Brahmamudi December 1st: కావ్యను, రాజ్‌ను విడగొట్టేందుకు రాహుల్ కొత్త ప్లాన్.. అప్పు ప్రేమ కోసం కనకం పాట్లు
స్వప్నను రుద్రాణి ఇంట్లోంచి గెంటివేయబోతుంటే స్వప్న నిజం నిరూపించి నన్ను బయటకు పంపమని చెప్తుంది. ఇంతలో కావ్య కలుగజేసుకుని ఆడదాన్ని శీలపరీక్ష చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తుంది. దుగ్గిరాల వంశ గొప్పదనం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇంకా ఎన్నాళ్లు ఆడది అగ్ని పునీత అని నిరూపించుకోవాలని కావ్య దుగ్గిరాల ఇంటి వాళ్లను ప్రశ్నిస్తుంది. ఆడదానికి వ్యక్తిత్వం ఉండదా? గౌరవం ఉండదా? ఆత్మగౌరవం ఉండదా? అంటూ కావ్య ఆవేదన చెందుతుంది.
స్వప్నకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించడానికి నేను ఒప్పుకోను అని కావ్య చెప్తుంది. ఇంతలో రుద్రాణి కలగజేసుకుని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తుంది. ఎస్ నీ ఉపాన్యాసాలు, నీ ఉపోద్ఘాతాలు, స్త్రీ జన ఉద్దరణ కోసం నువ్వు మొదలు పెట్టిన అభ్యుదయాలు ఈ పనికి రాని మాటలు మీ అక్క తప్పును ఒప్పుగా మార్చలేవని చెప్తుంది. ఇప్పుడు ఈ కాలంలో ఇలాంటి తప్పుడు పని చేసిన ఆడదానికి శీల పరీక్ష జరిగి తీరాల్సిందే అని తేల్చుతుంది.

అది జరగాలంటే డీఎన్‌ఏ టెస్ట్ జరగాల్సిందే అని రుద్రాణి చెప్తుంది. నువ్వేందుకు డీఎన్‌ఏ టెస్టు వద్దంటున్నావో నాకు తెలుసు.. ఎక్కడ మీ అక్క నిజం ఒప్పుకుంటుందోనని నువ్వు ముందే టెస్ట్ వద్దంటున్నావు అని మరో నింద వేస్తుంది. అత్తయ్య గారు ఆ భయం నా చెల్లికి ఉండొచ్చేమో కానీ నాకు ఏ భయం లేదని స్వప్న చెప్తుంది. మీరు తెలివిగానో తెలివి తక్కువగానో నా దారిలోకే వచ్చారు. ఎస్.. డీఎన్‌ఏ పరీక్షకి నేను మొదటి నుంచి సిద్దంగానే ఉన్నానని స్వప్న అంటుంది.
నేను తప్పు చేయలేదని రుజువైతే మీరు ఏం చేస్తారని స్వప్న నిలదీస్తుంది. నువ్వు తప్పు చేయలేదని తెలిస్తే నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటానని రుద్రాణి అంటుంది. ఒకవేళ తప్పు చేసినట్లు రుజువైతే నువ్వేం చేస్తావు అంటూ రుద్రాణి, స్వప్నను ప్రశ్నిస్తుంది. దానికి స్వప్న బదులిస్తూ... అదే నిజమైతే నేనే విడాకులు తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతానంటుంది. కావ్య బాధగా ఈ ఇంట్లో మీరున్నా కూడా ఇలాంటివి ఎందుకని జరగనిస్తున్నారని ఇందిరాదేవిని అడుగుతుంది. వాళ్లకు వాళ్లు బేరసారాలు ఆడుకున్నాక మనం ప్రేక్షకపాత్ర వహించక తప్పదని కావ్యకు చెప్తుంది ఇందిరాదేవి. దీంతో రుద్రాణి, రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
గదిలోపలకి వెళ్లి రాహుల్, రుద్రాణి మాట్లాడుకుంటారు. మామ్ ఎందుకలా ఒప్పుకున్నావ్... అని ఫైర్ అవుతాడు రాహుల్. ఇంకో దారి లేదు అని రుద్రాణి అంటుంది. ఇక ఆ కావ్య నిజం బయట పెట్టి తిరిగి ఆ స్వప్నను నా నెత్తిన కూర్చోబెట్టేవరకు వదలదని రాహుల్ అంటాడు. కావ్య ఎంత ప్రయత్నించినా స్వప్నను కాపాడకుండా చేసే బాధ్యత నాది అంటూ రుద్రాణి రాహుల్ కు చెప్తుంది. మరోవైపు కనకం దుగ్గిరాల ఇంటికి పోయేందుకు ప్రయత్నం మొదలు పెడుతుంది. ఇంతలో మూర్తి వస్తాడు. స్వప్న కడుపుతో ఉంది ఆ ఇంటికి వెళ్తాను అని చెప్తుంది.
