Shiva Jyothi: తిరుమల ప్రసాదంపై వ్యాఖ్యలు... యాంకర్ శివజ్యోతికి షాకిచ్చిన టీటీడీ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ప్రతినిత్యం కొన్ని లక్షలమంది భక్తులు దర్శించుకుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి దేశం నలుమూలల నుంచి స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తారు. ఆనంద నిలయంలో స్వామి వారిని ఒక్క నిమిషం పాటు దర్శించుకుని తాము పడిన కష్టమంతా మరిచిపోతారు. భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. క్యూలైన్‌లో ఉన్న వారికి అన్న ప్రసాదం, పాలు, మజ్జిగ, అల్పాహారాలు అందిస్తోంది.
తీన్మార్ కార్యక్రమంతో ఫేమస్
తిరుమల యాత్రకు వచ్చిన భక్తులుకు శ్రీవారి ప్రసాదం కూడా అంతే పవిత్రం. టీటీడీ ఇచ్చే లడ్డూ, ఇతర ప్రసాదాలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కోసం తీసుకెళ్లి పంచుకుని పులకించిపోతారు భక్తులు. అలాంటిది తిరుమల శ్రీవారి ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుంది తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి. సాధారణ న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ... తీన్మార్ సావిత్రిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణ యాసలో బిత్తిరి సత్తితో కలిసి చేసిన అల్లరితో పాపులరైన శివజ్యోతికి ఆ తర్వాత బిగ్‌బాస్ షో మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో రెండు చేతులా సంపాదిస్తోంది.

శ్రీవారి ప్రసాదంపై శివజ్యోతి వ్యాఖ్యలు
తన సోదరుడు, భర్తతో కలిసి ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లింది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా క్యూలైన్‌లో అక్కడి భక్తుల కోసం ఇస్తున్న ప్రసాదాన్ని తీసుకున్న తమ్ముడిని ఉద్దేశించి.. సోనీ కాస్ట్‌లీ ప్రసాదాన్ని అడుక్కుంటున్నాడని సెటైర్లు వేసింది. తిరుమలలో రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమేనంటూ వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శ్రీవారి భక్తులు, సాంప్రదాయవాదులు శివజ్యోతి వ్యాఖ్యలపై మండిపడ్డారు.
శివజ్యోతి క్షమాపణలు
అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో శివజ్యోతి దిగొచ్చింది. శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పింది. నాకు వెంకటేశ్వరస్వామి అంటే ఎంతో ఇష్టం. గత కొద్దినెలలుగా శనివారం వ్రతం చేస్తున్నాను.. నాకు బిడ్డను కూడా వెంకటేశ్వరస్వామి ఇచ్చి నా జీవితాన్ని మార్చాడు. నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయ్యుంటే తనను క్షమించాలని శివజ్యోతి కోరింది. కాస్ట్‌లీ లైన్‌లో నిలబడి ఉండటం వల్లే రిచ్ అనే మాటను వాడానని వివరణ ఇచ్చింది. నేను అనుభవిస్తున్న ప్రతీది వెంకటేశ్వరస్వామి దయ వల్ల వచ్చిందేనని చెప్పింది.
శివజ్యోతి వ్యాఖ్యలపై టీటీడీ సీరియస్
శివజ్యోతి క్షమాపణలతో ఈ వివాదం సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ ఈ వ్యాఖ్యలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సీరియస్‌గా తీసుకుని యాక్షన్‌లోకి దిగింది. భవిష్యత్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలు లేకుండా శివజ్యోతి ఆధార్ కార్డ్‌ను టీటీడీ అధికారులు బ్లాక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమెపై జీవితకాలం బ్యాన్ విధించినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా టీటీడీ నిర్ణయాన్ని శ్రీవారి భక్తులు స్వాగతిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే దీనిపై యాంకర్ శివజ్యోతి ఎలా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











