‘నన్ను వేధించినా నా పోరాటం ఆగదు!' జబర్దస్త్ రష్మి స్ట్రాంగ్ కౌంటర్
ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్ (Rashmi Gautam) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ యాంకరమ్మ. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ, ఇప్పటికీ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోంది. క్రమంలో ఆమె భారీ పాపులారిటీని సంపాదించుకుంది. నటి, యాంకర్ మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతను గుర్తించిన వ్యక్తిగా కూడా ఆమె తనదైన ముద్ర వేసుకుంది. మరోసారి జంతు సంక్షేమంపై తన గళాన్ని బలంగా వినిపించారు. ఈ క్రమంలో ఆమెపై ట్రోలింగ్ జరిగిన అసలు పట్టించుకోదు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఇంధన సమస్యలపై ప్రతిపక్ష వైసీపీ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ నిరసన కార్యక్రమంలో, ఒక ఎద్దు బండిపై భారీ ఆటోను ఉంచి, దానిపై వ్యక్తులు కూర్చుని ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో ఆ ఎద్దు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అనేక మందిని కలచివేశాయి. ఈ వీడియో చూసిన వెంటనే రష్మి స్పందిస్తూ, "నిరసన పేరుతో మూగజీవాలపై ఇంత భారాన్ని మోపడం క్రూరత్వం తప్ప మరొకటి కాదు" అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

రష్మి తన సోషల్ మీడియా ద్వారా మరింత ఘాటుగా స్పందిస్తూ, "ఇలాంటి చర్యలు చేసే వారు తమ కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు" అని హెచ్చరించారు. జంతువులపై జరిగే ఇలాంటి హింసను ఆపేందుకు సంబంధిత అధికార సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆమె PETA India వంటి సంస్థలను ట్యాగ్ చేస్తూ, రాజకీయ కార్యక్రమాల్లో జంతువులను వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే రష్మి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందనకు దారితీశాయి. కొందరు ఆమెను అభినందిస్తూ మద్దతు ప్రకటించగా, మరికొందరు ఆమెపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ప్రారంభించారు.
ముఖ్యంగా రాజకీయ వర్గాలకు చెందిన కొందరు కార్యకర్తలు ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం గమనార్హం. ఎద్దులు ఇలాంటి బరువులు మోయగలవని, ఇది సంప్రదాయంలో భాగమేనని కొందరు వాదించారు. ఈ ట్రోలింగ్‌పై రష్మి వెనక్కి తగ్గకుండా మరింత బలంగా స్పందించారు. "ఇలాంటి విమర్శలు నాకు కొత్త కాదు. పండుగలు, జాతర్ల సమయంలో జరిగే జంతుబలులపై మాట్లాడినప్పుడూ ఇదే విధంగా ట్రోల్ చేశారు" అంటూ గత అనుభవాలను గుర్తుచేసుకున్నారు. గణపతి వేడుకల్లో ఏనుగులపై జరుగుతున్న హింసను ప్రశ్నించినప్పుడు తనను 'దేశద్రోహి'గా కూడా అభివర్ణించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రష్మి తన స్టాండ్‌ను స్పష్టంగా చెబుతూ.. ప్రజలు అసలు సమస్యను పక్కనబెట్టి ఒక అంశాన్ని మరొకదానితో పోలుస్తూ చర్చలు జరుపుతున్నారని విమర్శించారు. "జంతు హింసను ఆపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కేవలం పోలికలు చూపిస్తూ కాలక్షేపం చేస్తున్నారు" అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, జంతువులపై హింసను సమర్థించడం మరింత ప్రమాదకరమని హెచ్చరించారు. అదేవిధంగా, తాను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని రష్మి స్పష్టం చేశారు. "ఏ పార్టీ అయినా సరే... జంతువుల సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేస్తే, నేను ఆ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తాను" అని చెప్పారు.
తన పోరాటం పూర్తిగా మూగజీవాల కోసం మాత్రమేనని, రాజకీయాల కోసం కాదని ఆమె పునరుద్ఘాటించారు. ఈ ఘటనతో జంతు సంక్షేమం, సంప్రదాయాలు, రాజకీయాల మధ్య ఉన్న సున్నితమైన సంబంధం మరోసారి బయటపడింది. ఒకవైపు జంతు హక్కుల కోసం పోరాడే వర్గాలు రష్మికి మద్దతుగా నిలుస్తుండగా, మరోవైపు సంప్రదాయాల పేరుతో ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకించే వర్గాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications