బిగ్ బాస్ వివాదం: స్టార్ మాటీవీ యాజమాన్యానికి నోటీసులు!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో మొదలు కావడానికి ముందే పలు వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఎంపిక విధానంపై విమర్శలు వచ్చాయి. అగ్రిమెంట్ పూర్తయి సంతకాలు చేయించుకున్న తర్వాత కొందరికి చోటు లేదని చెప్పడం, ఒక వేళ మిమ్మల్ని షోలోకి తీసుకోవాలంటే బాస్‌ను సంతృప్తి పరచాలి అంటూ కో ఆర్డినేటర్లు అసభ్యంగా ప్రవర్తించడంతో జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, గాయిత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరో వైపు ఈ షోపై దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఈ రియాల్టీ షో యువతను చెడుతోవ పట్టించే విధంగా ఉందని, దీన్ని నిలిపి వేయడం లేదా రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేయడం లాంటివి చేయాలని కోరారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. స్టార్ మా టీవీ కార్యాలయానికి నోటీసులు పంపారు. అగ్రిమెంట్ వ్యవహారం, ఎంపిక విధానం, నిబంధనలు, బిగ్ బాస్ రియాల్టీ షోలో రఘు, శ్యాం, రవికాంత్ పాత్ర ఏమిటి? అనే అంశాల్లో వివరణ ఇవ్వాలని కోరారు. ఈ నోటీసులపై రెండు రోజుల్లో క్లారిఫికేషన్ ఇస్తామని ఛానల్ హెడ్ శ్రీధర్ పోలీసులకు తెలిపారు.
కాగా...ఈ వివాదాలు ఉన్నప్పటికీ బిగ్ బాస్ షో ఎలాంటి ఆటంకం లేకుండా ఆదివారం ప్రారంభం అయింది. కంటెస్టెంట్లుగా వి6 సావిత్రి(శివజ్యోతి), రవికృష్ణ, అషురెడ్డి, జాఫర్, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, హేమ, అలీరెజా, మహేష్ విట్టా, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షేరు ఎంటరయ్యారు.


Click it and Unblock the Notifications











