షాకింగ్: జబర్ధస్త్ నుంచి తప్పుకున్న రోజా.. ఆమె స్థానంలో ఎవరు వచ్చారంటే..?
ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తన వృత్తిని కొనసాగిస్తున్నారు ప్రముఖ నటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరం అయినా.. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నారు. దీంతో ఆమెకు ఎంతో మంది అభిమానులు పెరిగిపోయారు. పార్టీలకతీతంగా రోజాను అభిమానించే వాళ్ల లిస్ట్ చాలా పెద్దదే. అందుకే ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇలాంటి తరుణంలో రోజా.. జబర్ధస్త్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఎమ్మెల్యేగా విజయం
రోజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో రోజాకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆమెను తన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీఐఐసీ చైర్మన్ పదవి
మంత్రివర్గంలో స్థానం దక్కకపోయినప్పటికీ రోజాకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ పదవి దక్కింది. ఇది కేబినెట్ హోదా పదవి అని ప్రభుత్వం ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం భర్త సెల్వమణితో కలిసి ఛాంబర్‌లోకి అడుగుపెట్టిన రోజా.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు అధికారులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.

సినిమాల్లోకి రీ ఎంట్రీ
ఇటీవల రోజా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమె త్వరలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నదే ఆ వార్త సారాంశం. టాలీవుడ్‌లోని ఓ టాప్ హీరో నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర కోసం రోజాను చిత్ర యూనిట్ సంప్రదించిందని తెలుస్తోంది. దీనికి ఆమె కూడా ఓకే చెప్పేశారని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

జబర్ధస్త్‌కు దూరం
ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి జబర్ధస్త్ అభిమానులు ఫీలైపోతున్నారు. దీనికి కారణం ఆమె ఆ షోలో కనిపించరేమోనన్న బాధే. ఈ షోలో రోజా మార్క్ అంతలా చూపించారు. ఈ వార్తలకు బలం చేకూర్చుతూ రోజా వచ్చే వారం ఎపిసోడ్ నుంచి తప్పుకున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోతో ఇది స్పష్టమైంది. దీంతో రోజా ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

రోజా స్థానంలో మాస్టర్
రోజా గైర్హాజరుతో ఆమె స్థానంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌ను జడ్జిగా తీసుకు వచ్చారు. ఆయన మరో న్యాయ నిర్ణేత నాగబాబుతో కలిసి మార్కులు ఇవ్వనున్నారు. అయితే, రోజా షో నుంచి తప్పుకున్నది తాత్కాలికంగానా..? లేక మొత్తానికా..? అన్నది మాత్రం తెలియ రాలేదు. ఒకవేళ ఆమె షోలో కనిపించకపోతే ఆ ప్రభావం కనిపిస్తుందని కొందరు అంటున్నారు.


Click it and Unblock the Notifications











