Bigg Boss 16 విజేతగా ఎంసీ స్టాన్.. బిగ్‌బాస్ విన్నర్ పారితోషికం ఎంతంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ 16 సీజన్ ముగిసింది. వివాదాలకు కేంద్ర బిందువుగా, రసవత్తరంగా సాగిన ఈ సీజన్‌లో ఎంసీ స్టాన్ విజేతగా నిలిచారు. ఆదివారం రాత్రి జరిగిన బిగ్‌బాస్ ఫినాలేలో అత్యధిక మంది మద్దతు సాధించి ఓట్లు పొందిన మ్యూజిక్ కంపోజర్, ర్యాపర్ ఎంసీ స్టాన్ బిగ్‌బాస్ ట్రోఫిని, పారితోషికాన్ని అందుకొన్నారు. బిగ్‌బాస్ విజేతగా నిలిచిన స్టాన్‌కు 31 లక్షల 80 వేల క్యాష్ ప్రైజ్‌ను అందుకోవడంతోపాటే హ్యుందయ్ కారును కూడా సొంతం చేసుకొన్నారు.
ఫిబ్రవరి 12 అర్ధరాత్రి వరకు కొనసాగిన బిగ్‌బాస్ సీజన్ 16 ఫినాలేను సల్మాన్ ఖాన్ ఆసక్తికరంగా నిర్వహించారు. టాప్ 5లో నిలిచిన ప్రియాంక చాహర్ చౌదరీ, షాలిన్ బానోత్, ఎంసీ స్టాన్, శివ థాకరే, అర్చన గౌతమ్ మధ్య విజయం దోబూచులాడింది. చివరికి ఎంసీ స్టాన్ ట్రోఫిని ఎగురేసుకెళ్లాడు.

ఎంసీ స్టాన్ విషయానికి వస్తే.. ఆయన అసలు పేరు అల్తఫ్ తడవి. అమెరికన్ ర్యాపర్ ఎమినెమ్‌కు వీర అభిమాని. అమినెమ్ అభిమానులను స్టాన్స్ అని పిలుస్తారు. దాంతో మైక్రోఫోన్ కంట్రోలర్ స్టాన్ అని తన పేరును మార్చుకొన్నారు. అతడిని ఎంసీ స్టాన్ అని పిలుస్తారు.
ఎంసీ స్టాన్ కెరీర్ విషయానికి వస్తే. 2018లో వాతా ఆల్బమ్‌తో ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించారు. 2019లో విడుదల చేసిన ఖుజా మత్ రెండో ఆల్బమ్‌తో పాపులారిటీ, సక్సెస్ సాధించాడు. 2020లో తాడిపార్, 2022లో ఇన్సాన్ అనే అల్బమ్‌తో సంగీత ప్రియులను ఆకట్టుకొన్నాడు. గత మూడు నెలలకుపైగా సాగిన రియాలిటీ షో జర్నీలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రస్తుతం బిగ్‌బాస్ విజేతగా నిలిచాడు.


Click it and Unblock the Notifications











