మా కడుపున పుడుతున్నందుకు రుణపడి ఉంటాం... డెలివరీ వేళ శివజ్యోతి ఎమోషనల్
సాధారణ న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి సెలబ్రిటీగా మారారు శివజ్యోతి అలియాస్ జ్యోతక్క అలియాస్ తీన్మార్ సావిత్రి. ఓ తెలుగు ఛానెల్‌లో తీన్మార్ వార్తలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో అవకాశం దక్కించుకుని మరింత పాపులర్ అయ్యారు. ఎన్నో కష్టాలు పడి జీవితంలో ఓ స్థాయికి చేరినప్పటికీ ఓ బాధ ఆమెను వెంటాడింది. పెళ్లయి దాదాపు పదేళ్లు కావొస్తున్నా పిల్లలు లేకపోవడంతో సావిత్రి దంపతులు కుమిలిపోయారు. ఈ క్రమంలో గతేడాది ఆమె గర్భం దాల్చడంతో వీరి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తాజాగా 9 నెలల జర్నీ పూర్తి చేసుకుని డెలివరీకి దగ్గరపడటంతో శివజ్యోతి ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామానికి చెందిన శివజ్యోతి అంచెలంచెలుగా ఎదిగింది. ఓ ఛానెల్‌లో ప్రసారమైన తీన్మార్ వార్తలు కార్యక్రమంలో తెలంగాణ యాసలో బిత్తిరి సత్తిరి, మంగ్లీలతో కలిసి సావిత్రి చేసిన అల్లరి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ షోతో వీరు ముగ్గురు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీలుగా మారిపోయారు. పలు ఛానెల్స్‌లో యాంకర్‌గా పనిచేసిన శివజ్యోతి ఆ తర్వాత సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టగా ఆమెకు భారీగా ఫాలోయింగ్ ఏర్పడింది.

తీన్మార్ వార్తలు చదువుతూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ దూసుకుపోతున్న దశలో ఆమెకు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. కొన్నాళ్లు అలరించిన జ్యోతక్క ఎలిమినేషన్ తర్వాత యాంకరింగ్, న్యూస్ రీడర్ కెరీర్‌ను వదిలేశారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో రీల్స్‌తో పాటు యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి కంటెంట్ అప్‌లోడ్ చేసేది. ఆ తర్వాత పలు ప్రైవేట్ కార్యక్రమాలపై స్పెషల్ వీడియోలు చేస్తూ కెరీర్‌లో నిలదొక్కుకున్నారు శివజ్యోతి.
చిన్న వయసులోనే ఆమె గంగూలి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ వివాహం వారి స్వగ్రామంలో వివాదాస్పదం కావడంతో పాటు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో శివజ్యోతి దంపతులు హైదరాబాద్ వచ్చేశారు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయిని సాధించారు. ఉండటానికి ఇల్లు, కారు, ఆర్ధిక భద్రతను సంపాదించినప్పటికీ ఈ దంపతులకు ఒకే ఒక్క లోటుంది. అదే పిల్లలు. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో శివజ్యోతి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది తాను గర్భం దాల్చినట్లు ప్రకటించి ఆ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు శివజ్యోతి. ఏడు శనివారాల వ్రతం, తిరుమల శ్రీవారి ఆశీస్సులతో తల్లిని కాబోతున్నట్లు శివజ్యోతి ఎమోషనల్ అయ్యారు. అయితే తిరుమలలో శ్రీవారి ప్రసాదంపై శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో ఆమె క్షమాపణలు చెప్పారు.
డెలివరీ అయిన నాటి నుంచి ప్రతి సందర్భాన్ని వీడియో తీస్తూ వాటిని అభిమానులతో పంచుకోవడంతో పాటు గర్భం దాల్చిన మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక వీడియోలు పెట్టేవారు శివజ్యోతి. తాజాగా తనకు 9 నెలలు నిండటం, త్వరలో డెలివరీకి వెళ్తుండటంతో జ్యోతక్క ఎమోషనల్ అయ్యింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. నా చిన్ని పాప లేదా బాబుకు.. గర్భం దాల్చినప్పటి నుంచి 9 నెలల ప్రెగ్నెన్సీ ప్రయాణం ఎంతో ఆనందంగా, అందంగా, అద్భుతంగా సాగనిచ్చినందుకు థ్యాంక్స్. ఈ కాలంలో ఒక్కసారి కూడ నువ్వు నన్ను ఇబ్బంది పెట్టలేదు. కొన్నిసార్లు ఇబ్బంది అనిపించినప్పుడు అది ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగం. దానిని కూడా మేం ఆస్వాదించాం.
మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు నేనూ, నాన్న ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. నువ్వు మమ్మల్ని అర్ధం చేసుకునే బిడ్డగా ఉంటావని మాకు తెలుసు. నువ్వు మా జీవితంలో ఉండటమే మా అదృష్టం, మాకు అతిపెద్ద ఆశీర్వాదం. మా చేతుల్లో, మా గుండెల్లో నిన్ను పట్టుకోవడానికి ఎదురుచూస్తున్నాం. ఈ గర్భదారణ ప్రయాణం లాగే డెలివరీ కూడా సురక్షితంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇట్లు మీ అమ్మానాన్న అని శివజ్యోతి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా శివజ్యోతిని ఆశీర్వదిస్తూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











