Bigg Boss Telugu 5 లో రాంచరణ్.. బ్రేకింగ్ న్యూస్‌తో నాగార్జున.. తమన్నా, నితిన్‌తో షో కళకళ..
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభమై రెండో వారం చివరికి చేరింది. సాధారణంగా, శని ఆదివారాలలో నాగార్జున హౌస్ కి విచ్చేసి హౌస్ సభ్యులందరినీ అలరిస్తారు అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వీకెండ్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఒక విందు అనే విషయం చెప్పాలి. ఎందుకంటే నాగార్జునతో పాటు మరో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు బిగ్ బాస్ స్టేజి మీద సందడి చేయనున్నారు. నాగార్జునతో పాటు సందడి చేయబోయే హీరో, హీరోయిన్లు ఎవరు అనే వివరాల్లోకి వెళితే.

స్పెషల్ బ్రేకింగ్ న్యూస్
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో సీజన్ ఫైవ్ రెండవ వారం చివరికి చేరింది. ఈ రోజు శనివారం కావడంతో నాగార్జున షో లో కనిపించి హౌస్ సభ్యులందరినీ అలరించనున్నారు. అలాగే ఈ వారం మొత్తం మీద జరిగిన అన్ని విషయాల మీద నాగార్జున రివ్యూ చేయబోతున్నారు. అయితే ఇది ప్రతి వారం జరిగే ప్రక్రియ అయినా ఈ వారం స్పెషల్ గా మారబోతోంది. దానికి కారణం స్టార్ మాతో ప్రస్తుతం చేస్తున్న ఒప్పందంలో ఉన్న హాట్ స్టార్ సంస్థ. మెగా హీరో రామ్ చరణ్ తేజ్ గత కొద్దిరోజులుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు అన్న వార్త ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బిగ్ బాస్ షోలో ప్రకటించనున్నారు.

చరణ్ తో వాళ్ళు కూడా
అలాగే ఈ వారం విడుదలైన మాస్ట్రో సినిమా యూనిట్ కూడా తమ ప్రమోషన్స్ కోసం హౌస్ లోకి ఎంటర్ అయింది. నితిన్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా నటించిన మాస్ట్రో సినిమాలో తమన్నా ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుందని అందరూ భావించినా చివరికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనే నేరుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాంచరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన విషయాన్ని వెల్లడిస్తూ ఈ సినిమా ప్రమోషన్స్ చేసుకునేందుకు బిగ్ బాస్ వేదికను ఎంపిక చేసుకున్నారు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్వాహకులు.. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని చెబుతుండగా దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

తెలుగు మీద ఫోకస్
నిజానికి ప్రస్తుతానికి అన్ని ఓటీటీ సంస్థలు తెలుగు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. భారత్ విషయానికి వస్తే హిందీ తర్వాత అతిపెద్ద మార్కెట్ అయిన తెలుగు మీద ఓటీటీ సంస్థలన్నీ ఫోకస్ పెట్టి ఈ మేరకు ముందుకు వెళుతున్నాయి. ఇప్పటికే ఓటీటీ సంస్థలు ప్రాంతీయ భాషల మీద ఫోకస్ పెడుతూ ఎక్కువగా ఆయా భాషలలో ఒరిజినల్స్ రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా తెలుగు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించింది. మన వినోద విశ్వం అనే ఒక టాగ్ లైన్ తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్ ని ప్రమోట్ చేయబోతున్నారు.

ఆ ప్రకటన ఇదే
నిజానికి రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే నిన్న ఒక మెజీషియన్ డ్రెస్ లో ఉన్న ఫోటో షేర్ చేసి త్వరలోనే ఒక ఆసక్తికరమైన ప్రకటన చేస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన మరేమిటో కాదు ఈరోజు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి తాను తెలుగు నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిం బోతున్నాను అనే విషయాన్ని ఆయన బిగ్ బాస్ వేదికగా ప్రకటించబోతున్నట్లు. తెలుస్తోంది. ఇక ఇండియాలో కంటెంట్ కి దిక్సూచిలా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ నిలుస్తోందని ఏ క్లాస్ గ్లోబల్ ఇండియన్, రీజనల్ భాషల సినిమాలను ప్రేక్షకులకు అందిస్తోందని రామ్ చరణ్ పేర్కొన్నారు. సినిమాలే కాకుండా వివిధ భాషలలో వెబ్ సిరీస్ లు కూడా హాట్ స్టార్ తీసుకు వస్తుందని ఇప్పుడు తెలుగు ఎంటర్టైన్మెంట్ మార్కెట్లోకి హాట్ స్టార్ సంస్థ కూడా ప్రవేశిస్తూ ఉండటం తో టాలీవుడ్ లో అనేక మంది దర్శక నిర్మాతలకు నటులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎలిమినేషన్ కత్తి
ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కావడం కోసం నామినేట్ అయ్యారు. నిన్న రాత్రి కి హౌస్ సభ్యుల కోసం ఓటింగ్ వేసేఓటింగ్ లైన్స్ క్లోజ్ కాగా ఈ రోజు, రేపటి లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఏడుగురు సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు. లోబో, కాజల్, నటరాజ్, ఉమా, ప్రియా, ప్రియాంక సింగ్, అని మాస్టర్ ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మెజారిటీ సోషల్ మీడియా అభిప్రాయం ప్రకారం ఉమాదేవి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరికొందరు నటరాజ్ మాస్టర్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఈరోజు రేపట్లో క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











