సత్యమేవ జయతే...అమీర్‌కు పార్లమెంట్ నుంచి ఆహ్వానం
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్వహిస్తున్న 'సత్యమేవ జయతే' కార్య్రకమానికి ప్రభుత్వాల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజల్లో సమాజం పట్ల అవగాహన కలిగించి వ్యవస్థలోని లోపాలను తెలియజేసేలా సాగుతున్న ఒక మంచి రియాల్టీ షో 'సత్యమేవ జయతే'. మే 6 నుంచి ప్రతి ఆదివారం ఇది ప్రసారం అవుతోంది.
మే 27వ తేదీన ప్రసారమైన ఈకార్యక్రమంలో 'వైద్య రంగంలో అక్రమాల' గురించి ప్రస్తావించారు. వైద్య రంగంలో జరుగుతున్న పలు అక్రమాలు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. వైద్య పరీక్షల సందర్భంగా ప్రయోగశాలలకు కమీషన్లు ఇవ్వడం..పరీక్షలు చేయాల్సినవసరం లేకపోయినా పరీక్షలు చేయించుకోవాలని చెప్పడం..మందుల వాడకం..మందుల ధరల్లో తేడాలు ఉండడం వంటి విషయాలు షోలో చూపించడం జరిగింది.
దీనిపై పలు విమర్శలు కూడా వచ్చాయి. దీనిపై అమీర్ ఏమాత్రం బెదరలేదు. తాను, తన బృందం వాస్తవాలను వెల్లడించేందుకు ప్రయత్నిస్తున్నామని పలు సందర్భాలలో పేర్కొన్నారు. దీనితో ఈ విషయాలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయంపై తెలుసుకున్న అంశాలను తమ దృష్టికి తీసుకరావాల్సిందిగా 'పార్లమెంటరీ ప్యానల్' అమీర్‌కు ఆహ్వానం పంపింది. గురువారం అమీర్‌ఖాన్ తన బృందంతో ఢిల్లీలో హాజరుకానున్నారు. కామర్స్‌కి సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘానికి అధ్యక్షత వహిస్తున్న రాజ్యసభ సభ్యులు శాంతకుమార్ అమీర్‌కు ఆహ్వానం పంపారు.
అమీర్ చేస్తున్నది మన దేశానికి, ప్రజలకి సంబంధించి ఒక మంచి కార్యక్రమం. మన జీవితం బాగుంది కదా ఇంటి ఎదుటి వాళ్లతో మనకెందుకు అని అనుకోకుండా నేను కూడా ఈ సమాజంలో ఒక భాగమే కాబట్టి నా వంతు ఏదైనా చేయాలన్న ఆలోచనతో మనుషుల మనస్సులో, ఆలోచనల్లో కొంతైనా మార్పు తీసుకురావాలనే ఒక సదుద్దేశ్యంతో అమీర్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనమూ ప్రోత్సహిద్దాం.


Click it and Unblock the Notifications











