హిందీ గబ్బర్ సింగ్ తో 500 కోట్ల డీల్
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ స్టార్ సల్మాన్ ఖాన్ అటు వెండితెర మీద వరుస హిట్‌లు సాధిస్త్తూనే ఇటు బుల్లితెర ప్రేక్షకులను తనదైన శైలితో అలరిస్తున్నాడు. గత కొన్ని సీజన్‌లుగా ఆయన 'బిగ్‌బాస్' కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా ఛానెల్‌కు మంచి టిఆర్‌పి రేటింగ్‌లు తెచ్చిన ఈ దబాంగ్ స్టార్ సినిమా కన్నా టీవీ పెద్ద మాధ్యం అంటున్నాడు.
''టెలివిజన్ రంగంలో పని చెయ్యాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. రియాలిటీ షో అయితే ఒక సీజన్‌తో అయిపోతుంది. కానీ సీరియల్‌లో పని చేస్తున్నట్లయితే కొన్ని ఏళ్ళ పాటు దాంట్లోనే కొనసాగాల్సి ఉంటుంది. అయితే బాలీవుడ్ కన్నా టీవీ కార్యక్రమాల ద్వారా ఎక్కువ పాపులారిటీ వస్తుంది'' అని అంటున్నాడీ కండలవీరుడు.
అయితే తాను ఎటువంటి తరహా కార్యక్రమాలు చేయాలనుకున్నానో అలాంటి కార్యక్రమాలే చేస్తున్నానని అన్నాడు సల్మాన్. ఇక బిగ్‌బాస్‌కు మూడు సీజన్‌ల నుండి వ్యాఖ్యాతగా పనిచేస్తున్న తనకు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఈ మధ్యే ఈ కార్యక్రమం ముగిసింది.
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్న సభ్యులకే కాక వ్యాఖ్యాతగా తనూ కొన్ని సార్లు ఇరకాటంలో పడవలసి వచ్చిందని అంగీకరించాడు. షోలో భాగంగా కొన్ని సార్లు బిగ్‌బాస్ ఇంట్లోని సభ్యులను తిట్టవలసి వచ్చిందని, అది అప్పుడప్పుడూ మోతాదు మించిందని, అలాంటప్పుడే తాను ఇరుకున పడుతుంటానని తెలిపాడు. అలాంటి సందర్భాలలో స్పందించ వచ్చా లేదా అనే విషయం వద్దే సందిగ్ధత ఏర్పడుతోందని ఆయన అన్నాడు.


Click it and Unblock the Notifications












