మారతాడనుకున్నా .. నా జీవితం నాశనం చేసి .. మాజీ భర్త మరణంపై బుల్లితెర నటి
హిందీ బుల్లితెర నటి శుభాంగి ఆత్రే మాజీ భర్త పీయూష్ పూరే మరణం బాలీవుడ్‌కు దిగ్భ్రాంతి కలిగించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 19న కన్నుమూశారు. కాలేయ సంబంధిత అనారోగ్యంతో పీయూష్ పోరాడుతున్నారు. ఆయన మరణం, అనారోగ్య సమస్యలు, విడాకులపై పీయూష్ మాజీ భార్య, బుల్లితెర నటి శివాంగి అత్రే కీలక వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన పీయూష్ పూరే స్థానిక దేవి అహిల్య విశ్వవిద్యాలయాలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2003లో శుభాంగిని ఆయన పెళ్లాడారు. పీయూష్ పూరే దేశంలోని వివిధ మీడియా సంస్థలలో కీలక హోదాలలో పనిచేశారు. నవభారత్, ప్రభాత్ కబర్, దైనిక్ భాస్కర్ గ్రూప్, పయినీర్ బుక్ కంపెనీ వీటిలో ముఖ్యమైనవి. 2022లో శుభాంగి నుంచి పీయూష్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని 2023లో అధికారికంగా ప్రకటించారు. దాంతో 22 ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి తెరపడినట్లయ్యింది. వీరికి కుమార్తె ఆషి సంతానం.

మీడియా, అడ్వర్టైజింగ్ రంగాల్లో ఉన్నత హోదాతో పాటు మంచి పేరు పీయూష్.. తన భార్య శుభాంగి కోసం ఉద్యోగాన్ని వదులుకుని ఆమె నటనా జీవితానికి ఎంతో సాయం చేశారు. శుభాంగి షూటింగ్స్‌లో బిజీగా ఉండటంతో కుటుంబ బాధ్యతలు, కుమార్తె ఆలనా పాలనను ఆయనే చూసుకున్నారు. అలా పీయూష్- శుభాంగిల జంట గురించి బుల్లితెర ఇండస్ట్రీలో గొప్పగానే చెప్పుకున్నారు. అలాంటిది వీరిద్దరూ విడిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. విడాకులు తీసుకున్న మూడేళ్లకే పీయూష్ కన్నుమూయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
మాజీ భర్త మరణంపై శుభాంగి ఆత్రే కీలక వ్యాఖ్యలు చేశారు. బాలాజీ టెలీ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఏక్తా కపూర్ నిర్మించిన కసౌటీ జిందగీ హైతో ఆమె బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కస్తూరి, బాబీజి ఘర్ పార్ హై, చిదియా ఘర్, అదూరి కహానీ హమారా వంటి సీరియల్స్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. పీయూష్ చనిపోయే సమయానికి షూటింగ్‌లో ఉన్న శుభాంగి.. తక్షణం బయటికొచ్చేశారు.
తాను టీవీ ఇండస్ట్రీలో సక్సెస్ కావడం వల్ల పీయూష్‌కు విడాకులు ఇచ్చానని చాలా మంది అనుకుంటారని, కానీ అది ఏమాత్రం నిజం కాదని అతనికున్న వ్యసనాల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని శుభాంగి క్లారిటీ ఇచ్చారు. మా అన్యోన్యమైన దాంపత్యాన్ని కాపాడుకోవాలని, బంధాన్ని నిలుపుకోవాలని ఎంతగానో ప్రయత్నించానని, కానీ పరిస్ధితులు అప్పటికే చేయి దాటిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పీయూష్‌తో తాగుడు మాన్పించేందుకు ఎంతో ప్రయత్నించామని.. చివరికి రిహాబిలిటేషన్ సెంటర్‌కు కూడా పంపించానని శుభాంగి పేర్కొన్నారు. ఎంత చేసినా ఆయనతో మార్పు రాలేదని.. నా తల్లిదండ్రులు, అత్తమామలు, బంధుమిత్రులు ఆయన్ను మార్చాలని ఎంతో ప్రయత్నించినా లాభం లేకుండా పోయిందని శుభాంగి అన్నారు. చివరికి అది పీయూష్ జీవితాన్నే కాదు.. మా కుటుంబంపైనా ప్రభావం చూపిందని ఆమె తెలిపారు. విడాకులు తీసుకున్నాక కూడా తాను పీయూష్‌తోనే టచ్‌లోనే ఉన్నట్లు శుభాంగి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











