Patas Praveen Marriage: ప్రియురాలితో పటాస్ ప్రవీణ్ పెళ్లి.. ఫైమా ఎమోషనల్ పోస్ట్
జబర్దస్త్, పటాస్ సహా పలు కార్యక్రమాలతో తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ పటాస్ ప్రవీణ్ ఓ ఇంటి వాడయ్యాడు. గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న డ్యాన్సర్ వంశిత మెడలో ప్రవీణ్ మూడు ముళ్లు వేశాడు. వీరి వివాహానికి బంధువులు, సన్నిహితులు, పలువురు బుల్లితెర ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. తన స్నేహితుడు పటాస్ ప్రవీణ్ పెళ్లి సందర్బంగా ఫైమా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే...
ఈటీవీలో ప్రసారమైన పటాస్ కామెడీ షో ద్వారా పవీణ్ పాపులర్ అయ్యాడు. తన స్కిట్స్, కామెడీ టైమింగ్స్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అక్కడే ప్రవీణ్‌కు ఫైమా పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ జంటగా పలు స్కిట్‌లు చేశారు. ఈ జంటకు ప్రేక్షకులకు బ్రహ్మరథం పట్టడంతో స్టార్ కామెడీ షో జబర్దస్త్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు నిర్వాహకులు. జబర్దస్త్‌లోనూ ఈ జోడీ సూపర్ హిట్ అయ్యింది. అందరు టీమ్ లీడర్స్‌తోనూ వీరిద్దరూ పనిచేసి ప్రేక్షకులను కడుపబ్బా నవ్వించారు.

జబర్దస్త్ తర్వాత ప్రవీణ్, ఫైమాలకు శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ అవకాశం దక్కింది. ఇద్దరూ సెలబ్రిటీలుగా మారిపోయారు. బుల్లితెరపై పలు షోలతో పాటు ప్రైవేట్ ఈవెంట్స్, సినిమాలలో చిన్నా చితకా పాత్రలతో వీరిద్దరూ బాగానే స్థిరపడ్డారు. అలాగే యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభించి మంచి వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ అటు నుంచి కూడా ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రవీణ్- ఫైమాలు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి.
అయితే ప్రవీణ్ కంటే ముందే ఫైమాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు కూడా ప్రవీణ్ కావడంతో జనం కన్‌ఫ్యూజ్ అయ్యారు. అయితే ఫైమా ఆలస్యంగా నైనా తన రియల్ లవర్ ప్రవీణ్‌ను పరిచయం చేసింది. తనకు కొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయని త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. అయితే బిగ్‌బాస్‌కి వెళ్లొచ్చిన తర్వాత ఫైమా- ప్రవీణ్‌ల మధ్య గ్యాప్ వచ్చింది. తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసింది లేదు. దాంతో ప్రవీణ్- ఫైమాలపై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి
ఇక ప్రవీణ్ విషయానికి వస్తే... ఫైమాతో మధ్యలో విభేదాలు వచ్చినప్పటికీ తను మాత్రం కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు. ప్రవీణ్‌కు చిన్నప్పుడే తల్లి చనిపోగా.. తండ్రి అల్లారుముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. అయితే కొద్దినెలల క్రితం బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ ప్రవీణ్ తండ్రి కన్నుమూశారు. దాంతో తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోవడంతో అతను అనాథలా మిగిలాడు. ఈ సమయంలో జబర్దస్త్ నటులు, సన్నిహితులు ప్రవీణ్‌కు అండగా నిలిచారు.
ఈ క్రమంలో డ్యాన్సర్ వంశితతో ప్రేమలో పడిన ప్రవీణ్ ఇటీవల ఆమెతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సింపుల్‌గా జరిగింది. తాజాగా శనివారం వంశితను పెళ్లాడారు ప్రవీణ్. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ - వంశితలకు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా తన ఫ్రెండ్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కావడంతో ఫైమా ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయింది. అయినప్పటికీ వీడియో కాల్ చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పింది. అలాగే హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా ప్రవీణ్ అంటూ పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications



