టీఆర్ షో రేటింగ్
ఇక ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కూడా అంతంత మాత్రంగానే ప్రేక్షకదారణను సొంతం చేసుకొన్నట్టు తాజా డేటాలో స్పష్టమైంది. అట్టహాసంగా ప్రారంభమై.. రాంచరణ్, రాజమౌళి, కొరటాల శివ లాంటి సెలబ్రిటీలతో హల్‌చల్ చేసినప్పటికీ.. ఈ షో టాప్ గేర్‌లో దూసుకుపోలేకపోయింది. 38వ వారంలో అర్బన్ ప్రాంతంలో ఈ షో 4.70 రేటింగ్‌ను సొంతం చేసుకొంటే.. 39వ వారంలో 4.00 రేటింగ్‌ను సాధించింది. అలాగే రూరల్ విషయానికి వస్తే.. 38వ వారం 2.71 రేటింగ్‌తో సరిపెట్టుకొంటే.. 39వ వారంలో అంతకంటే తక్కువగా 2.42 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. అయితే ఈ షో గురించి సరైన ప్రమోషన్ జరగకపోవడమే ప్రధాన కారణమనే విమర్శ వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











