సమంత - రాజ్‌లకు వేదికపైనే ఆశీర్వాదం.. షాకిచ్చిన రుతురాగాలు నటి
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఇష్యూ ఏదైనా ఉంది అంటే అది సమంత- రాజ్ నిడిమోరుల రిలేషనే. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న సమంత ఈ బాలీవుడ్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగచైతన్యతో శోభిత పెళ్లి తర్వాత ఇవి తారాస్థాయికి చేరిపోయాయి. రెండ్రోజుల క్రితం రాజ్‌తో సమంత క్లోజ్‌గా ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో జరుగుతోందనే గాసిప్స్‌కు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. ఈ నేపథ్యంలో బుల్లితెర నటి మధుమణి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
రుతురాగాలుతో కెరీర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన మధుమణి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. 1997లో మంజులా నాయుడు తెరకెక్కించిన పాపులర్ సీరియల్ రుతురాగాలు ద్వారా మధుమణి తన కెరీర్ ప్రారంభించారు. అనంతరం అందం, ఆకాశగంగ, శ్రావణి సుబ్రహ్మణ్యం సహా పలు తెలుగు ధారావాహికల్లో ఆమె నటించారు. అనంతరం పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలయ్యారు. మధుమణికి ఒక కుమార్తె, ఒక కుమారుడు సంతానం.

సినిమాల్లోనూ మధుమణి బిజీ
సీరియల్స్‌లో వచ్చిన ఫేమ్‌తో ఆమెకు సినిమాల్లోనూ ఆఫర్లు వెల్లువెత్తాయి. సంతోషం, గోదావరి,రాఖీ, అష్టాచెమ్మా, మిర్చి, గోల్కొండ హైస్కూల్, జోగిని, ఎంత అందంగా ఉన్నావే, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ తదితర చిత్రాలు మధుమణికి పేరు తీసుకొచ్చాయి. సీరియల్స్‌లో నటిస్తూనే తోటి కళాకారుల సంక్షేమం కోసం మధుమిత పాటుపడుతున్నారు. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మధుమిత యాక్టీవ్ మెంబర్. అంతేకాదు.. తెలుగులో డబ్బింగ్ సీరియల్స్ హవా పెరుగుతుండటంతో ధర్నాకు దిగడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
నాగార్జునకు తల్లిగా
ఇక 2002లో అక్కినేని నాగార్జున - శ్రేయ నటించిన సంతోషం సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించిన మధుమణి.. 20 ఏళ్ల తర్వాత నా సామీ రంగలో నాగార్జునకు అమ్మ క్యారెక్టర్‌లో నటించడం విశేషం. అప్పట్లో, ఇప్పట్లో నాగార్జునతో దిగిన ఫోటోను మధుమణి పంచుకున్నారు. ఇక ఇటీవల సమంత నిర్మాతగా మారి ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ అనే బ్యానర్‌ను స్థాపించి శుభం అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీలో మధుమణి ఓ కీలకపాత్రలో పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో మధుమణి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
సమంతతో ఛాన్స్ మిస్
సుమారు 400 చిత్రాల్లో ఎంతోమంది హీరో, హీరోయిన్లకు తల్లిగా నటించానని కానీ సమంతతో ఒక్క సినిమా కూడా చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రంగస్థలంలో ఆమెకు నటించే అవకాశం తృటిలో చేజారిపోయిందని, శుభం సినిమా కోసం టీమ్ తనను సంప్రదించడంతో వెంటనే ఒప్పుకున్నట్లు మధుమణి తెలిపింది. ఒక్కరోజు షూట్ చేయగానే అనారోగ్యం పాలై చికెన్ గున్యా బారినపడ్డానని దీంతో సినిమా చేజారిపోతుందని బాధపడ్డానని ఆమె పేర్కొన్నారు.
రాజ్- సమంతలకు ఆశీస్సులు
నాలుగు నెలల తర్వాత కూడా సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని, ఈ సినిమాలో తన పాత్రకు ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తున్నాయని మధుమణి చెప్పారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సమంతకు శుభమన్న ఆమె.. రాజ్, సమంతల జీవితం బాగుండాలని ఆశీర్వదించారు. ప్రస్తుతం సమంత - రాజ్‌ల మధ్య రిలేషన్ నడుస్తోందంటూ మీడియాలో పుకార్లు వైరలవుతున్న వేళ మధుమణి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.


Click it and Unblock the Notifications











