సంజన గల్రానీ మెడకు డ్రగ్స్ కేసు ఉచ్చు.. సుప్రీంకోర్టు నోటీసులు.. బిగ్‌బాస్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్ హైడ్రామా!
దక్షిణాది సీనియర్ హీరోయిన్ సంజనా గల్రానీకి మరోసారి ఎదురు దెబ్బ తగలింది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ రియాలిటీ షోలో పాల్గొంటున్న ఆమెకు డ్రగ్స్ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడం వివాదాస్పద పరిణామంగా మారింది. దాంతో గత వారం బిగ్‌బాస్ తెలుగు షోలో హైడ్రామా కూడా కనిపించింది. అయితే ఈ కేసులో నోటీసులు వచ్చిన సమయంలో సంజనాను మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట రెండు రోజులు సీక్రెట్ రూమ్‌లో ఉంచడం నాటకీయత కనిపించింది. అయితే ఈ కేసు వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో అర్చన గల్రానీ అలియాస్ సంజన గల్రానీపై 2020 సంవత్సరంలో డ్రగ్స్ కేసు నమోదైంది. ఆమెతోపాటు రాగిణి ద్వివేది, ఇతరులపై కేసు నమోదు చేశారు. నార్కోటిక్స్ అండ్ సైకట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1985 చట్టం కింద ఈ కేసు నమోదైంది. అయితే ఈ కేసును కొట్టివేయాలని స్పెషల్ లీవ్ పిటిషన్ 2024 మార్చి 25వ తేదీన దాఖలు చేశారు.

అయితే సంజనా గల్రానీపై విచారణను, కేసును ఎత్తివేయాలని కర్ణాటక ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు స్పందించింది. కర్ణాటక హైకోర్టు ఈ కేసులో సంజన గల్రానీతోపాటు మరికొందరికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సంజనా ఫోన్ కాల్స్ డేటా, నగదు లావాదేవీలు, నైజీరియన్ డ్రగ్స్ సప్లయర్ ఉన్న సంబంధాలను పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నది.
కర్ణాటక ప్రభుత్వం తరఫున అడిషినల్ అడ్వకేట్ జనరల్ అమన్ పన్వర్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. సంజన అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలు జరిపించారు. ఫైవ్ స్టార్ పార్టీలలో ఈ డ్రగ్స్ వినియోగించారు. వారి ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తే.. డ్రగ్స్ సరఫరాదారులతో వారు టచ్‌లో ఉన్నారు. వీరి పార్టీల వల్ల ఇరుగుపొరుగు వారు చాలా డిస్ట్రబ్ అయ్యారు అని వాదనలు వినిపించారు.
ఈ కేసులో సంజన గల్రానీతపాటు ఇతర నిందితులకు హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన వారికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను తదుపరి తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో కేసు తీవ్రం కావడంతో బిగ్‌బాస్ తెలుగు నిర్వాహకులు జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట ఆమెను షో నుంచి తప్పించి.. సీక్రెట్ రూమ్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను బయటకు పంపించేంతగా వేదికపై డ్రామా క్రియేట్ చేశారు.
అయితే ఇంటి సభ్యుల త్యాగాలు, ఓటింగ్ లాంటి అంశాలను హోస్ట్ నాగార్జున రక్తి కట్టించారు. కంటెస్టెంట్లు కొన్ని త్యాగాలు చేయడంతో ఆమెను మళ్లీ ఇంటిలోకి తీసుకొచ్చారు. అయితే బిగ్‌బాస్ చరిత్రలో ఎన్నడూ ఆడియెన్స్ ఓటింగ్ లేకుండా ఏ కంటెస్టెంట్‌ను బయటకు పంపించలేదు. ఏదైనా వివాదం గానీ.. లేదా ఆరోగ్య కారణాలతో స్వచ్చందంగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే సంజన విషయంలో కోర్టు విచారణ తదుపరి డేట్‌కు వాయిదా వేయడం, కేసు తీవ్రత పెద్దగా లేకపోవడం వల్ల ఈమెను మళ్లీ లోనికి తీసుకొచ్చారు అనే విషయంపై మీడియాలో చర్చ జరుగుతున్నది. రానున్న రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు షోలో సుప్రీం కోర్టు నోటీసులు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











