Pahalgam Attack : పహల్గామ్‌లో తెలుగు యాంకర్ .. స్పాట్ నుంచే వీడియో, ఏకీపారేస్తోన్న నెటిజన్లు
భూలోక స్వర్గం కాశ్మీర్ మరోసారి నెత్తురోడింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలోని పచ్చిక బయళ్లలో ప్రకృతిని ఆస్వాదిస్తున్న పర్యాటకులను తీవ్రవాదులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి కేవలం పురుషులే లక్ష్యంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో దాదాపు 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడితో భారత్ ఉలిక్కిపడింది.
కాశ్మీర్‌లో గత కొంతకాలంగా పర్యాటకుల తాకిడి పెరగడంతో పాటు త్వరలో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేయడానికి ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా అనుబంధ ది రిసిస్టెన్స్ ఫ్రంట్ ఈ పాశవిక దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా సైనిక దుస్తుల్లో వచ్చిన ఐదుగురు ముష్కరులు కాల్పులకు పాల్పడినట్లుగా భద్రతా దళాలు చెబుతున్నాయి. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

కాల్పుల శబ్ధం వినిపించడంతో భద్రతా దళాలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఎత్తైన ప్రదేశం కావడంతో పాటు కేవలం కాలినడక, గుర్రాల మీద రావడానికి మాత్రమే వీలుండటంతో ఇదే అదనుగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి వ్యూహ రచన చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాడి విషయం తెలిసిన వెంటనే సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ .. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడారు. సౌదీ పర్యటనను కుదించుకుని హుటాహుటిన న్యూఢిల్లీకి చేరుకున్నారు మోడీ. ప్రధాని ఆదేశాలతో జమ్మూకాశ్మీర్ చేరుకున్న అమిత్ షా బాధితులను ఓదార్చి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదుల కోసం సైన్యం వేట మొదలుపెట్టింది.
కాశ్మీర్‌లో ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. సినీ, రాజకీయ, క్రీడ తదితర రంగాలకు చెందిన ప్రముఖులు దాడిని ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు సోషల్ మీడియా సాక్షిగా ఆకాంక్షించారు. అయితే ఇంతటి దారుణ ఘటనలో పలువురు సెలబ్రెటీలు తృటిలో ప్రాణాలు కోల్పోయారు. బాలీవుడ్ నటి దీపికా కాకర్ తన భర్త షోయబ్‌తో కలిసి ఇటీవల కాశ్మీర్ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేశారు. దాడి తర్వాత తాము క్షేమంగానే ఉన్నామని దీపిక, షోయబ్‌లు మెసేజ్ పెట్టారు. అయితే పహల్గమ్‌లో తాము చేసిన వ్లాగ్‌ను అప్‌లోడ్ చేస్తామంటూ షోయబ్ చేసిన ప్రకటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. దేశం దిగ్భ్రాంతిలో ఉంటే వ్లాగ్‌ను పబ్లిసిటీ చేసుకుంటారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తాజాగా తెలుగు యాంకర్, బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్ కూడా ఇదే రకమైన ట్రోలింగ్‌కు గురైంది. పహల్గమ్ వెళ్లిన కాజల్.. అక్కడి తాజా పరిస్ధితిపై వీడియోను షేర్ చేసింది. ఓ పూల తోట బ్యాక్‌గ్రౌండ్‌లో కళ్లజోడు పెట్టుకుని స్టైలీష్‌గా వీడియో చేసింది. పైగా తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో చేసింది. తాను ప్రస్తుతం పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నానని, తాను క్షేమంగానే ఉన్నానని , టైట్ సెక్యూరిటీ ఉందని కాజల్ తెలిపింది. తన క్షేమ సమాచారాల కోసం ఆరా తీసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. దీంతో నెటిజన్లు కాజల్‌పై మండిపడుతున్నారు. అక్కడ అంత మంది చనిపోతే ఫేస్‌లో చిన్న ఫీలింగ్ కూడా లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. జాగ్రత్తగా ఉండమని మరికొందరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











