Sanjjanaa Galrani: సంజన గల్రానీ కొత్త అవతారం... కెరీర్ కోసం బిగ్‌బాస్ బ్యూటీ డేరింగ్ స్టెప్..
సినీరంగంలో ఉన్న వారి జీవితం గాలిలో దీపాలు లాంటివి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టం. సక్సెస్ ఉన్న రోజుల్లో అందరి హవా గట్టిగానే సాగుతుంది. కానీ ఎప్పుడైతే ఒక ఫ్లాప్ పడుతుందో అప్పటి నుంచి కెరీర్ రివర్స్ అవుతుంది. పూలు పడిన చోటే రాళ్లు పడుతుంటాయి. ఈ అవమానాలు, ఛీత్కారాలు తట్టుకోలేక మధ్యలోనే డ్రాప్ అయినవాళ్లు ఎందరో. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదురొడ్డి నిలిచినవారు విజేతలుగా నిలుస్తారు. ఇక హీరోలతో పోలిస్తే హీరోయిన్లు, ఇతర మహిళా నటుల జీవితం మరింత దారుణం. అయినప్పటికీ మొండిగా బండి లాంగేవారు ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు సంజనా గల్రానీ. తాజాగా తన కెరీర్ కోసం ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
కర్ణాటకకు చెందిన నిక్కీ గల్రానీ తొలుత మోడలింగ్ వైపు అడుగులు వేశారు. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంతో కలిసి ఆమె చేసిన కమర్షియల్ యాడ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2005లో తెలుగులో తరుణ్ హీరోగా వచ్చిన సోగ్గాడుతో వెండితెరపై అడుగుపెట్టారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది సంజన. తెలుగులో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడులో త్రిషకు చెల్లెలిగా నటించి బ్రేక్ అందుకుంది. అయితే ఆ తర్వాత పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గానే సరిపెట్టుకుంది. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నిక్కి కన్నడలో తప్పించి పెద్దగా ఎక్కడా ఎదగలేకపోయింది.

ఇదే సమయంలో శాండిల్‌వుడ్ డ్రగ్స్ కేసులో సంజన పేరు తెరపైకి రావడం, ఆమె అరెస్ట్ రావడం చిత్ర పరిశ్రమను కుదిపేసింది. దాని నుంచి బయటపడినప్పటికీ అవకాశాలు రావడం కష్టమైంది. అజీజ్ పాషా అనే డాక్టర్‌తో ప్రేమలో పడిన సంజన అతనిని పెళ్లాడింది. ఈ దంపతులకు ఓ పాప సంతానం. సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఆమె పేరు వినిపించింది. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్, వేధింపులపై వివాదాస్పద వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో కలకలం రేపింది. వెండితెరతో పాటు బుల్లితెరపైనా సంజన సత్తా చాటింది. గతంలో బిగ్‌బాస్ కన్నడ, మలయాళంలో స్మార్ట్ షో, తెలుగు, కన్నడంలలో సిక్త్స్ సెన్స్, హిందీలో ముఝే షాదీ కరోగి అనే షోలలో కనిపించింది సంజన.
ఇక ఎవ్వరూ ఊహించని విధంగా బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుని షాకిచ్చింది. మొదట్లో ఆమె వయసుకు త్వరగానే ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. కానీ తొలివారంలోనూ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కెప్టెన్‌గా అవతరించింది. కొన్ని వారాల పాటు బిగ్‌బాస్ అంటే సంజన.. సంజన అంటే బిగ్‌బాస్ అన్నంతగా షో మొత్తం ఆమె చుట్టూనే తిరిగింది. మధ్యలో ఎలిమినేట్ అయినా తర్వాత మళ్లీ హౌస్‌లో అడుగుపెట్టి టాప్ 5లో చోటు దక్కించుకుని ఫైనలిస్ట్‌గా నిలిచింది. చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చి ఫోర్త్ రన్నరప్‌గా నిలిచింది. బిగ్‌బాస్ తర్వాత ఆమె తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యారు. దాంతో తెలుగులోనే మరోసారి సత్తా చాటాలని ఆమె నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
దీనిలో ఆమె ఓ కొత్త అవతారం ఎత్తారు. కెరీర్‌లో ఇప్పటి వరకు మోడల్‌గా, నటిగా, రియాలిటీ షో కంటెస్టెంట్‌గా నిలిచిన సంజన గల్రానీ.. తాజాగా యాంకర్‌గా మారారు. అది కూడా తెలుగులోనే కావడం విశేషం. ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. శివ కంఠంనేని, ఎస్తర్ నోరాన్హా, ధన్య బాలకృష్ణ కీలకపాత్రలు పోషించిన చిత్రం అమరావతికి ఆహ్వానం. జీవీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావులు నిర్మిస్తున్నారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా అమరావతికి ఆహ్వానం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా సంజన గల్రానీ ప్రత్యక్షం కావడంతో అంతా షాక్ అయ్యారు. ఈ సందర్భంగా సంజన మాట్లాడుతూ.. ఈ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ యాంకర్‌గా పిలిచారు. నన్ను నమ్మారు.. నాకు ఎంత తెలుగు తెలుసు, అది ప్రూవ్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఏదైనా తప్పులు జరిగితే అది హార్ట్‌కు తీసుకోవద్దు. చాలా కష్టపడి తెలుగు నేర్చుకున్నాను అని సంజన తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సంజన ప్రయత్నాన్ని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











