బుల్లితెరపై రోజా గ్రాండ్ రీ ఎంట్రీ.. హోస్ట్‌గా ఫ్యామిలీ అసెంబ్లీ.. ఎక్కడ చూడొచ్చంటే?
తన అందం, అభినయంతో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు ఆర్కే రోజా. నటన, ఆమె రూపంపై తొలినాళ్లలో విమర్శలు రాగా.. అన్నింటికీ తన సినిమాలతోనే సమాధానమిచ్చారు. సౌందర్య, రమ్యకృష్ణ, మీనా, రంభ తదితర అగ్రతారల నుంచి పోటీ వచ్చినప్పటికీ తన మార్క్ చూపించారు. దక్షిణాదిలోని అందరు అగ్రనటుల సరసన నటించారు. దర్శకుడు ఆర్కే సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె సంతానం. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తన సత్తా చాటి ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. టీడీపీ, వైసీపీలలో తన హవా చూపించారు.
సినిమాలు, రాజకీయాలే కాదు.. బుల్లితెరపైనా సక్సెస్ అయ్యారు రోజా. ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షోకి నాగబాబుతో కలిసి జడ్జిగా వ్యవహరించారు. కమెడియన్ల టైమింగ్‌కు తోడు రోజా మధ్యలో వేసే పంచ్‌లు, సెటైర్లు ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హీరోయిన్‌గా కంటే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు రోజా. దాదాపు పదేళ్ల పాటు జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించిన రోజా అనూహ్యంగా ఈ షో నుంచి తప్పుకున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా.. ఆమెకు మంత్రిగా అవకాశం లభించడంతో రాజకీయ, పాలనాపరమైన కారణాల వల్లే ఆమె జబర్దస్త్ నుంచి వైదొలిగారు. అప్పటికే నాగబాబు జడ్జిగా తప్పుకోగా.. రోజా కూడా వెళ్లిపోవడంతో జబర్దస్త్ కళ తప్పింది. మధ్యలో పలువురు జడ్జిలుగా వచ్చినప్పటికీ రోజా, నాగబాబు స్థాయిలో అలరించలేకపోయారు.

మంత్రిగా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రోజా.. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. పరాజయంతో కొంతకాలం ఇంటికే పరిమితమైన రోజా.. ఇటీవల తిరిగి యాక్టీవ్ అయ్యారు రాజకీయాలతో పాటు తనను ప్రజలకు చేరువ చేసిన బుల్లితెరపై రీ ఎంట్రీ కోసం వెయిట్ చేశారు. అలాగే సినిమాల్లో ఆఫర్ల కోసం గట్టిగానే ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రోజా ప్రయత్నాలు ఫలించి.. రోజాకు తెలుగు బుల్లితెరపై గ్రాండ్ రీ ఎంట్రీ దొరికింది.
జీ తెలుగు ఛానెల్.. ది ఫ్యామిలీ అసెంబ్లీ షోకు ప్లాన్ చేసింది. ఈ ఏప్రిల్ 19న ఈ షో లాంచ్ అయింది. ఇకపై ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. రోజాతో పాటు సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, సింగర్ సమీరా భరద్వాజ్ సహా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ అసెంబ్లీ షోకు సంబంధించిన ప్రోమోను జీ తెలుగు విడుదల చేసింది. రోజాతో పాటు సమీరా భరద్వాజ్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
చాలాకాలం తర్వాత రోజా హోస్ట్‌గా రానుండటంతో ఈ కార్యక్రమంపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ గ్రాండ్ ప్రీమియర్‌కు జీ తెలుగులో ప్రసారమయ్యే మేఘ సందేశం సీరియల్ టీమ్.. గగన్ (అభినవ్), భూమి (భూమిక)లతో పాటు ఈ సీరియల్ తారాగణం హాజరై సందడి చేసింది. ఈ ఎపిసోడ్‌లో ఆటలు, రొమాంటిక్ ఛాలెంజ్‌లు వంటి వినోదాత్మక అంశాలు ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవానికి మరింత శోభను చేకూరుస్తూ.. గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఫరియా అబ్ధుల్లా, జెడీ చక్రవర్తిలు అతిథులుగా విచ్చేశారు. గతంలో రోజా హోస్ట్‌గా వ్యవహరించిన పాపులర్ షో బతుకు జట్కా బండి తర్వాత.. సరికొత్త అవతారంలో ఈ షో ద్వారా ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు.


Click it and Unblock the Notifications


