మా అమ్మనాన్నలకు విడాకులు ఇప్పిస్తా.. సీరియల్ నటుడు షాకింగ్ కామెంట్స్
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు శివకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'మౌనరాగం' సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం టెలివిజన్ రంగంలో వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తున్నారు. అయితే.. తెరపై ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే శివకుమార్ వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు, చేదు అనుభవాలతో నిండిపోయిందని తాజాగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ.. తన అమ్మనాన్నలకు విడాకులు ఇప్పిస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
శివకుమార్ విషయానికి వస్తే.. 'మౌనరాగం' సీరియల్‌లో తనతో కలిసి నటించిన ప్రియాంక జైన్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం కెరీర్‌లో బిజీగా ఉన్నప్పటికీ, పలు షోలు, కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ప్రియాంకేనని, తన బాధలు, సంతోషాలు అన్నీ ఆమెతోనే పంచుకుంటానని శివకుమార్ తరచూ చెబుతుంటారు.

అయితే ఈ సంతోషాల వెనుక ఆయన చిన్ననాటి జీవితం తీవ్ర విషాదంతో నిండిపోయింది. తన తండ్రి కారణంగా తాను, తన తల్లి, చెల్లెలు ఎన్నో మానసిక వేదనలు అనుభవించాల్సి వచ్చిందని వెల్లడించారు. తన తల్లి స్కూల్ టీచర్‌గా పనిచేసేదని, కానీ తండ్రి ఎప్పుడూ అనుమానాల మధ్యే జీవించేవాడని చెప్పారు. స్కూల్ నుంచి కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చినా 'ఎక్కడికి వెళ్లావ్? ఎవడితో తిరుగుతున్నావ్?' అంటూ తల్లిని అవమానించేవాడని, శారీరకంగా కూడా హింసించేవాడని గుర్తుచేసుకున్నారు.
తండ్రికి మద్యం, గుట్కా వంటి చెడు అలవాట్లు ఉండేవని, అలాగే ఇతర సంబంధాల కారణంగా కుటుంబం తీవ్రంగా ఇబ్బందులు పడేదని ఆయన తెలిపారు. చిన్నతనంలో ప్రతిరోజూ తల్లిని కొడుతుండటం చూసి తాను మానసికంగా ఎంతో కుంగిపోయానని చెప్పారు. తన చెల్లెలికి కూడా తండ్రి ప్రవర్తన కారణంగానే అబ్బాయిలంటే విరక్తి ఏర్పడిందని వెల్లడించారు.
అత్యంత బాధాకరమైన సంఘటనగా ఒక రోజు జరిగిన విషయాన్ని శివకుమార్ వివరించారు. తన తండ్రి జేబులో ఉన్న రూ.20 కనిపించకపోవడంతో, ఆ డబ్బును తానే తీసుకున్నానంటూ పెద్ద గొడవ చేశాడని చెప్పారు. వాస్తవానికి ఆ డబ్బును తండ్రే ఎక్కడో ఖర్చు చేసి ఉండొచ్చని, కానీ ఆ కోపాన్ని కుటుంబంపై చూపించాడని తెలిపారు. కేవలం రూ.20 కోసం చేసిన గొడవతో ఊరంతా తమ ఇంటి ముందు చేరిందని, ఆ అవమానం తమను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు.
ఆ సంఘటన తర్వాత జీవితం పట్ల పూర్తిగా విసుగు వచ్చిందని శివకుమార్ చెప్పారు. తల్లి,చెల్లెలుతో కలిసి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. అగ్గిపెట్టె వెలిగించే సమయానికి తమ తల్లి వద్ద చదివిన ఓ విద్యార్థి వచ్చి అడ్డుకోవడంతో ప్రాణాలు దక్కాయని తెలిపారు. ఆ విద్యార్థి లేకపోయి ఉంటే ఈరోజు తాను బతికి ఉండేవాడిని కాదని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇంకా మాట్లాడుతూ, ఎవరైనా మంచి తండ్రి తన పిల్లలతో ప్రేమగా ఉండటం చూస్తే తనకు చాలా బాధ కలిగేదని చెప్పారు. 'నాకెందుకు అలాంటి తండ్రి దొరకలేదు?' అనే ప్రశ్న ఎప్పుడూ తన మనసులో ఉండేదని అన్నారు. తండ్రి ప్రేమ కోసం ఎన్నోసార్లు ఎదురుచూసినా అది తనకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇన్ని బాధలు ఎదురైనా తన తండ్రిపై ద్వేషం పెట్టుకోలేదని శివకుమార్ చెప్పారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఇప్పటికీ కోరుకుంటానని తెలిపారు.
అయితే తన తల్లి ఇక మిగతా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నానని, అందుకే తండ్రి నుంచి విడాకులు తీసుకునేలా సహాయం చేస్తున్నానని వెల్లడించారు. ఇన్నేళ్లుగా మౌనంగా భరించిన బాధలను బయటపెట్టిన శివకుమార్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications






