బిగ్ బాస్‌పై నోయల్ సంచలన వ్యాఖ్యలు: హౌస్‌లోకి వెళ్లి అంత మాట అనడంతో అందరూ షాక్!
సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించి తెలుగు బుల్లితెరతో పాటు వెండితెరపై తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు రాక్ స్టార్ నోయల్ సీన్. ర్యాపర్‌గా, లిరిసిస్ట్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తనలోని టాలెంట్లను నిరూపించుకున్న అతడు.. యాక్టర్‌గానూ సత్తా చాటాడు. వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోన్న సమయంలో బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. చాలా రోజుల పాటు మంచి ఆటతో పేరు తెచ్చుకున్న అతడు.. ఊహించని విధంగా బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత షోపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా మరోసారి హౌస్‌లోకి వెళ్లిన అతడు.. బిగ్ బాస్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు షాకిస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం!

టైటిల్ ఫేవరెట్‌గా బరిలో నిలిచిన నోయల్
అంగరంగ వైభవంగా జరిగిన బిగ్ బాస్ ప్రీమియర్ ఎపిసోడ్‌లో ర్యాప్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చాడు నోయల్ సీన్. రావడం రావడంతో హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరిలోనూ జోష్‌ను నింపిన అతడు.. నాలుగో సీజన్‌కు టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా నిలిచాడు. ప్రతీ సందర్భంలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోయాడు. దీంతో టాప్ -5లో అతడు కచ్చితంగా ఉంటాడన్న టాక్ బాగా వినిపించింది.

టాస్కుల్లో సత్తా.. మంచోడిగా పేరొందాడు
బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో వందకు వంద శాతం శ్రమను చూపించాడు నోయల్ సీన్. అంతేకాదు, షోలో జరగబోయే విషయాలను ముందే గ్రహించి అందరినీ అలెర్ట్ చేసేవాడు. ఈ కారణంగానే మొదట్లో అతడు హాట్ టాపిక్ అయ్యాడు. అదే సమయంలో అందరితోనూ మంచిగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే మంచోడిగా పేరు సంపాదించుకున్నాడు. తద్వారా పలుమార్లు సేఫ్ అయ్యాడు.

ఊహించని విధంగా షో నుంచి బయటకు
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అనారోగ్యంతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు నోయల్. అయినప్పటికీ చాలా రోజుల పాటు అలాగే షోలో కొనసాగాడు. కానీ, పరిస్థితి చేయిదాటి పోవడంతో మెరుగైన వైద్యం కోసం బయటకు వెళ్లాల్సిందేనని డాక్టర్లు సూచించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో షో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. దీంతో నోయల్‌కు సరైన వీడ్కోలు పలికింది బిగ్ బాస్ యూనిట్.

బిగ్ బాస్‌పై నోయల్ సంచలన వ్యాఖ్యలు
షో నుంచి బయటకు వచ్చాక రీఎంట్రీ ఇవ్వబోతున్నానని పలుమార్లు చెప్పాడు నోయల్. కానీ, అలా జరగలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసి తన ఆగ్రహాన్ని, ఆవేదననూ వెల్లగక్కాడు. ‘అసలు బిగ్ బాస్‌కు ఎందుకెళ్లానో అర్థం కావట్లేదు. ఆ షో మనకి అవసరమే కాదు. బయటికొచ్చాక అది చూడడమే మానేశాను' అంటూ కామెంట్లు చేసి హాట్ టాపిక్ అయ్యాడు.

వాళ్లిద్దరికి సపోర్ట్ చేసి... ఓట్లు వేయించి
బిగ్ బాస్ హౌస్ నుంచి వస్తున్న సమయంలో తన స్నేహితులైన లాస్య మంజునాథ్, దేత్తడి హారిక, అభిజీత్‌లకు సపోర్ట్ చేస్తానని చెప్పాడు నోయల్. అంతేకాదు, వీళ్లు ముగ్గురూ టాప్-5లో ఉండేలా చూసుకుంటానన్నాడు. అందుకు తగ్గట్లుగానే వాళ్లు మద్దతిచ్చి, తన ఫ్యాన్స్‌తో ఓట్లు వేయించాడు. లాస్య ఎలిమినేట్ అయ్యాక.. అభి, హారికకు ప్రధాన్యం ఇచ్చి ఫినాలేకు చేరడంలో భాగమయ్యాడు.

షోలో అంత మాటనడంతో అందరూ షాక్
బిగ్ బాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో నోయల్.. రీయూనియన్ పార్టీకి రాడని అంతా అనుకున్నారు. కానీ, శనివారం అతడు అదిరిపోయే ర్యాప్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, ‘నాకు ఈ అవకాశం ఇచ్చిన బిగ్ బాస్‌కు థ్యాంక్స్. నాకిష్టమైన ప్లేస్‌కు మళ్లీ వచ్చినందుకు సంతోషంగా ఉంది. నిరాశ పరిచినందుకు క్షమించండి' అంటూ చెప్పడం ప్రేక్షకులందరినీ షాక్‌కు గురి చేసింది.


Click it and Unblock the Notifications











