'అలా సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. ఆ వ్యక్తే లేకపోతే..'
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటుడు శివకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'నిన్నుకోరి' సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం టెలివిజన్ రంగంలో వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తున్నారు. అలాగే.. తన సహా నటి బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తో సహజీవనం చేస్తున్నారు. అయితే.. తెరపై ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే శివకుమార్ వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు, చేదు అనుభవాలతో నిండిపోయిందని తాజాగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ. తాజాగా 'కిస్సిక్ టాక్' కార్యక్రమంలో శివ్ కుమార్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి వరకు ప్రేక్షకులు శివ్ కుమార్‌ను ఓ ప్రశాంత స్వభావం ఉన్న వ్యక్తిగా మాత్రమే చూసారు. కానీ ఆయన బాల్యం, కుటుంబ పరిస్థితులు, తండ్రితో ఉన్న చేదు అనుభవాల గురించి చెప్పిన తర్వాత చాలా మంది భావోద్వేగానికి గురవుతున్నారు. ముఖ్యంగా తల్లి పడిన కష్టాలు, కుటుంబం ఎదుర్కొన్న మానసిక వేదన గురించి ఆయన చెప్పిన మాటలు హృదయాలను కదిలిస్తున్నాయి. శివ్ కుమార్ మాట్లాడుతూ తన తల్లి ఓ స్కూల్ టీచర్ అని, చిన్నప్పటి నుంచి ఆమెను చూసే పెరిగిన కారణంగా ప్రతి మహిళను గౌరవంగా "మేడమ్" అని పిలవడం అలవాటైందని చెప్పారు. అదే సమయంలో తన జీవితంలో ప్రియాంక జైన్ పాత్ర ఎంత ముఖ్యమో కూడా వివరించారు.

"నాకు ప్రియాంక మాత్రమే బెస్ట్ ఫ్రెండ్, లవర్, కుటుంబం. నా సంతోషం, బాధ అన్నీ ఆమెతోనే పంచుకుంటాను" అంటూ ఆమెపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. అయితే ఇంటర్వ్యూలో అత్యంత ఎమోషనల్ క్షణం ఆయన తండ్రి గురించి మాట్లాడినప్పుడే వచ్చింది. తన తండ్రి మద్యం సేవించడం, అనుమాన స్వభావం కలిగి ఉండటం, తల్లిని తరచూ వేధించడం వంటి విషయాలను గుర్తు చేసుకున్నారు. చిన్న చిన్న కారణాలకే ఇంట్లో గొడవలు జరిగేవని, వాటిని చూస్తూ తాను, తన చెల్లి మానసికంగా తీవ్రంగా బాధపడ్డామని తెలిపారు.
ఒక సందర్భంలో కేవలం రూ.20 కనిపించకపోవడంతో ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని, ఆ సంఘటన తర్వాత తల్లి, తాను, చెల్లి ముగ్గురూ కలిసి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని సంచలన విషయం వెల్లడించారు. అయితే సరిగ్గా ఆ సమయంలో తన తల్లి వద్ద చదివిన ఓ విద్యార్థి అక్కడికి వచ్చి వారిని అడ్డుకున్నాడని, లేదంటే ఈరోజు తాను జీవించి ఉండేవాడిని కాదని భావోద్వేగంగా చెప్పారు.
తన జీవితంలో తండ్రి ప్రేమ ఎప్పుడూ దక్కలేదని, అందుకే భవిష్యత్తులో మంచి భర్తగా ఉండాలని, ప్రియాంకతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నానని శివ్ కుమార్ తెలిపారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న తన తల్లికి ఇప్పుడు తండ్రి నుంచి విడాకులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. శివ్ కుమార్ చెప్పిన ఈ నిజ జీవిత కథ ప్రస్తుతం అభిమానులను కదిలిస్తోంది. తెరపై కనిపించే చిరునవ్వుల వెనుక ఇంత బాధ దాగి ఉందా అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయన ధైర్యంగా తన జీవితంలోని చేదు అనుభవాలను పంచుకోవడాన్ని పలువురు అభినందిస్తున్నారు.


Click it and Unblock the Notifications



