‘పాములతో అమ్మకి అలా టార్చర్.. నా జీవితానికి అదే చివరి రోజని అనుకున్నా’
తెలుగు టెలివిజన్ రంగంలో దూసుకెళ్తున్నారు సాయికిరణ్. అన్నయ్య, తండ్రి, పెదనాన్న వంటి పాత్రలు పోషిస్తూ బాగా బిజీ అయ్యారు. అన్ని అనుకున్నట్లుగా జరిగుంటే సినీరంగంలో స్టార్ అయ్యేవాడు సాయికిరణ్. అయితే అనూహ్య కారణాలతో ఆయన బుల్లితెరపై స్ధిరపడ్డాడు. సింగర్‌గా, నటుడిగా అన్నిరకాలుగానూ అలరించారు సాయికిరణ్. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.
అలనాటి సింగర్ రామకృష్ణ కుమారుడైన సాయికిరణ్ తొలుత హీరో అవ్వాలని కలలు కన్నారు. ప్రతిష్టాత్మక ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మాతగా తెరకెక్కించిన నువ్వేకావాలిలో సెకండ్ హీరో పాత్రలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచినప్పటికీ సాయికిరణ్‌కు అవకాశాలు క్యూకట్టలేదు. ఆఫర్లు వచ్చినా చిన్నాచితకా పాత్రలే కావడంతో క్లిక్ కాలేకపోయారు. తెలుగుతో పాటు పలు భాషల్లోనూ నటించారు. ఈ క్రమంలో బుల్లితెర నుంచి సాయికిరణ్‌కు ఆహ్వానం అందింది.

ఈటీవీలో ప్రసారమైన శివలీలలు సీరియల్‌లో విష్ణుమూర్తిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలలో పలు సీరియల్స్‌లో సాయికిరణ్ నటించారు. స్టార్ మాలో ప్రసారమైన గుప్పెడంత మనసులో మహేంద్రగా ఆయన ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తొలుత సాయికిరణ్‌కు వైష్ణవితో వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయింది. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. విడాకుల తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే జీవించిన సాయికిరణ్.. కోయిలమ్మ సీరియల్‌లో తన సహ నటి స్రవంతితో ప్రేమలో పడి ఆమెను పెళ్లాడారు. ప్రస్తుతం భార్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చావు అంచుల వరకు వెళ్లొచ్చానని చెప్పి షాకిచ్చారు సాయికిరణ్. సినిమాలు చేస్తూనే స్నేక్ క్యాచర్‌గా సరదాగా పనిచేసేవాడినని.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవాడిని. అలా దాదాపు 3000 పాముల వరకు పట్టుకున్నానని చెప్పారు సాయికిరణ్. అయితే ఓసారి మాత్రం ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ఈ వివరాల్లోకి వెళితే.. చాలాసార్లు నన్ను పాము కాటేసింది. సైనిక్‌పురి నుంచి ఓ తలకుమాసిన వాడు ఫోన్ చేశాడు. సరేనని వెళ్లా.. అలాగే వెళ్లి పామును పట్టుకుని సగం పాముని పట్టుకుని బ్యాగ్‌లో వేసి దాని తోకని పట్టుకుని కదిలిస్తూ మాట్లాడుతున్నా. అతను ఎంత ఇవ్వమంటారు అని అడగటంతో నాకు కాలింది. డబ్బుల కోసం రాలేదు.. సేవలో భాగంగానే ఇది చేస్తున్నానని చెబుతుండగా పాము కింద నుంచి వచ్చి కాటేసిందని సాయికిరణ్ తెలిపాడు.
డాక్టర్ కాళ్లా వేళ్లా పడి ట్రీట్‌మెంట్ చేయించుకున్నా.. మహేంద్రా హిల్స్ నుంచి సైనిక్‌పురికి వెళ్లాను. అక్కడ షిప్ట్ డాక్టర్ మాత్రం భయపడుతున్నాడు. అది నిజంగానే పాముకాటేనా అని అడుగుతున్నాడు. దాంతో నా కళ్లముందే కరిచింది అని చెప్పాను. టైం లేదు... ఆల్రెడీ 45 నిమిషాలు అయిపోయింది. టీవీ 9కి ఫోన్ చేసి వాళ్లను పిలిపిస్తానని బెదిరించడంతో అప్పుపడు వాడు నాతో లెటర్ రాయించుకుని ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశాడు. అప్పటికే నా నాలుక వాచిపోతోంది.. మాట కూడా రావడం లేదు. విపరీతంగా నిద్ర వచ్చేస్తోంది.. దానిని కష్టం మీద ఆపుకుంటున్నా. పాముకాటేసినప్పుడు నిద్రపోతే కోమాలోకి వెళ్లిపోతాం. మొత్తానికి చావు అంచుల దాకా వెళ్లొచ్చా. అయినప్పటికీ సిగ్గులేకుండా పాములు పడుతూనే ఉన్నా. కానీ మా అమ్మ మాత్రం దీని వల్ల టెన్షన్ పడుతున్నారు. నేను పామును పడితే ఆరోజంతా పడుకోకుండా ఉండటం, నిద్రలోంచి ఉలిక్కిపడి లేవడం చూశా. నా వల్ల అమ్మ టార్చర్ పడకూడదని పాములు పట్టడం తగ్గించేశానని సాయికిరణ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సాయికిరణ్ ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











