జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పనున్న రోజా.. అసలు కారణం ఏమిటంటే?
తెలుగులో జబర్దస్త్ కామెడీ షో తెచ్చుకున్నంత పేరు మరే ఇతర షో తెచ్చుకోలేదు. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. మధ్య మధ్యలో చాలా మంది కంటెస్టెంట్స్ మారారు, జడ్జిలు మారారు కానీ షో మాత్రం ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. మధ్యమధ్యలో అప్పుడప్పుడు తప్ప ఎప్పుడూ జడ్జిగా కనిపిస్తూ ఉండే రోజా ఇక జబర్దస్త్ కి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే

జబర్దస్త్ కారణం అని
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలాకాలం పాటు తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో సత్తా చాటిన రోజా ఆ తర్వాతి కాలంలో అత్త, అమ్మ పాత్రలు కూడా చేశారు. కానీ తెలుగు టెలివిజన్ చరిత్రలో నెంబర్ వన్ షో అనిపించుకుంటున్న జబర్దస్త్ షో మొదలైన తర్వాత ఆమె అందులో జడ్జిగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఈ షో ద్వారా ఆమెకు మరింత క్రేజ్ లభించింది. రాజకీయాల్లో సైతం యాక్టివ్ గా ఉండే ఆమె ఎమ్మెల్యే కావడానికి ఈ జబర్దస్త్ కారణం అని కూడా కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే ఒప్పుకున్నారు.

కొంత కాలం దూరంగా
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి రోజా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి ఆమె వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. అయితే ఆ మధ్య రోజా ఈ షో మానేస్తుందనే ప్రచారం జరిగింది. అప్పుడు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రోజా కొంత కాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంద్రజ వంటి వారు వెలుగులోకి వచ్చారు. ఇంద్రజ, ఆమని, సంగీత ఇలా ఎంతో మందిని ఈ జడ్జీ స్థానంలో తీసుకొచ్చారు.

మంత్రి పదవి కన్ఫామ్
అయితే ప్రస్తుతానికి మనో కూడా కనిపించడం లేదు ఆయన స్థానంలో లయ, లైలా వంటివారిని తీసుకు వస్తున్నారు. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు రోజా ఈ షో అనే కాదు మొత్తం బుల్లితెరకు దూరంగా ఉండబోతోందనే టాక్ బయటకు వచ్చింది. అదేమిటంటే ఏపీలో రోజాకు మంత్రి పదవి కన్ఫామ్ కానుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ షోలకు రోజా దూరంగా ఉండనుందని ప్రచారం జరుగుతోంది.

రోజాకు పదవి పక్కా
ప్రస్తుతం ఉన్న కేబినెట్ మంత్రుల్లో మెజార్టీ సభ్యులను తప్పించి కొత్తవారికి చోటు కల్పించబోతున్నట్టు ఏపీ సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. కొత్త మంత్రులు త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పాత మంత్రుల్లో ఎవరెవరు కొనసాగుతారా ? కొత్తగా ఎవరికి చోటు దక్కుతుందనే లెక్కల్లో ఉండగా రోజాకు పదవి పక్కా అని అంటున్నారు.

కాలమే నిర్ణయించాలి
అలా మహిళా కోటాలో తనకు మంత్రి పదవి దక్కితే ఈ షోలను మానేయాల్సి వస్తుందని తెలిసి.. ఇప్పటి నుంచి రోజా దూరంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ వారం జరిగిన ఎపిసోడ్‌లో కూడా రోజా కనిపించిలేదేమోనని చర్చ మొదలయింది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంది అనేది కాలమే నిర్ణయించాలి మరి.


Click it and Unblock the Notifications