కానీ మూర్తి నమ్మడు.. ఆ నాటకం పోయిన వారమే అయిపోయింది కదా అని చెప్తాడు. నిజంగానే ఉందట అని కనకం చెప్తుంది. సరే అయినా నువ్వు వెళ్లొద్దు అని చెప్తాడు. మరోవైపు స్వప్న చేసిన పనికి కావ్య క్లాస్ తీసుకుంటుంది. ఎందుకు డీఎన్ఏ టెస్టుకు ఒప్పుకున్నావ్ అని ప్రశ్నిస్తుంది. ఏం చేయాలి మరి ఇంకో దారి లేదు కదా అని స్వప్న చెప్తుంది. సరే నేను అరుణ్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని కావ్య చెప్పి వెళ్తుంది.

రాజ్ హాల్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటే.. రాహుల్ కిందకు వస్తూ.. నేను నా పెళ్లాన్ని వదులుకుంటే నువ్వు నీ పెళ్లాన్ని వదులుకునేటట్లు చేస్తాను అని మనసులో అనుకుని వచ్చి రాజ్ పక్కన మౌనంగా కూర్చుంటాడు. ఏమైందని రాజ్ అడుగుతాడు. ఏం చెప్పమంటావు చచ్చిపోవాలనుందంటే నమ్ముతావా? ఏ మగవాడికి ఇలాంటి పరిస్థితి రాకూడదు రాజ్. నా భార్యకు పట్టుబోయే బిడ్డ నా బిడ్డ కాదని తెలిస్తే ఎంత నరకంగా ఉందో తెలుసా? అని రాహుల్ అంటాడు.
అవునో కాదో తెలియకుండా ముందే ఒక అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు రాహుల్. అయినా ఇంట్లో తాతయ్య ఆరోగ్యం బాగాలేదు కదా తాతయ్య కోసమైనా ఒక్క నెలరోజులు ఓపిక పట్టు అని రాజ్ చెప్తాడు. ఇద్దరూ మాట్లాడుకోవడం పైనుంచి చూసిన కావ్య మౌనంగా బెడ్ రూంలోకి వెళ్తుంది. రాజ్ బెడ్‌రూంలోకి వస్తుంటే కావ్య కోపంగా చూస్తుంది. ఎందుకలా కోపంగా చూస్తున్నావ్ అంటూ రాజ్ అడుగుతాడు. మేకవన్నె పులిని చూస్తున్నాను అంటుంది కావ్య. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ రాజ్ అంటాడు.
అవును మీ గురించి నిజం తెలిసిపోయింది. ఇంకా ఎంతకాలం నన్ను మోసం చేస్తారు. ఇంకా ఎంత కాలం నా కళ్లుగప్పి ఈ తప్పుడు పని చేస్తుంటారు అంటూ నిలదీస్తుంది. మీ ఆఫీసులో పనిచేసే శృతికి మీకు ఏంటి సంబంధం అంటూ కావ్య అడగ్గానే రాజ్ కూల్‌గా తను ఎంప్లాయి.. నేను బాస్‌ను అంటూ సమాధానంఇస్తాడు. ఇక ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











