టీవీల్లో చాకొలెట్‌తో ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ

పలు రకాల వాణిజ్య ఉత్పత్తుల్లో, వివిధ రియాలిటీ షోల్లో బాలీవుడ్ నటీనటులు కనిపించడం నేడు సర్వసాధారణం. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే అవకాశం, ప్రతి రోజూ అటు బుల్లితెరపైనే కాకుండా ప్రకటనల్లోనూ తళుక్కున మెరవడంతోపాటు ఇటు వార్తాపత్రికల్లో కనిపిస్తూ అభిమానులకు చేరువయ్యే అవకాశం ఉండటంతో పలు జాతీయ, అంతర్జాతీయ ప్రకటనల్లో వారే కనిపిస్తున్నారు. ఒక అంతర్జాతీయ చాకొలెట్ వాణిజ్య ప్రకటనకు ప్రచారం చేయడానికి పచ్చజెండా వూపి వారి సరసన చేరబోతోంది ప్రముఖ నటి, రాజ్యసభ సభ్యురాలైన రేఖ.
బుల్లితెరపై రేఖ కనిపిస్తుందని పలుమార్లు వార్తలు వినిపించినా అవి కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని హాస్యం ఉట్టిపడేలా ఈ ప్రకటన తయారుచేయాలనుకున్న ఆ సంస్థ వారు దీని ప్రచారానికి ఎవరైతే బాగుంటారని ఒక సర్వే నిర్వహించిందట. ఐదు దశాబ్దాలు దాటినా తరగని అందం, యువతకు మార్గనిర్ధేశం చేసే ఆమె వ్యక్తిగత జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని చివరకు రేఖను ఎన్నుకున్నారు ఆ చాకొలెట్ కంపెనీ వారు. ఈ ప్రకటన రూపకల్పన బాధ్యతను ప్రముఖ హిందీ చిత్ర దర్శకుడు ఇంతియాజ్ అలీకి ఇవ్వడం చెప్పుకోదగ్గ విషయం.
'జబ్ ఉయ్ మెట్', 'లవ్ ఆజ్-కల్', 'రాక్‌స్టార్' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఇంతియాజ్ ఈ చాకొలెట్ ప్రకటనను ముంబాయి, పుణేల్లో తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించి చర్చించడానికి రేఖతో సుదీర్ఘంగా సమావేశమయ్యారని సమాచారం. ఏ పని చేసినా అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తే రేఖ ఈ ప్రకటనలో ఏ రూపంలో కనువిందు చేయనున్నారోనని ఆమె అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











