'పాడుతా తీయగా' అమెరికా ఎపిసోడ్ ప్రసారం వివరాలు

కేంద్ర సహాయ మంత్రి(స్వతంత్ర) చిరంజీవి చేతుల మీదుగా మే 25న డల్లాస్‌లోని తానా కన్వెన్షన్ సెంటర్‌లో ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సారథ్యంలో ఈ కార్యక్రమం మొదలైంది. సుమారు వెయ్యి మందిని ఆడిషన్ చేసి 19 మంది గాయనీ గాయకుల్ని పోటీకి ఎంపిక చేశారు. పీపుల్ టెక్ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) అధ్యక్షుడు (అప్పటి) తోటకూర ప్రసాద్, ఈటీవీ-తెలుగు ఛానెల్ ఉపాధ్యక్షుడు బాపినీడు, విశ్వప్రసాద్ తదితరులు కార్యక్రమ ప్రారంభంలో పాల్గొన్నారు. ఆ తర్వాత జూన్ 1 నుంచి న్యూయార్క్‌లో ప్రాథమిక పోటీలు జరిగాయి.
అలా మొదలైన ఈ సంగీతఝరిలో జూన్ 22న లాంగ్‌బీచ్, కేలబస్‌లో క్వార్టర్ ఫైనల్స్ జరిగాయి. జూన్ 29, 30 తేదీల్లో హ్యూస్టన్‌లో సెమీఫైనల్స్‌ని నిర్వహించారు. డల్లాస్‌లోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) సంబరాల వేదికపై జులై 6న మెగా ఫైనల్స్ పోటీలు జరిగాయి. వేలమంది ప్రేక్షకుల సమక్షంలో నువ్వానేనా అన్నట్లు జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహుతుల్ని ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో వివిధ దశల్లో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, గీత రచయితలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, డా||వడ్డేపల్లి కృష్ణ, అనంత్ శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, నటి లయ, గాయనీమణులు ఉష, సునీత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పోటీదారులకు విలువైన సూచనలు ఇస్తూ వారిని ప్రోత్సహించారు. ఇలా అనేక ప్రాంతాల్లో జరిగిన ఈ స్వర సంగ్రామం నేటి నుంచి ప్రతి సోమవారం ఈటీవీలో రాత్రి 9.30కి ప్రసారమవుతుంది.


Click it and Unblock the Notifications











